1986 సమయానికి సాయిబాబా పూర్తిగా తెలుగువారి జీవితాల్లోకి ప్రవేశించలేదు. బాబా గురించి వినడం, తెలుసుకోవడం అప్పుడప్పుడే మొదలవుతోంది. కాని అప్పటికే తెలుగు నాటఅయ్యప్ప స్వామి దీక్షలు విస్తృతంగా ఉన్నాయి. అయ్యప్ప స్వామి లీలల గురించి, మహిమల గురించి, శబరిమల క్షేత్రం గురించి భక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలోతెలుగువారికి పామర జనం స్థాయిలో కూడా షిర్డీ క్షేత్రం గురించి తెలియజేసిన సినిమా ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’.దేశంలో మూడో సినిమామనుషులు తమకు అండగా ఉండే దేవుణ్ణి కనుగొనడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. పరమాత్ముణ్ణి బహు రూపాలలో సేవించాలని చూడటం ఇందుకు ఒక కారణం. తెలిసినదేవుళ్లు, ఇది వరకు నుంచి సేవిస్తున్న దేవుళ్లు ఎలానూ రక్షిస్తారు కాని ఈ కొత్త దేవుడు తమ సమస్యలను మరింత తొందరగా తీరుస్తాడేమోనన్న ఆశ మరొక కారణం. పంతొమ్మిదవశతాబ్దంలో అయ్యప్పస్వామి, షిర్డి సాయిబాబా దేశ ప్రజలకు విశేష ఆరాధనీయం ఇందుకే అయ్యారు. ప్రతి దేవునికి పురాణ గాథ ఉంటుంది. సాయికి సచ్చరిత్ర ఉంది. షిర్డీ సాయికి సమీప అనుచరుడిగా ఉంటూ ఆయనను చూసి, ఆయన ద్వారా విని ఆయన జీవితాన్ని గోవింద్ రఘునాథ్ దభోల్కర్ అలియాస్ హేమాడ్ పంత్ అనే భక్తుడు ‘సాయి సచ్చరిత్ర’గా గ్రంథస్తం చేశారు.
సాయి జీవితం తెలుసుకోడానికి అదే ప్రామాణిక గ్రంథం. ఈ గ్రంథం ఆధారంగానే ఆయన మీద సినిమాలు కూడా నిర్మితం అయ్యాయి. మరాఠీలో ఒకటి, హిందీలో ఒకటి నిర్మితం అయ్యాక సాయి గురించి మంచి సాంకేతిక ప్రమాణాలతో శక్తిమంతంగా, భక్తులను తాకేలా తీసిన సినిమా మన తెలుగు వారు తీసిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ కావడం గొప్పగా చెప్పుకోవాల్సిన సంగతి. సాయి సచ్చరిత్రను ఆధారంగా తీసుకుని ప్రక్షిప్తాలు లేకుండా తీశారు ఈ సినిమాను. సబ్ కా మాలిక్ ఏక్ హై సాయి బాబా జన్మ వృత్తాంతంలో ఒక మార్మికత ఉంది. తాను ముస్లిమో.. హిందువో ఆయన ఎక్కడా బయట పెట్టలేదు. కాని ఆయన జీవితం మొత్తం సర్వ మతాల అనుసంధానానికి ఉపయోగించారని అర్థమవుతుంది. ఆయన ఆహార్యం ముస్లిం ఫకీర్. కాని ఆయన తాను నివసించిన మసీదుకు ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టారు. ఒక వైపు నమాజు, ఫాతెహాలు చదివారు. మరోవైపు హైందవ సంప్రదాయంలో దీపాలు వెలిగించారు. ఒక వైపు ఖురానును ప్రబోధించారు. మరోవైపు గీతను ఆదర్శంగా తీసుకున్నారు. ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనిచెప్పడం ద్వారా తాను దైవ సందేశహారునిగా ఆయన చెప్పుకున్నా.. ఆయనను ప్రవక్త స్థానం నుంచి భక్తులు భగవంతుని స్థానానికి తీసుకొని వెళ్లారు. సాయిబాబా ఇప్పుడు దేవిదేశాలలో ప్రధానంగా హిందువుల దేవునిగా ఆరాధనీయం అయ్యాడు. ఈ సంఘటనల వరుస అంతా ఈ సినిమాలో ఉంది.
పాపాలు తొలగించే దీపం
ఒక పెళ్లి బృందంతో పాటు సాయిబాబా (విజయచందర్) షిర్డీ గ్రామానికి రావడంతో ఈ సినిమా మొదలవుతుంది. గ్రామస్తులు ఆయనను ‘సాయి’ అని పిలిచారు. ‘సాయి’ అనే మాటనుకబీర్ దాస్ దేవుణ్ణి ఉద్దేశించి ఉపయోగించాడు కనుక సాయిలో ఆ దైవ స్వరూపం చూసి, అలా పిలిచానని ఆ ఊరి పూజారి అంటాడు. అలా పేరూ ఊరూ లేని ఆ ఫకీర్ సాయిబాబాగాప్రజలకు తెలిశాడు. అయితే ముస్లిం ఫకీర్‌లా కనిపిస్తున్న ఇతణ్ణి తొలిరోజుల్లో కొంత మంది హిందువులు ఇబ్బంది పెట్టారు, వ్యతిరేకించారు. మరికొంతమంది పిచ్చివాడి కింద జమకట్టారు. కాని దైవత్వాన్ని కనుగొనడంలో ప్రజలు ఎప్పుడూ పొరపడరు. అందువల్ల అందరూ త్వరగా సాయి భక్తులుగా మారారు. ‘తోటి మనిషికి సాయపడు. ప్రకృతిని చూసి నేర్చుకో.అహంకారాన్ని వదిలిపెట్టు. పవిత్ర గ్రంథాలను చదివి, నీ సన్మార్గాన్ని ఎంచుకో. గురువును ఆశ్రయించు. అన్ని మతాల సారం ఒకటే అని గ్రహించు’ వంటి చిన్న చిన్న ఉపదేశాలే సాయిచేశారు. కాని కఠినమైన దర్శనాలన్ని ఇలా సరళంగానే కనిపిస్తాయి కదా. సాయి ఎంతో అవసరమైతే తప్ప మహిమలు చూపలేదు. ఆయన యోగ సాధకుడన్నది వాస్తవం. కానిఎదుటివారి మనసుల్లో ఏముందో తెలుసుకోవడం, దూరంగా జరిగే విషయాలను గ్రహించం చేసేవారనడానికి భక్తుల ఉదంతాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటితో దీపాలు వెలిగించడం,పాదాల దగ్గర గంగా, యమునలు ప్రవహింప చేయడం, మూడు రోజుల పాటు ఆత్మను శరీరం నుంచి వేరు చేసి చూపడం.. ఆయన ప్రధాన మహిమలుగా భక్తులు భావిస్తారు. అవంతా
ఎంతో హృద్యంగా ఈ సినిమాలో చూపించారు.‘పరీక్షలు మీకే కాదు నాకూ ఉంటాయి’ అని సాయి ఒక సన్నివేశంలో అంటారు. దేవుణ్ణి పరీక్షించడానికి ఈ సినిమాలో ‘నానావలి’గా చంద్రమోహన్ అద్భుతమైన నటన ప్రదర్శిస్తారు.భిక్షాటన ద్వారా భక్తుల పాపాలను తీసుకుని, వారికి పుణ్యఫలం అందిస్తానని సాయి అన్నారు. అలాగే భక్తుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారని ఈ సినిమాలో చూపిస్తారు.తాను మేనల్లుడిగా భావించే తాత్యా కోతో పాటీల్‌కి మహమ్మారి సోకితే అతడి ప్రాణాలు కాపాడటానికి తాను ఆ మహమ్మారిని తీసుకుని, సాయి సమాధిస్థితికి చేరుకున్నారని కథనం.విజయచందర్ ఈ సన్నివేశంలో ప్రేక్షకులకు కంట తడి పెట్టిస్తారు. దేవుడు ప్రదర్శించే కరుణ అది.‘నా వైపు చూడు నీ వైపు చూస్తాను’,‘ఎలా పిలిస్తే అలా పలుకుతాను’,‘నా సమాధి నుంచి సమాధానం ఇస్తాను’ అని సాయి అనడం ప్రేక్షకులకు కొండంత ధైర్యం ఇస్తుంది. సాయి ఆరాధనకు ప్రేరేపిస్తుంది.షిర్డీని నేడు రోజుకు పాతికవేల మంది దర్శిస్తున్నారు. ముఖ్య దినాల్లో లక్ష మంది కూడా దర్శిస్తుంటారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఎంతో పెరగవచ్చు. పెరుగుతుంది. అలాగే షిర్డీ సాయిమీద భవిష్యత్తులో ఎన్నో సినిమాలు రావచ్చు. తెలుగులోనే ఈ సరికి ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. కాని ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’కు కుదిరినట్టుగా ఏ సినిమాకూ అంతబాగా అన్నీ కుదరలేదు.ఎందుకంటే ఈ సినిమాకు బాబా ఆశీస్సులు ఉన్నాయి.కాలం గడిచే కొద్దీ ఈ సినిమా క్లాసిక్‌గా ప్రేక్షకుల ఆశీస్సులు కూడా పొందుతూనే ఉంటుంది.
ఇళయరాజా దివ్య సంగీతం
హాస్య చిత్రాలు తీస్తాడని మంచి పేరున్న కె.వాసు ఈ సినిమాను ఇంత బాగా తీయడం అనూహ్యమైన విషయం. ఇందుకు ఆయన చూపిన చిత్తశుద్ధే కారణం. అందుకే ఇది పెద్ద హిట్‌అయ్యింది. విజయచందర్ హృదయంలో కరుణను, వదనంలో తేజస్సును ప్రదర్శించి తానే ఆ సాయి అన్నట్టుగా మెస్మరైజ్ చేసారు. అందరికంటే ముందు ఈ సినిమాకు తన వంతు సేవచేసి నిలబెట్టాలని భావించినవాడు ఇళయరాజా. ఆయన తన పాటలతో ఈ సినిమాను పదింతల పైన నిలబెట్టాడు. ‘దైవం మానవ రూపంలో..’, ‘మా పాపాలు తొలగించే దీపాలు నీవే..’,‘సాయీ శరణం బాబా శరణం’, ‘నువ్వు లేక అనాథలం’, ‘బాబా సాయిబాబా’... ప్రతి పాట ఒక మణిపూస వలే నేటికీ తెలుగునాట సాయి పాట అంటే ముందు నిలిచే విధంగా ఉంటుంది.
– కె.
Comments
Please login to add a commentAdd a comment