సత్యదేవ్
‘‘కథే హీరో అని ఫీల్ అవుతాను. అందుకే కేవలం హీరో పాత్రలే చేయాలని ఇండస్ట్రీకి రాలేదు నేను. ఆసక్తికరంగా ఉండే లీడ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉండాలనుకుని వచ్చాను. నా వల్ల కథకు ఓ ఇంపార్టెన్స్ ఉండాలనుకుంటాను. ఆ ప్రాసెస్‌లో నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తున్నాను. ఐడియాలజీ డిఫరెంట్‌గా ఉన్న నెగటీవ్ పాత్రలు చేయడానికి కూడా ఓకే’’ అన్నారు సత్యదేవ్. గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కి తెలుగు రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన సంగతులు.
► పేదవాడికి, ధనవంతుడికి పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. మధ్యతరగతివారు అవకాశాల కోసం చూస్తుంటారు అందుకే వారిని టార్గెట్ చేసి మోసం చేయడానికి కొందరు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి అంశాల ఆధారంగానే మా ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం రూపొందింది. ఉత్తమ్ కుమార్, కెప్టెన్ సాగర్, కుభేర గోస్వామి, ఆకాష్ విహారి అని ఇలా డిఫరెంట్ పేర్లతో మోసం చేసే క్యారెక్టర్‌లో నేను నటించాను. డబ్బంటే ఇష్టం ఉన్న హీరో జీవితంలోకి డబ్బంటే విపరీతమైన ఇష్టం ఉన్న విలన్ వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? అనేవి సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. రెండు జీవితాలు ఉండే గొంగళిపురుగు లాంటి క్యారెక్టర్ హీరోది.
► దర్శకుడు గోపీ గణేశ్ అన్న ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఆయనకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు. నిర్మాత రమేష్ పిళ్లైగారు తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌గారు. కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో ధనశెట్టి పాత్రలో పృథ్వీరాజ్‌గారు బాగా నటించారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా ‘అర్జున్‌రెడ్డి’ రేంజ్‌లో ఆడియన్స్‌కు రీచ్ అవుతుందని ఆయన అనడం హ్యాపీగా ఉంది. ఆ నమ్మకం మాకూ ఉంది. ఈ చిత్రంలో కోర్టు ఎపిసోడ్ బాగా వచ్చింది. సినిమా రిలీజయ్యాక నచ్చితే ఆడియన్స్ చిన్న క్లాప్ కొట్టాలని కోరుకుంటున్నాను.
► ‘అంతరిక్షం’, ‘మెంటల్‌మదిలో..’ లాంటి డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాను. డైరెక్టర్స్ ఎలా కావాలంటే ఆ లుక్‌లోకి మారిపోతా. పూరిగారి ‘జ్యోతిలక్ష్మి’ ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నాతో పాటు దాదాపు 500 మంది పోటీపడ్డారు. అప్పుడు నా వెయిట్ 90 కేజీలు. పూరిగారు నన్ను చూసి వెయిట్ తగ్గి రమ్మన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గి ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పుడు నువ్వే లీడ్ యాక్టర్ అన్నారు. అప్పట్నుంచి నా కెరీర్‌లో చేంజ్ వచ్చింది.
► నేను హీరోగా ‘మెంటల్‌మదిలో..’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా, ‘గువ్వా గోరింకా’, ‘47’ సినిమాలు చేస్తున్నాను. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఓ హిందీ చిత్రంలో లీడ్ యాక్టర్‌గా చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment