సాక్షి, ముంబై: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. గత నెల (జూన్) 20న శ్వాసకోశ సమస్య కారణంగా ఖాన్ ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర‍్భంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. పరిస్థితి మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. సరోజ్ ఖాన్ హఠాన్మరణం బాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.
నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన ఘనత ఖాన్ సొంతం. దివంగత నటి శ్రీదేవి సూపర్ హిట్ మూవీ నాగిని, మిస్టర్ ఇండియాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ లోని డోలా రే డోలా, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్ నుండి ఏక్ దో టీన్, 2007లో జబ్ వి మెట్ నుండి యే ఇష్క్ హాయేతో సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డులను ఖాన్ గెల్చుకున్నారు.
1948 నవంబరు 22న సరోజ్ ఖాన్ జన్మించారు. బాలీవుడ్ మాస్టర్జీగా పాపులర్ అయిన సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్ . ఆమెకు భర్త సోహన్ లాల్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment