
యోగాకి బ్రాండ్ అంబాసిడర్!
సౌందర్య సాధనాలు, శీతల పానీయాలు, పాదరక్షలు.. ఇలా ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. ఇప్పుడామె యోగాకి బ్రాండ్ అంబాసిడర్. ‘బమ్ చిక్ బమ్ బమ్ చేయి బాగా... ఒంటికి యోగా మంచిదేగా’ అంటూ రమ్యకృష్ణ యోగాసనాలతో ఆకట్టుకున్నట్లుగానే ప్రియాంక యోగా విలువ చెప్పి, అందరితో చేయించాలను కుంటున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.
‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే హాలీవుడ్ సినిమాలో ఆమె యోగా బ్రాండ్ అంబాసిడర్‌గా చేయనున్నారు. అమెరికన్ సిరీస్ ‘క్వాంటికో’తో చిన్ని తెరకు పరిచయమై, ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్ బిగ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యారామె. ఆ తర్వాత ఆమె నటించిన రెండో హాలీవుడ్ మూవీ ‘ఎ కిడ్ లైక్ జాక్’ వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. ఇప్పుడు ముచ్చటగా ఒప్పుకున్న మూడో సినిమా ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. అమెరికన్ దర్శకుడు టాడ్ స్ట్రౌస్ షెల్సన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 2019 ప్రేమికుల రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.