ఇంటర్ పోల్ కు అంబాసిడర్ గా షారుక్ ఖాన్!
'భూమి మీద ఎవరికి నేను భయపడను. కేవలం దేవుడికి మాత్రమే భయపడుతాను. చెడు చేయడాన్ని నేను భరించలేను. ఏ ఒక్కరికి అన్యాయం చేయడానికి ప్రయత్నించను. సత్యంతో అసత్యాన్ని జయిస్తాను. అసత్యం, అవాస్తవాలను ఎదుర్కొంటాను. అందుకు దేనికైన వెనుకాడను' అని మహాత్మగాంధీ సూక్తిని షారుక్ ఖాన్ గుర్తు చేశారు.
అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ కు అంబాసిడర్ గా సేవలందించేందుకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ టర్న్ బ్యాక్ క్రైమ్ క్యాంపెన్ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
చట్టాలను గౌరవించి నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా ప్రజలకు స్పూర్తినిచ్చే విధంగా షారుక్ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇంటర్ పోల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం తన దక్కిన గొప్ప గౌరవం అని షారుక్ వ్యాఖ్యాలు చేశారు. ఇప్పటి వరకు జాకీ చాన్, పుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ, ఫార్ములా వన్ రేస్ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో, కిమి రాయక్కోనెన్ లు ఇంటర్ పోల్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.