అగ్నీసాక్షి సీరియల్‌లో విలన్‌గా సాత్విక్ కృష్ణ
కంచుకంఠాన్ని ప్రతినాయకుడి పాత్రకు ఎంత చక్కగా ఉపయోగించారో, కథానాయకుడి భూమికకు అంతే నేర్పుగా వినియోగించిన ఏకైక భారత నటుడు ‘పద్మభూషణ్’ కొంగర జగ్గయ్య. 1951లో ‘ప్రియురాలు’ సినిమాతో ఆరంభించి 125సినిమాల్లో నాయకుడిగా, 325 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో ‘కళావాచస్పతి’గా ముద్ర వేసుకున్నారు. కొంగర జగ్గయ్య సినీవారసుడు లేడనుకుని నిరాశపడ్డారెందరో.. ఇందుకు జవాబుగానేమో? ఆయన వంశాంకురం కొంగర సాత్విక్ కృష్ణ కళల తెనాలి నుంచి నటనా రంగంలోకి దూసుకొచ్చారు. బుల్లితెర బిజీ స్టార్‌గా ఉంటూ, మరోవైపు వెండితెరపైనా సాత్విక్ అరంగేట్రం చేశాడు.
సాక్షి, తెనాలి(విజయవాడ): లోక్‌సభకు ఎన్నికైన తొలి సినీనటుడిగా గుర్తింపును పొందిన కొంగర జగ్గయ్య స్వస్థలం తెనాలి దగ్గర్లోని దుగ్గిరాల మండల గ్రామం మోరంపూడి. సాత్విక్ కృష్ణ జగ్గయ్య సోదరుడు కృష్ణారావు మనుమడు. తలిదండ్రులు సుధారాణి, శ్రీనివాస్. తెనాలిలో స్థిరపడ్డారు. శ్రీనివాస్‌ది బిజినెస్ కాగా, సుధారాణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు. వీరి ఏకైక కుమారుడు సాత్విక్ కృష్ణ. తెనాలిలో డిగ్రీ తర్వాత చింతలపూడిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజి నుంచి 2012లో బీటెక్ పట్టాతో బయటకొచ్చాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ రైలెక్కాడు. పెద్దగా కష్టపడకుండానే సాధించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఏడాది పాటు పనిచేశాక, తన లక్ష్యమైన నటనారంగంకేసి చూశాడు.
తొలి నుంచి నటనపై ఆసక్తి
సాత్విక్ కృష్ణకు తొలినుంచి నటన అన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఆసక్తి. హైస్కూల్, కాలేజీ రోజుల్లో తనే ముందుండేవాడు. తండ్రి మాటల్లో తాత కొంగర జగ్గయ్య కళాప్రతిభను గురించి వింటూ పెరిగాడాయె. పాత సినిమాల్లో జగ్గయ్య కనిపిస్తే, ఆ సినిమా గురించి, అందులో జగ్గయ్య గారి ప్రత్యేకతల గురించి తండ్రి శ్రీనివాస్ కచ్చితంగా చెబుతూ వచ్చేవారు. కాలేజి రోజుల్లోనే సినీ ప్రయాణం చేయాలని ఉబలాటపడిన సాత్విక్ ఉత్సాహానికి తండ్రి బ్రేకులు వేశాడు. ‘విద్య లేకుండా జీవితం లేదు.. తగిన విద్యార్హత సాధించాక ఇష్టమైన రంగంలో పనిచెయ్యి’ అని తండ్రి చెప్పటంతో బుద్ధిగా చదువుకున్నాడు. ఏడాది ఉద్యోగం కూడా చేశాక, తన అభిరుచిని బహిర్గతం చేయడంతో తలిదండ్రులు, సంతోషంగా ‘బెస్టాఫ్ లక్’ చెప్పి పంపారు. ‘వాస్తవానికి యువకుడిగా ఉన్న రోజుల్లో మా నాన్న శ్రీనివాస్‌కు నటనా రంగంలోకి రావాలని అభిలషించారు. అయితే పెళ్లి, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో తనకు వీలుపడలేదు’ అని సాత్విక్ వెల్లడించారు.
తొలిసారిగా వెండితెర అవకాశమే ‘అర్ధనారి’ సినిమా రూపంలో పలకరించింది. అందులో పోలీసాఫీసర్ పాత్రలో నటించిన సాత్విక్‌కు, బుల్లితెర మంజులానాయుడు నుంచి కబురొచ్చింది. ‘శ్రావణ సమీరాలు’ టీవీ సీరియల్‌లో ‘షెట్టి’ అనే ప్రధాన విలన్‌గా అవకాశమొచ్చింది. ఏడాదిపాటు 150 పైగా ఎపిసోడ్లలో నటించారు. అవకాశాలు వరుసకట్టాయి. ‘కోయిలమ్మ’, ‘అభిషేకం’, ‘స్వాతిచినుకులు’, ‘అగ్నిసాక్షి’, ‘సావిత్రి’, ‘ఆడదే ఆధారం’ సీరియల్స్‌తో బుల్లితెరకు పర్మినెంట్ నటుడయ్యారు. దాదాపు అన్నీ విలన్ పాత్రలే. కోయిలమ్మ, స్వాతిచినుకులు, అగ్నిసాక్షి సీరియల్స్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న సీరియల్స్ ‘మధుమాసం’లో సీబీఐ అధికారిగా, ‘గోరింటాకు’, ‘మట్టిగాజులు’లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజతో కృష్ణవంశీ తీసిన ‘నక్షత్రం’ సినిమాలో నటించారు. ‘టీవీ సీరియల్స్‌తో బీజీగా ఉండటం సంతృప్తిగా ఉంది. సినిమాల్లోనూ ప్రూవ్ చేసుకోవాలని ఉంది’ అంటారు సాత్విక్. తాతయ్య కొంగర జగ్గయ్య గురించి అందరూ చెబుతుంటే హ్యాపీగా ఉంటుంది. ‘టాలెంటుతోనే పైకిరావాలని ముందుకెళుతున్నా, ఇంటిపేరుతో తెలిసిపోతున్నాను’ అని చెప్పారు. ఇటీవలే ఖమ్మంకు చెందిన భావనతో వివాహంతో సాత్విక్ ఓ ఇంటి వాడయ్యాడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment