
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్
ఈ జనరేషన్ హీరో హీరోయిన్లు సినిమాలతో పాటు సోషల్ సర్వీస్‌లోనూ ముందే ఉంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో కలిసి తనవంతుగా సోషల్ సర్వీస్ చేస్తున్న ఈ బ్యూటీ ఓ విభిన్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బాలీవుడ్ హీరోయిన్‌లు తెర మీద, తెర వెనుక అద్భుతమైన డిజైనర్ దుస్తులను ధరిస్తుంటారు. అంతేకాదు టాప్ బ్రాండ్స్ నుంచి వీరికి గిఫ్ట్స్ రూపంలోనూ దుస్తులు అందుతాయి. వీటిలో కొన్ని వాడకుండా అలాగే పక్కన పెట్టేస్తుంటారు.
అలాంటి దుస్తులను ఇప్పుడు సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించాలని భావిస్తున్నారు. జంతు సంరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థలకు తన దుస్తులను వేలం వేయటం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు శ్రద్ధా. ‘సాయం చేయడానికి మీకు అధికారం ఉండాల్సిన అవసరం లేదు. మీరు సెలబ్రిటీ అయ్యుండాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరు ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. మనకు అన్ని రకాల వసతులు, ప్రేమించే మనుషులు ఉన్నారు. ఆ ప్రేమను మనం కూడా ఇతరులకు పంచాలం’టున్నారు శ్రద్ధా కపూర్.
బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లోనూ అలరించనున్నారు శ్రద్ధా కపూర్. సాహోతో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.