గాసిప్స్‌కు బాధపడను
గాసిప్స్‌కు బాధపడనని అంటున్నారు నటి శ్రుతిహాసన్. టాప్ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు, హిందీ అంటూ రౌండ్ చుట్టేస్తున్నారు. చాలా బోల్డ్ నటిగా భావించేవారిలో శ్రుతిహాసన్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఆదిలో విజయం ఆమడదూరం అనిపించినా ఆ తరువాత సక్సెస్‌కు చిరునామాగా మారారు. తాజాగా తెలుగులో నటించిన ప్రేమమ్ చిత్రంలో టీచర్ పాత్ర శ్రుతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా శ్రుతి ఒక భేటీలో పేర్కొంటూ ప్రేమమ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందడం సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్రం విడుదలకు ముందు ఈ పాత్రను తాను పోషించడం గురించి సోషల్ మీడియాలో చాలా విమర్శలు ప్రసారం అయ్యాయన్నారు. అలాంటి వాటిని పని పాటా లేని వాళ్లు ప్రసారం చేసి ఉంటారని భావించానన్నారు. ఏదేమైనా అలాంటి ప్రచారం గురించి తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కథ, అందులోని తన పాత్రపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆ పాత్రకు ఎలా జీవం పోయాలన్న విషయంపై శ్రద్ధ చూపానని చెప్పారు. చిత్రం విడుదల అనంతరం తన పాత్ర పోషణకు ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. తాను కమలహాసన్ కూతురినని, ఆయనలానే తాను చాలా స్ట్రాంగ్ అని పేర్కొన్నారు.
విమర్శలు, సత్యదూర ప్రచారాలు తనను ఎలాంటి బాధింపునకు గురి చేయవని దృఢంగా అన్నారు. అదే విధంగా తన గురించి గాసిప్స్ ప్రసారం అవుతున్నాయనీ,అలాంటి వాటికి అస్సలు వర్రీ అవ్వనని అన్నారు. ప్రస్తుతం తాను తెలుగు,తమిళం,హిందీ అంటూ అధిక చిత్రాలలో నటిస్తున్నాననీ తెలిపారు.నటీనటులకు భాషాభేదం ఉండదన్నారు. భాషకు అతీతమైంది ఒక్క సినిమారంగమేనని పేర్కొన్నారు. తాను తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకాదరణను పొందానని, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నానని అన్నారు. అందుకు శాయ శక్తులా పోరాడుతున్నానని, ఆ ఆశను నెరవేర్చుకుంటాననే విశ్వాసాన్ని శ్రుతిహాసన్ వ్యక్తం చేశారు.