ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
'తనీఒరువన్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దక్షిణాదినే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎం రాజా తెరకెక్కించిన ఈ క్రైం థ్రిల్లర్ స్టార్ హీరోలను కూడా ఆకర్షిస్తుంది. అందుకే దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ కు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు అంతగా టాప్ స్టార్స్ను ఆకర్షించడానికి ఈ సినిమాలో ఏముంది.
'తనీఒరువన్' ఓ థ్రిల్లర్ కథాంశం. ఐపీఎస్ పాసైన హీరో మిత్రన్ ( జయం రవి ) ప్రొబేషన్లో ఉండగా తన మిత్రులతో కలిసి నగరంలో జరుతున్న నేరాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో తమతో కలిసిన మహిమ ( నయనతార ) తో ప్రేమలో పడతాడు. నగరంలో జరుగుతున్న చిన్న చిన్న నేరాల వివరాలను సేకరించిన మిత్రన్ ఈ నేరాలన్నింటి వెనకాల ఉన్న వ్యక్తి ఒకడే అని గ్రహిస్తాడు. పద్మశ్రీ అవార్డ్ గ్రహిత అయిన ఫేమస్ సైంటిస్ట్ సిద్దార్ధ్ అభిమన్యు ( అరవింద్ స్వామి ) తన వ్యక్తిగత అవసరాల కోసం సైన్స్ను, పాలిటిక్స్ను తప్పుదారిలో ఉపయోగిస్తున్నాడని తెలుసుకొని అతని ఆటకట్టిస్తాడు.
ఫస్ట్ ఆఫ్ ఇన్విస్టిగేషన్ డ్రామాలా సాగే తనీఒరువన్.., సెకండ్ హాఫ్ అంతా మైండ్ గేమ్లా నడుస్తుంది. కేవలం స్క్రిప్ట్ మీద 9 నెలల పాటు వర్క్ చేసిన దర్శకుడు రాజా ప్రతీ సీన్లోనూ క్లారిటీ చూపించాడు. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ఒక్క ఫ్రేమ్ కూడా ఆడియన్ బోర్ ఫీలవ్వకుండా తెరకెక్కించాడు. జయం రవి, అరవింద్ స్వామి, నయనతారల నటన, ఎం రాజా డైరెక్షన్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అవ్వటంతో 'తనీఒరువన్' టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు మరో నాలుగు పరిశ్రమలు 'తనీఒరువన్' రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు ఎం రాజా తెలుగులో మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మహేష్ ఇంత వరకు రీమేక్ సినిమా చేయలేదు. దీంతో మహేష్ కాకపోతే రామ్ చరణ్ తో అయినా రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
అలాగే హిందీలో సల్మాన్ హీరోగా తనీ ఒరువన్ను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. హిందీ వర్షన్ ను తానే డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజా. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ చూసిన సల్మాన్ టీం రీమేక్కు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది.
ఇక కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. సౌత్ లో మంచి పరిచయాలు ఉన్న జెనీలియా కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరాఠీలో ఈ సినిమాను నిర్మించాలని ట్రై చేస్తుంది హాసిని. బెంగాలీ భాషలోనూ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం గట్టిపోటి నెలకొంది. దృశ్యం సినిమా తరువాత అదే స్ధాయిలో అన్ని భాషల్లో ఈ 'తనీఒరువన్' రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.