సమంత 'యు టర్న్' తీసుకుంటుందట
ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో అల్లరిపిల్లలా కనిపించిన సమంత, త్వరలో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. ఇన్నాళ్లు చేసిన సినిమాలతో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ వచ్చినా, నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మాత్రం రాలేదు. అందుకే తానే స్వయంగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మించాలనుకుంటోంది. అయితే కొత్త కథతో రిస్క్ చేసేకన్నా ఇప్పటికే సక్సెస్ అయిన సినిమా అయితే బెటర్ అని నిర్ణయించుకుంది.
అందుకే కన్నడgలో సక్సెస్ సాధించిన 'యు టర్న్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది సమంత. ఇటీవల రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ శాండల్వుడ్లో సంఛలన విజయం సాధించింది. ఓ యు టర్న్ దగ్గర వరుసగా మరణాలు సంభవిస్తుండటం వెనుక మిస్టరీని ఛేదించే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల నాగచైతన్యతో కలిసి ఈ సినిమా చూసిన సమంత త్వరలోనే రీమేక్ను సెట్స్ మీదకు తీసుకెళ్లనుంది.
కన్నడలో లూసియా ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ నటించలేదు. అయినా మౌత్ టాక్తో మంచి వసూళ్లను సాధిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న యు టర్న్ సినిమా రీమేక్కు సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.