రాజమౌళిపై ఒట్టును వర్మ నిలబెట్టుకున్నాడా? | Sarkar-3 movie review | Sakshi
Sakshi News home page

రాజమౌళిపై ఒట్టును వర్మ నిలబెట్టుకున్నాడా?

Published Fri, May 12 2017 1:00 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

సర్కార్‌-3 సెట్‌లో బిగ్‌బీతో జక్కన్న(ఫైల్‌) - Sakshi

సర్కార్‌-3 సెట్‌లో బిగ్‌బీతో జక్కన్న(ఫైల్‌)

‘రాజమౌళి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇకముందు అందరూ గర్వపడే సినిమాలే తీస్తా..’ అని ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్‌లో శపథం చేసిన రాంగోపాల్‌ వర్మ.. మాట నిలబెట్టుకున్నాడా? లేక ‘నేను మాటమీద నిలబడేరకం కాదు’అని మరోసారి నిరూపించుకున్నాడా?

శుక్రవారం ‘సర్కార్‌-3’ విడుదలైన సందర్భంగా.. సోషల్‌ మీడియాలో ఈ తరహా చర్చలు బోలెడు కనిపించాయి. రామూ దర్శకత్వంలో మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్కార్‌-3’ రివ్యూలపై ఓ లుక్కేస్తే.. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ లాంటిదేది లేకుండా సినిమాలు తీసే వర్మ(ఈ విషయం ఆయనే చెప్పారు) మ్యాజిక్‌ సర్కార్‌-3 విషయంలో ఫలించిందా? లేదా అనేది అర్థం అవుతుంది.

టైటిల్‌: సర్కార్‌-3
డైరెక్షన్‌, స్క్రీన్‌ ప్లే‌: రాంగోపాల్‌ వర్మ
జానర్‌: డ్రామా
నటీనటులు: అమితాబ్‌ బచ్చన్‌, అమిత్‌ సాధ్‌, జాకీ ష్రాఫ్‌, మనోజ్‌ వాజపేయి, రోనిత్‌ రాయ్‌, యామి గౌతమ్‌ తదితరులు
రచన: జయకుమార్‌, రామ్‌కుమార్‌ సింగ్‌
సంగీతం: రవి శంకర్‌
సినిమాటోగ్రఫీ: అమోల్‌ రాథోడ్‌
నిర్మాతలు: ‘వి వన్‌’ బ్యానర్‌పై రాహుల్‌ మిత్రా, ఆనంద్‌ పండిట్‌, గోపాల్‌ శివరామ్‌ తదితరులు
నిడివి: 132 నిమిషాలు
విడుదల: మే 12, 2017


కథ: వ్యవస్థ(సిస్టమ్‌) నుంచి ఉద్భవించి, ముంబై ప్రజల ఆరాధ్యదైవంగా వెలుగొందే సర్కార్‌ అలియాస్‌ సుభాష్‌ నాగ్రే(అమితాబ్‌ బచ్చన్) జీవితంలో చోటుచేసుకున్న భిన్న కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం సర్కార్‌-3 మూల కథ. ఇంతకు ముందు భాగాలైన సర్కార్‌, సర్కార్‌ రాజ్‌ల తరహాలోనే సుభాష్‌ నాగ్రే.. సంఘవిద్రోహ శక్తులపాలిట సింహ స్వప్నంగా కనిపిస్తారు. సర్కార్‌ను సాధారణ డాన్‌గా భావించి తమ కార్యకలాపాలకు సహకరించాల్సిందిగా కొందరు రావడం, అందుకు సర్కార్‌ తనదైన శైలిలో నో చెప్పడం ఓపెనింగ్‌ సీన్లు.

కొద్ది సేపటికే సర్కార్‌ మనవడు, దివంగత శంకర్‌ నాగ్రే కుమారుడైన చీకూ అలియాస్‌ శివాజీ నాగ్రే(అమిత్‌ సాధ్‌) ఎంట్రీ ఇస్తాడు. ఆవేశానికి మారుపేరైన ఈ పాత్ర.. వస్తూనే సర్కార్‌ అనుచరులతో గొడవపడి, చివరికి ఇంటినుంచి గెంటివేతకు గురవుతాడు. అలా సొంత మనవడే సర్కార్‌కు బద్ధవిరోధి అవుతాడు. ఒకదశలో మనవడు చీకూను చంపేయాలని సర్కార్‌ డిసైడ్‌ అవుతాడు. తాతా మనవళ్ల యుద్ధంలో చివరికి ఎవరు గెలుస్తారు? చీకూ లాగే సర్కార్‌ను మట్టుపెట్టాలనుకునే మిగతా విలన్ల పథకాలు ఫలించాయా? అనేవి తెరపైనే చూడాలి!


అమితాబ్‌ విశ్వరూపం: యాంగ్రీ ఓల్డ్‌మన్‌ పాత్రధారణలో ప్రపంచంలోనే తనకెవ్వరూ సాటిరారనే స్థాయిలో అమితాబ్‌ నట విశ్వరూపం చూపించారు. ప్రత్యర్థులకు ధమ్‌కీ ఇస్తూ ఆయన చెప్పిన డైలాగ్స్‌ అమోఘం. మనవణ్ని చంపాలని డిసైడ్‌ అయ్యే సమయంలో బిగ్‌బీ హావభావాలు.. ఆస్వాదించినోళ్లకు ఆస్వాదించినంత! సర్కార్‌-3పై వచ్చిన రివ్యూలన్నీ అమితాబ్‌ను వేనోళ్లాపొడిగాయి. మనవడి పాత్రలో అమిత్‌, విలన్లుగా మనోజ్‌, జాకీ, రోనిత్‌, చిన్నపాత్రే అయినా యామీ గౌతమ్‌లు తమతమ పరుధుల్లో రాణించారు.

హైలైట్: సర్కార్‌-3 సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్‌ గురించే. ‘నా మనవడు వచ్చినప్పుడే.. నాకు, నా భార్యకు ఈ విషయం తెలుసు..’అంటూ సర్కార్‌ రివీల్‌ చేసిన విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయంటే అతిశయోక్తికాదు. అలా చివర్లో వర్మ చేసిన మ్యాజిక్‌తో రాజమౌళికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడో లేదో ప్రేక్షకులకు ఇట్టే అర్థం చేసుకోగలరు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement