
తమిళసినిమా: సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలో ఇక్కడ రక్షణ లేదని భయపడ్డానన్నారు నటి సమంత. తొలుత కోలీవుడ్‌లో నటనకు శ్రీకారం చుట్టి ఆపై టాలీవుడ్‌లో జయకేతనం ఎగరేసిన నటి ఈ చెన్నై చిన్నది. అనంతరం తమిళం, తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడడంతో సమంత కెరీర్ కుంటుపడుతుందని కొందరు భావించారు. సమంత పెళ్లికి సిద్ధం అవుతుండడంతో అక్కినేని అంత పెద్ద కుటుంబంలో చేరబోతున్నారు. ఇక నటనకు గుడ్‌బై చెప్పడం ఖాయం అని అనుకున్నారు.
సమంత మాత్రం తాను వివాహానంతరం నటిస్తానని వెల్లడించారు. దీంతో కొందరు కథానాయకిగా అవకాశాలు రావు అని అనుకున్నారు. అయితే ఇలాంటి ఊహాగానాలేవీ సమంత విషయంలో జరగలేదు. తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. ముందుగా చెప్పినట్లుగానే వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారు. కథానాయకిగానే అవకాశాలు వరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సమంతకు పెళ్లి తరువాతే నటనకు అవకాశం ఉన్న పాత్రలు తలుపుతడుతున్నాయి. ఈ మధ్య విడుదలైన తెలుగు చిత్రం రంగస్థలంలో సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు చేతినిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూటర్న్ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుంది. ఇటీవల నటి సమంత ఒక భేటీలో పేర్కొంటూ వివాహానంతరం తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. మొదట్లో ఈ రంగంలో రక్షణ లేదనే భావన కలిగిందన్నారు. అదృష్టవశాత్తు తాను నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధించి తనలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు నూతన పయనానికి దోహదపడ్డాయన్నారు. తానిప్పుడు వృత్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నానని చెప్పారు. వివాహానంతరం తన భర్త కుటుంబం స్వేచ్ఛగా జీవించడానికి అనుమతించారని అన్నారు. వారి ఆదరణతో తాను సినిమాల్లో మరింత సాధించగలనని సమంత ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment