
అక్కడికెళ్లే ఆలోచన లేదు!
‘‘అమెరికా వెళ్లడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఇండియాలో హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు ఆమిర్‌ఖాన్. అమెరికాపై ఆయనకు కోపం ఏమీ లేదు. మరి, ఎందుకు వెళ్లనంటున్నారు అనుకుంటున్నారా? ఆమిర్ చెబుతున్నది హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి అమెరికా వెళ్లడం గురించి! దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, దిశా పాట్నీ తదితర బాలీవుడ్ తారలంతా ఇప్పుడు హాలీవుడ్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. మీరు హాలీవుడ్ సినిమా చేసే ఛాన్సుందా? అనడిగితే.. ‘‘భారతీయ ప్రేక్షకులతో పాతికేళ్ల అనుబంధం నాది. మన ప్రేక్షకులకి ఎక్కువ విలువిస్తా. అమెరికా వెళ్లి హాలీవుడ్ సినిమాలు చేయడం తప్పేమీ కాదు. కానీ, హాలీవుడ్‌పై నాకు ఆసక్తి లేదు. అక్కణ్ణుంచి మంచి కథలు వస్తే ఆలోచిస్తా. కళాకారులకి ఎల్లలు లేవు. జపాన్ నుంచి ఎవరైనా మంచి కథతో వస్తే, జపనీస్ సినిమాలో నటించడానికి నేను రెడీ’’ అన్నారు.