షారుక్ ఖాన్
షారుక్ ఖాన్... పెద్ద పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే సినిమాల్లానే షారుఖ్ నటన కూడా విభిన్నంగా ఉంటుంది. షారుక్ హీరోగా నటించిన మరో డిఫరెంట్ మూవీ ‘జీరో’. కత్రినా కైఫ్, అనుష్కా శర్మ కథానాయికలుగా నటించారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జీరో’ ప్రయాణాన్ని ‘సాక్షి’తో షారుక్ ఇలా పంచుకున్నారు.
► ‘జీరో’ సినిమా కథనం ఎలా ఉంటుంది?
సాధారణ జీవితం గడిపే ప్రజల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఎమోషనల్ కంటెంట్ ఉంది. దేవుడు మనకు ఒకటే జీవితం ఇచ్చాడు. మనలో ఉన్న లోపాలను గుర్తు చేసుకుంటూ ఏం సాధించలేకపోతున్నాం అని పశ్చాత్తాప పడకూడదు. ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదని చెప్పే చిత్రం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అసంపూర్ణమైన అంశం ఉంటుంది. దేవుడు మనల్ని ఎలా సృష్టిస్తే అలానే జీవితాన్ని ఆస్వాదించాలి. మనం మనలా ఉంటేనే జీవితాన్ని ఆస్వాదించగలం. కానీ సక్సెస్ అయిన వాళ్ల ప్లేస్‌లో మనం ఉంటే బాగుండేదని కొందరు ఆలోచిస్తుంటారు. అది తప్పు. మన బాడీ మనది, మన ఎమోషన్ మనది. అలా జరిగి ఉంటే.. ఇలా జరిగి ఉంటే... ఇలాంటి ఆలోచనలను వదిలివేయాలి. నిజాన్ని ఒప్పుకోవాలి. నీకు పాటలు పాడటంలో నైపుణ్యం ఉంటే సాధనతో లతా మంగేష్కర్ కూడా అవ్వొచ్చు. మనం సచిన్ టెండూల్కర్ ఎందుకు కాలేదు? అని ఆలోచిస్తుంటారు కొందరు.
► మనలో ఉన్న లోపాల గురించి బాధపడకూడదు. సెలబ్రేట్ చేసుకోవాలి. అదే ‘జీరో’ సినిమా అంటున్నారు. నిజ జీవితంలో ఇది సాధ్యమా?
హృదయం, శరీరం, మెదడు అందిరికీ ఉంటాయి. జుట్టు, కలర్, ముక్కు, నోరు ఉంటాయి. తేడాలు మనం పిలుచుకునేవి. లైఫ్‌లో పెరగడంలో కొన్ని ఫేజ్‌లను దాటుకుంటూ వస్తాం అంతే. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా కొన్ని కుదరవు. మనకు మనం ప్రత్యేకమని తెలుసుకోవాలి. ఒక కుటుంబంలోని తండ్రి అందరినీ ఒకేలా చూస్తాడు. ఎక్కువ తక్కువలు ఉండవు. కొందరు మా ఫాదర్ అది ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదు అంటారు. జీవితం ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలి. నీకు లోపాన్ని ఇచ్చిన దేవుడు ఏదో ప్రత్యేకత కూడా ఇచ్చే ఉంటాడు. వెతికి పట్టుకుని పోరాడు.
► మనల్ని మనం నమ్మడం అంటే?
నేను బేసిక్‌గా లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. మధ్య తరగతి వారందరికీ నేను ఒక ఉదాహరణ. మా అమ్మానాన్నలు కూడా మమ్మల్ని పోషించడానికి, చదివించడానికి కష్టపడ్డారు. వారు అంతగా చదువుకోలేదు. నిన్ను నువ్వు నమ్మాలి. నేను బెస్ట్ ఫైటర్‌ని కాదు, బెస్ట్ బాడీ లేదు. కానీ నాకు పని ఉంది. కష్టపడాలి అనుకున్నాను. నా బెస్ట్ ఇచ్చాను. తపన ఉంటే ఎవరైనా నాలాగా కావచ్చు. కానీ చేస్తున్న పనిని నమ్మాలి. నా కెరీర్‌స్టార్టింగ్‌లో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. చాలా తెలుసుకున్నాను. చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది. అఫ్‌కోర్స్ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఉంటాను కూడా. ఇది నిజం. హీరో కాబట్టి నాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఖరీదైన దుస్తులు వేసుకుంటాను. నేను ఏం చెప్పినా చిటికెలో జరిగిపోతుంది. ఇవన్నీ సినిమాలోనే. నిజ జీవితంలో నేనూ చాలా సింపుల్‌గా ఉంటాను. అందరూ చేసే పనులే చేస్తుంటాను.
► 40 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ చేశారు కదా?
హార్డ్ వర్క్‌ను నమ్ముతాను. నా డ్యాన్స్ హృతిక్ రోషన్‌లా ఎందుకు లేదు? అమితాబ్‌గారిలా నా వాయిస్ ఎందుకు బాగా రాలేదు? అని నేను బాధపడలేదు. నాకు చేతనైనంతలో దేవుడు నాకు ఇచ్చిన దాంతో కష్టపడుతుంటాను. వాళ్ల స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ వారిలా కావాలని అనుకోను. నేను దేశంలో బెస్ట్ డ్యాన్సర్‌ని కాను. నా 42 ఏళ్ల వయసులో నేను సిక్స్‌ప్యాక్ చేశాను. ఎలా చేశానంటే నేను చేయగలనని నమ్మాను. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ బాడీలను చూశాను. ఇన్‌స్పైర్ అయ్యాను. చేశాను. ఇతరుల ప్రతిభను అంగీకరించడం మంచి లక్షణం. నువ్వు సాధించాలని అనుకున్నదాని గురించి నీ మైండ్‌లో నువ్వు ఎంత బలంగా ఫిక్స్ అయ్యావు? అన్నదే ముఖ్యం.
► ‘జీరో’ టైటిల్ పెట్టడానికి కారణం?
జీరో అంటే రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి జీరోతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. మరోటి జీరోతో ముగుస్తుంది. దేన్ని తీసుకోవాలో మన చేతుల్లో ఉంటుంది. సినిమా అంటనే లైఫ్‌లో చేయలేనివి చేయడం. కొన్ని సినిమాల్లో నేనూ చేశాను. ఒక్కడినే వందమందిని కొట్టాను. వెయ్యి మందితో డ్యాన్స్ చేశాను. గాల్లో ఎగిరాను. కానీ నేను సినిమా హీరోని. రియల్ లైఫ్ హీరోలు చాలా సింపుల్‌గా ఉంటారని నా నమ్మకం. నిజానికి జీవితం ముందు మనం చిన్నవాళ్లం. నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకున్నప్పుడు నీవు ఏదైనా సాధించగలవు అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు జీరోతోనే స్టార్ట్ కావాలి.
► ఇటీవల మీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయా?
సినిమాను హిట్ చేయడం, చేయకపోవడం నా చేతుల్లో లేదు. ఆడియన్స్ చూస్తారు. నచ్చితే హిట్ అవుతుంది. లేకపోతే లేదు. నేను నమ్మినదాన్ని ఫాలో అవుతాను. కష్టపడతాను. అలానే నేను షారుక్ ఖాన్ అయ్యాను. నా సినిమా సరిగ్గా ఆడలేదు అంటే నేను సరిగ్గా చేయలేదని కాదు. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు సినిమాలో ఏదో మిస్ అయ్యిందని. అంతే. అలాగే నా సినిమా హిట్ సాధిస్తే అది నా గొప్పతనం కాదు. ఆడియన్స్ సినిమాను హిట్ చేశారు. ఒకే రకమైన సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ‘చక్ దే ఇండియా, చెన్నై ఎక్స్‌ప్రెస్, ఫ్యాన్, దిల్‌వాలే దిల్ లేజాయేంగే, దేవదాసు, రాయీస్, బాజీఘర్, అశోక’.. ఇలా దేనికదే విభిన్నం.
► ‘జీరో’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారట కదా?
యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పవు. నేను గాయపడ్డ సినిమాలన్నీ సూపర్ హిట్లే. కానీ జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవడానికి ఆలోచించకూడదు. ప్రయత్న లోపం ఉండకూడదు.
► 100 కోట్లు, 200 కోట్లు.. ఇలా సినిమాల క్లబ్‌ల గురించి మాట్లాడుతుంటారు? ఇవి మీకు ఎలా అనిపిస్తుంటాయి?
కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూస్తుంటాను. ఈ సినిమా వందకోట్లు చేస్తుంది. 200 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని రిలీజ్‌కు ముందే చెబుతుంటారు. బాధగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాకు గౌరవం ఇవ్వాలి. నంబర్‌కి కాదు. తక్కువ నంబర్లు ఉంటేనే ఎక్కువ నేర్చుకోగలం. నా చిన్నప్పుడు 20 రూపాయలే నాకు పెద్ద అమౌంట్. 20 ఏళ్ల క్రితం నా దగ్గర ఏమీ లేనప్పుడు కోటి రూపాయలు ఉంటే కోటీశ్వరుడిని అవుతాను కదా అని అనుకునేవాడిని. దర్శకుడు మహేశ్ భట్ నీకు గొప్ప భవిష్యత్ ఉంది అని ప్రోత్సహించేవారు. 500 మిలియన్స్ బిల్‌గేట్స్‌కు తక్కువ అమౌంట్ కావొచ్చు. కానీ నేను బిల్ గేట్స్‌ని కాదు. కష్టపడి పెరిగాను. డబ్బు విలువ తెలుసు.
► అభిమానులు మిమ్మల్ని కింగ్ ఖాన్ అని పిలుస్తుంటే ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది?
కొందరు అభిమానులు నన్ను కింగ్‌ఖాన్ అని పిలుస్తుంటారని విన్నాను. ఆ పిలుపుని నేను పెద్ద సీరియస్‌గా తీసుకోను. షూటింగ్స్‌కి వెళతాను. కుటుంబంతో సమయం గడుపుతాను. నిజానికి రజనీసార్ ఈజ్ తలైవా. అమితాబ్‌బచ్చన్ ఈజ్ షెహన్‌షా (రాజులకే రాజు). మనం కింగ్స్ కాదు (నవ్వుతూ)..
– గౌతమ్ మల్లాది
ప్రాంతీయ సినిమాల గురించి ....
ప్రాంతీయ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇండియా మొత్తం రిలీజ్ చేయాలనుకోరు కాబట్టి క్రియేటివ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ల సక్సెస్‌కు అదొక కారణం అయ్యుండొచ్చు. కమర్షియల్ సినిమా ప్యారామీటర్ కూడా మారుతోంది. ఇండస్ట్రీ అభివృద్ధిని కాంక్షించే ఏ మార్పు అయినా మంచిదే కదా.
హైదరాబాద్‌తో మీ అనుబంధం...
అవును. మా అమ్మగారు హైదరాబాదీ. టోలీచౌకిలో ఉండేవాళ్లం. మా నాన్నగారు నార్త్. సౌత్ అండ్ నార్త్ గుడ్ కాంబినేషన్ (నవ్వుతూ). మా అమ్మ తరఫు బంధువులు ఉన్నారు. షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని కలవాలనుకుంటాను. కానీ టైమ్ కుదరదు. లైఫ్‌లో అన్నీ మారుపోతుంటాయని కాలం అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటుంది.
షారుక్ ఖాన్, కత్రినా కైఫ్
‘జీరో’ సెట్‌లో షారుక్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్
షారుక్ ఖాన్, అనుష్కా శర్మ
Comments
Please login to add a commentAdd a comment