పెదవి ముద్దుకి సిద్ధం
తెలుగు ప్రేక్షకులు ఆదరించి స్టార్‌ని చేయడం, ఆ ఇమేజ్‌ని అడ్డం పెట్టుకొని కోలీవుడ్‌లో ఎదగడానికి ప్రయత్నాలు చేయడం.. కొన్నాళ్లుగా హీరోయిన్లకు పరిపాటైపోయింది. శ్రీయ, తమన్నా, అనుష్క, ఇప్పుడు కాజల్. వీరందరూ ఇలా చేసిన వారే. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి సమంత కూడా చేరబోతోంది. తెలుగు ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మకు ‘నంబర్‌వన్ హీరోయిన్’ అనే కిరీటాన్ని కట్టబెట్టేశారు. కానీ ఆ విషయాన్ని కూడా విస్మరించి తమిళ సినిమాల కోసం వెంపర్లాడుతోంది సమంత. ఇటీవలే.. కోలీవుడ్‌లో కాజల్‌కు దక్కిన ఓ భారీ ఛాన్స్‌ని సైతం సమంత కొట్టేసిందని అక్కడ టాక్. వివరాల్లోకెళితే... విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ముందు అనుకున్న కథానాయిక కాజల్. కోటిన్నర రూపాయలు పారితోషికంగా కూడా కాజల్‌కి అందించారట సదరు చిత్ర నిర్మాతలు. అయితే... కథ రీత్యా ఇందులో కథానాయిక గ్లామర్‌ని కాస్తంత ఎక్కువగా వలికించాలి. దాంతో పాటు ఓ భారీ లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది.
ఈ విషయం తెలిసి కాజల్ ససేమిరా అందట. ఇచ్చిన పారితోషికాన్ని వెనక్కు ఇవ్వడానికి కూడా సిద్ధపడిందట. దీంతో షాక్‌కి గురైన దర్శక, నిర్మాతలకు సమంత కొండంత అండగా నిలిచిందని కోలీవుడ్ సమాచారం. గ్లామర్ విషయంలో ‘నో’ చెప్పినా... లిప్ లాక్ విషయంలో మాత్రం ‘ఓకే’ అనేసిందట సమంత. దాంతో చివరకు సమంతను ఈ సినిమాకు కథానాయికగా ఖరారు చేశారు మురుగదాస్. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. మరి విజయ్‌తో అధర చుంబనానికి సమంత అంగీకరించిన విషయంపై ఆమె బోయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ స్పందన ఏంటో మరి.