
సిడ్నీ విమానాశ్రయంలో శిల్పా శెట్టికి చేదు అనుభవం
మనిషిని మనిషిగా గుర్తించాలి తప్ప వారి శరీర రంగును బట్టి కాదు.. తెల్లగా లేనంత మాత్రాన మనుషులం కాదా.. అయినా శరీర రంగును బట్టి ఎదుటివారితో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుందా..! అంటూ నటి శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరీర రంగు వల్ల విమానాశ్రయంలో తనకు ఎదురైన జాతీవివక్ష అనుభవాన్ని శిల్పా శెట్టి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. వివరాలు.. ఆదివారం శిల్పా శెట్టి సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో సిడ్నీ విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని తన వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఒకటి అతిపెద్దగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. అంతేకాక ఆ బ్యాగ్‌ను ‘ఓవర్‌సైజ్ లగేజ్’ కౌంటర్ వద్దకు వెళ్లి చెక్ చేయించమని చెప్పిందన్నారు.
అందుకు శిల్పా శెట్టి తన బ్యాగ్‌లో ఎక్కువ లగేజ్ ఏం లేదని.. కావాలంటే బ్యాగ్‌ను స్కానర్ ద్వారా కాకుండా మ్యానువల్‌గా చెక్ చేయమని కోరినట్లు తెలిపారు. కానీ ఆ ఉద్యోగిని తన మాటాలను పట్టించుకోలేదని.. కనీసం స్పందించలేదని శిల్పా విచారం వ్యక్తం చేశారు. దగ్గరకు వెళ్లి అభ్యర్థించినా....ఆమె ప్రవర్తనలో మార్పులేదని తెలిపారు. సమయం మించి పోతుండటంతో చేసేదేంలేక తాను ఆ బ్యాగును ‘ఓవర్‌సైజ్ లగేజ్’ పరిశీలించే విభాగం సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లానన్నారు. వారు తన బ్యాగ్‌ను పరిశీలించిన తర్వాత అది ‘ఓవర్‌సైజ్ లగేజ్’ బ్యాగు కాదని చెప్పారన్నారు. ఈ వ్యవహారం అంతా తనను ఎంతో బాధపెట్టిందని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించేలా.. వారికి సాయం చేసేవారిగా ఉండేలా శిక్షణ ఇవ్వాలని శిల్ప అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రయాణికుల పట్ల ఇలా జాతీవివక్ష చూపకూడదని కోరారు.