
చెన్నై : తాజాగా కోలీవుడ్‌లో ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. దక్షిణాదిలోనే అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో సూపర్‌స్టార్స్‌తో జత కడుతోంది. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్బార్, దళపతి విజయ్‌కు జంటగా బిజిల్ చిత్రాలతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ నటిస్తోంది. కాగా ఈ అమ్మడు సెంట్రిక్ పాత్రలో నటించిన హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రం కొతైయుదీర్ కాలం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇకపోతే ఈ సంచలన నటి నటించి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న చిత్రం అరమ్. గోపినాయర్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో జిల్లా కలెక్టర్‌గా నటించిన నయనతార అక్రమాలకు పాల్పడ్డ కౌన్సిలర్‌ను జైలులో పెట్టడంతో రాజకీయవాదుల కోపానికి గురై పదవిని వదులుకుని ప్రజాసేవ కోసం రాజకీయ అరంగేట్రం చేసే పాత్రలో ఆమె నటన ప్రశంసలను అందుకుంది.
అరమ్ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు గోపినాయర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులోనూ నటి నయనతారనే నటించనున్నట్లు ప్రచారం జరిగినా, తాజాగా అరమ్ సీక్వెల్‌లో నయనతారకు బదులు మరో సంచలన నటి సమంతను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత తాజాగా తెలుగులో నటించిన ఓ బేబీ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో చిత్రాలు ఉన్నా, తమిళంలో కొత్త చిత్రాలేవీ లేవ్వన్నది గమనార్హం. దీంతో అరమ్–2 చిత్రంలో నటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. అయితే నటి నయనతారనే అరమ్–2లో నటించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.