శిష్యుడికే శిష్యుడైన సాయి | Funday Sai Patham antarvedam 12 | Sakshi
Sakshi News home page

శిష్యుడికే శిష్యుడైన సాయి

Published Sun, Aug 5 2018 1:58 AM | Last Updated on Sun, Aug 5 2018 1:58 AM

Funday Sai Patham antarvedam 12 - Sakshi

ఏం చిత్రమో గానీ సాయి చేసే లీలలు ఓ పట్టాన అర్థం కావు. కొద్ది లోతుగా ఆలోచిస్తే అర్థం కాకుండానూ ఉండవు. ‘లో’ అర్థం గాని తెలిసిందా.. ఇక జీవితాంతం గుర్తుంచుకోవల్సినంత గుర్తుంచుకునేంత అనుభవసంపద అందులో దాగి ఉంటుంది.అందుక్కాదూ పదులు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా భక్తులు వచ్చి సాయిని దర్శిస్తున్నారు! ఈ నేపథ్యంలో ఓ కుమ్మరిపురుగు లాంటివాణ్ణి గురువుగా చేసుకుని సేవ చేసిన తుమ్మెదలాంటి సాయి చరిత్రని తెలుసుకుందాం!

పరివర్తన
ప్రతి వ్యక్తికీ జీవించిన మొత్తం కాలం ఒక్కలానే ఉండదు. మార్పులకి గురి అవుతూనే ఉంటుంది. ఒక్కో మార్పు ఒక్కో అనుభవాన్ని అందిస్తుంది. సాయి తన యవ్వనంలో పహిల్వాన్‌లా ఉండాలనుకుంటూ అలాంటి దుస్తుల్నే వేసుకుంటూ, జుట్టుని కూడా అలాగే పెంచుకుంటూ అందరికీ ఓ పహిల్వాన్‌లాగానే పై దృష్టికి అన్పించేవాడు. ఆ కాలంలో షిర్డీలో కుస్తీపోటీలు ఎక్కువ సంఖ్యలో సాగుతూ ఉండేవి. వేటితో మనకి దగ్గరతనముంటే ఆ లక్షణాలు మనకి ఎక్కువ అలవడుతాయనేది నిజం కదా! ఈ వస్త్రధారణ , జుట్టుపెంచడం మనసులో పహిల్వాన్‌ ఆలోచనలూ కారణంగా కుస్తీపోటీల్లో పాల్గొనాలని అన్పించింది సాయికి. అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఓ సారి తమలపాకులు, వక్కలు అమ్ముకుని వ్యాపారం చేస్తుండే మొహిద్దీన్‌ అనే వ్యాపారితో వాదం వచ్చింది. లోపల కుస్తీ పట్టాలనే ప్రబలమైన ఊహ ఉంది కదా! దాంతో వాదాన్ని పెంచుకున్నారిద్దరూ. కలియబడ్డారు. కుస్తీ పోటీలో తన వృత్తిగా కల మొహిద్దీన్‌ చేతిలో సాయి ఓడిపోయాడు. అంతే! పగ పెరగలేదు. ద్వేషం రగలలేదు. ఇంక కొంతమందిని కూడగట్టుకుని దొంగదెబ్బ తీసి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనిపించలేదు సాయికి.

ఆలోచన సాగింది ఇలా..! నేనూ అతనూ కలియబడ్డాం. ఒకరినొకరు తన్నుకున్నాం కాళ్లతో. పిడికిళ్లతో పరస్పరం గుద్దుకున్నాం. జుట్టూ జుట్టూ పుచ్చుకుని కొట్టుకున్నాం. ఇదా నా సంస్కారం? ఇదా నేను సాధించదలిచిన దానికి ఎన్నుకున్న మార్గం? నేను సక్రమంగా సరైనమార్గంలో ఉంటూ పదిమందిని ఆ మార్గంలో నడిపించాల్సి ఉంటే దానికి ఎంచుకున్న మార్గం ఎంత హేయంగా ఉంది!’ అని తనని గురించి తానే సిగ్గుపడుతూ పరాభవించుకుంటూ కుస్తీవైపుకి దృష్టిని పోనియ్యకూడదనే నిర్ణయానికొచ్చాడు. ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పహిల్వాన్‌ దుస్తుల్ని తొలగించాడు. కఫనీ  (శరీరం పొడవునా ఉండే పెద్ద లాల్చీ)ని ధరించాడు. లోపల కౌపీనాన్ని పెట్టుకున్నాడు.ఇదేకాలంలో ఓ సారి ‘గంగాగీర్‌’ అనే అతనిక్కూడా కుస్తీల మోజు పెద్దగా ఉండేది. దాంతో ఎక్కడ కుస్తీపట్లున్నా (షిర్డీలో ఈ వినోదం ఎక్కువ) వెళ్తూ ఉండేవాడు. ఓ సారి ఓ యోధునితో కుస్తీపట్టు పడుతుంటే గంగాగీర్‌కి ఓ ఆకాశవాణి చెప్పిందా? అన్నట్లు ఓ వాక్యం విన్పించింది! ‘‘వెర్రివాడా! భగవంతునితో కుస్తీ పడుతూ(క్రీడిస్తూ) ఈ దేహాన్ని విడిచేసినా అది గొప్పపని అవుతుంది గానీ ఇది ఓ క్రీడా? దీనిలో వచ్చే జయం విజయమా?’’ అని. అంతే! గంగాగీర్‌కి ఆ క్షణంలోనే జ్ఞానోదయమయింది. కావాలని కుస్తీలో ఓడిపోయాడు. కాలక్రమంలో సంసారాన్ని విడిచేసాడు. భగవంతునితో క్రీడిస్తూ (వినోదిస్తూ) ఉండాలనే నిర్ణయానికి అనుగుణంగా ‘పుణతాంబే’ అనే పవిత్ర స్థలంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని శిష్యులతో అక్కడే ఉండసాగాడు.
ఇదంతా ఎందుకంటే ఏ వ్యక్తికైనా మంచిరోజులు రాబోతుంటే ‘పరివర్తన’ అనూహ్యంగా కలుగుతుందని చెప్పడానికే.

ఖురాన్‌ పండితుని రాక
ఇదిలా ఉండగా ‘రహతా’ అనే పేరున్న గ్రామానికి అహమద్‌నగర్‌ నుండి ‘జవహర్‌ అలీ’ అనే ఫకీరు (సాధువు) కొందరు శిష్యులతో సహా వచ్చాడు. ఎక్కడ తానుండాలా? ఉంటే బాగుంటుందా? మంచి ప్రచారం సాగుతుందా? అని గమనించి రహతా గ్రామంలోని వీరభద్రమందిరానికి దగ్గర్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కువమంది భక్తులొచ్చే ఆ మందిర సమీపంలో ఉంటే తనకి ప్రచారం బాగా ఉంటుందనేదే అలీ ఆలోచన.ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఫకీరైన అలీ సామాన్యుడు కాడు. మంచి పండితుడు. కురానే–ఎ–శరీఫ్‌ (ఖురాన్‌) అతనికి కంఠస్థం (కంఠంలో ఉంటుంది. ఎక్కడ అడిగితే అక్కడి ఆ గ్రంథంలోని విషయాన్ని పుస్తకాన్ని చూడకుండా చెప్పగలతనం). ఆ కారణంగా భక్తులు తెలుసుకోవాలనే తపనతో (జిజ్ఞాస) ఏ అనుమానాన్ని అడిగినా కురాన్‌–ఎ–శరీఫ్‌ని అవలీలగా ఆశువుగా చెప్పేస్తూ ఆ ప్రశ్నకి లేదా సందేహానికి సమాధానాన్ని సరిగ్గా అతుక్కుపోయేలా చెప్పి అందర్నీ తక్కువకాలంలో ఆకట్టేసుకున్నాడు. నిజం కూడా అంతేగా! సందేహాల్ని తీర్చగల సమర్థుణ్ణి అందరూ ఆసక్తితో సమీపిస్తారు గదా! దాంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తూండడం, ఆయన్ని గౌరవిస్తూండడం, కానుకలని సమర్పిస్తూ ఉండడం.. ఇలా ఆయన ప్రాచుర్యం ప్రసిద్ధి బాగా పెరిగిపోయింది. ఎప్పుడూ ప్రతివ్యక్తీ తనని తాను అదుపు చేసుకోవాల్సి ఉండేది పెరుగుదలలోనే. నిచ్చెనని ఎక్కుతూ వెళ్లేవానికి పడిపోయే ప్రమాదముంటుంది. గానీ నేల మీద నిలబడ్డవానికి ఏముంటుంది పడిపోతాననే భయం? అలీ అనే గురువుకి ఈ భక్తుల ఆదరణ పెరుగుతుండేసరికి ఓ దురాలోచన రానే వచ్చింది. వీరభద్రమందిరానికి (ఆలయం అనుకోవచ్చు) దగ్గరగా మహమ్మదీయ సంప్రదాయం ప్రకారం నిలబడి ప్రార్థించే ఓ గోడ (ఈద్‌గా)ని నిర్మించాలని నిర్ణయించాడు. భక్తుల అండదండలున్నాయి గదా! అనేదే అతని దృఢనిశ్చయం. మహమ్మదీయులంతా ‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌’ అనే పండుగరోజున సామూహికంగా నిలిచి ప్రార్థించే పవిత్రస్థలమే ‘ఈద్‌గా’ అంటే. ఈ ఫకీర్‌ రహతాకి రావడం, గ్రామ ప్రజల్ని లోబరుచుకోవడం, ఆకర్షణకి గురయ్యే విధంగా చేసుకోవడం, ఆ క్రమంలో మహమ్మదీయ సంప్రదాయ ధోరణిలో ‘ఈద్‌గా’ని నిర్మించదలపెట్టడంతో హైందవ భక్తులకి కళ్లు విప్పారాయి. నిద్రావస్థలో ఉన్నామనే అభిప్రాయం సామూహికంగా కలిగింది. ఇంకా ఏ స్థితికి అలీ వెళ్లిపోతూ ఇంకెంత అథమస్థాయికి హైందవుల్ని తొక్కేస్తాడో అనిపించి అందరూ కలిసి ఆ ఫకీరుని రహతా నుండి వెళ్లగొట్టేశారు. గోడనిర్మాణం కాస్తా ఆగిపోయింది. అలీ ఎక్కడికి వెళ్లాలా? అని ఆలోచించుకుంటూ సాయి ఉన్న షిర్డీకి మకాం మార్చాడు. షిర్డీకే కాదు. సాయి సమీపంలో అంటే ఆయనవద్దే మసీదులో ఉండడం కోసం తన మకాంని షిర్డీ మసీదులోకి మార్చేశాడు.

ఇంకేముంది? మసీదులో సాయి దర్శనాని కొచ్చే భక్తులందరితో తీపి తీపి సంభాషణలని చేస్తూ కురాన్‌–ఎ–శరీఫ్‌లోని వాక్యాలని చెప్తూ సాదరంగా సప్రమాణంగా విషయాలని వివరిస్తూ ఉంటే భక్తులందరికీ ‘సాయికి మించినవాడు అలీ’ అనే అభిప్రాయం దాదాపుగా వచ్చేసింది. దీన్ని అదనుగా తీసుకుని ‘అలీ’ కూడా సాయిని తన శిష్యునిగా చెప్పుకుంటూ ఉండేవాడు తన వద్దకి వచ్చిన భక్తులతో. ఆ సందర్భంలో సాయి కూడా ఆ అలీని తనకి ఎలా గురువువి? అని వ్యతిరేకించడం గానీ వాదించడం గానీ భక్తులతో నిజాన్ని చెప్పడం గానీ చేయలేదు సరికదా, ఆ అలీకి శిష్యునిగానే సాయి సేవలని చేయడం మొదలెట్టాడు కూడా. దీంతో భక్తులకి ఏం అర్థం కాలేదు పరిస్థితి.ఈ క్రమంలో అలీ తన మకాంని మళ్లీ ‘రహతా’ గ్రామానికే మార్చదలిచాడు. సాయికి అలీలోని లోపాలు బాగా తెలుస్తుండేవి. అలీకి సాయిలోని గొప్పదనాలు తెలుస్తుండేవి. దీంతో ఎంత తొందరగా ‘రహతా’ కి వెళ్తే అంతగానూ తన గురుస్థానం బలపడుతుందని భావించాడు అలీ. సాయితో మాట మాత్రం కూడా చెప్పకుండా సాయినీ శిష్యులనీ తీసుకుని ‘రహతా’ గ్రామానికి మకాం మార్చేశాడు. ఇలా తాము నమ్ముకున్నసాయి అకస్మాత్తుగా అలీకి లోబడిపోవడం, అంతేకాకుండా ఎంతకాలంనుండో ఉంటున్న షిర్డీ గ్రామాన్ని విడిచి భక్తుల్ని కూడా దూరం చేస్తూ, దూరం చేసుకుంటూ, వెళ్లిపోవడం అందరికీ చాలా బాధాకరమైంది.

రహతానుండి వచ్చే కొందరి ద్వారా సాయి తన గురువు కానీ గురువైన అలీకి నీళ్లు కూడా మోసి తెస్తుండేవాడనీ, ఇది చేయదగినది, అది చేయరానిది అనే భేదం, ఉచ్చం నీచం అనే వివక్ష కూడా లేకుండా సేవ చేస్తున్నాడనీ తెలిసి ఎంతో మనోబాధ పడుతుండేవారు సాయి భక్తులంతా. కొందరు ఈ సాయికి ఏదో మంత్ర ప్రయోగం చేసి ఉంటాడని, ఇంకొందరు ఇక సాయికీ మనకీ సంబంధాలు దూరమైపోయినట్లేననీ, అలీ మన సాయిని వదిలిపెట్టనే పెట్టడనీ.. ఇలా ఎవరికి తోచిన ఆలోచనలతో వాళ్లు అంటూండేవారు. అనుకుంటుండేవారు. ఈ భక్తుల మాటలు నిజమే సుమా! అనుకోవడానికి వీలుగా సాయి తన గురువైన అలీతో షిర్డీ గ్రామానికి అలా చుట్టపు చూపుగా వచ్చేసి వెంటనే వెళ్లిపోతుండేవాడు కూడా. నాలుగు సంవత్సరాల నుండి షిర్డీ గ్రామంతో అంతా చిక్కని చక్కని అనుబంధమున్న సాయి ఎలా ఎందుకు పొరుగూర్లో ఉంటున్నాడనేది ఎవరికీ అంతుబట్టలేదు. బాబాతో దూరంగా ఉండడమనే ఈ వియోగాన్ని షిర్డీ ప్రజలు భక్తులైన జనానికి తట్టుకోలేనిదిగా అయింది. అంతా తమంత తాముగా ఒకచోటికి చేరి – రహతాకి వెళ్లి సాయిని ప్రార్థించి బ్రతిమాలి బామాలి విన్నవించి మన స్థితిని వివరించి ఎలాగైనా షిర్డీకి తెచ్చేసుకుందామని గట్టిగా తీర్మానించుకున్నారు ఇలా అందరూ ఒకటి కావడం ఒకే మాట మీద ఉండడం ఒకే తీర్మానాన్ని చేసుకోవడమనేదాన్నే ‘ఏకగ్రీవం’ (ఏక–ఒకే, గ్రీవం–కంఠంగా కావడం –కంఠం అనేది మాటని పలుకుతుంది కాబట్టి అందరిదీ ఒకే మాట కావడమని అర్థం) అంటారు. అలా అందరూ కలిసి రహతా గ్రామానికి వెళ్లారు. అలీ అనే ఆ గురువు లేని సమయాన్ని పసి గట్టి మొత్తానికి సాయిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని సాయిని షిర్డీకి శాశ్వతంగా వచ్చేయవలసిందని విన్నవించుకున్నారు.

సాయిలో ఉన్న గొప్పగుణాల్లో ఒకటి ఎదుటివారు చెప్పే విషయం మొత్తాన్ని పూర్తిగా వినడం, అలా వింటున్న కాలంలో తన అభిప్రాయమేదో దాన్ని చూచాయిగా కూడా తన ముఖకవళికలలో వ్యక్తం చేయకపోవడమూను. అంతేకాదు. పూర్తిగా విన్నాక తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పడమే తప్ప, వంకరగా మాట్లాడకపోవడం కూడా ఆయన విశిష్టలక్షణమే. వీరి ప్రార్థనని మొత్తమంతా విన్నాక సాయి వీళ్లందరికీ చక్కని సమాధానమిస్తాడనుకుంటే ఆ సాయి మాట్లాడుతూ.. షిర్డీవాసులారా! నా గురువైన అలీ మహా కోపిష్టి. ఆయనకి చెప్పనిదే నేను ఏ పనినీ చేయను, చేయకూడదు. మీరు నన్ను ఇలా దొంగతనంగా కలిశారని ఆయనకి తెలిసినా, దురదృష్టవశాత్తూ ఇప్పుడే మనం ఆయన కంటబడినా పరిస్థితి సక్రమంగా ఉండదు. ఇక నన్ను విడిచిపెట్టనే పెట్టడు సరికదా అనుక్షణం నా మీద నిఘా ఉంచనే ఉంచుతాడు. ఇలా మనం ఆయన కంటపడితే తీవ్రంగా అగ్నిలా ప్రజ్వరిల్లిపోతాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాడు. మీ మాటని నేను వినడం మాట అటుంచి, నా మాట విని మీరు వెంటనే షిర్డీకి వెళ్లిపోండి అన్నాడు. షిర్డీ భక్తులందరికీ మతిపోయింది. ‘సాయి మనందరికీ దిక్కు’ అని అనుకుంటూ ఉంటే ఆయనకి దిక్కు మరొకరున్నారని ఆయన అనడమేమిటి? పైగా ఎప్పుడో పరిచితులమైన మనకంటే.. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఈ అలీ మీద ఇంత గౌరవం, భయమేమిటి సాయికి? అనుకుంటూ ఉండగానే సాయి అన్నట్లుగా అలీ అకస్మాత్తుగా అక్కడికి రానేవచ్చాడు.
నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ‘‘ఈ ‘కుర్రవానికోసం’ వచ్చారా? ఇతణ్ణి పంపనే పంపను షిర్డీకి. నా శిష్యుడు ఇతను. ఇక్కణ్ణుండి పొండి’’ అన్నాడు అలీ. చల్లకొచ్చి ముంత దాచడం, శత్రువు ఎదురైనప్పుడు యుద్ధాన్ని మాని బతిమిలాడడం ప్రయోజనం లేని పని అని భావించి షిర్డీ ప్రజలంతా అలీ మీద వాగ్యుద్ధంతో తిరగబడ్డారు. దాంతో అలీకి లోపల కొద్దిగా జంకు కలిగింది. ‘సరే! నేను ఈ కుర్రవాణ్ణి పంపను. వస్తే మేమిద్దరం వస్తాం షిర్డీకి!’ అన్నాడు అలీ. అందరికీ అప్పటికి ఆమోదమయింది. అనుకున్నట్టుగా ఆ ఇద్దరూ షిర్డీకి వచ్చేశారు. షిర్డీవాసులందరికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇక ‘అలీ’ని ఎలా సాయి నుంచి వదిలించాలా? సాయిని ఎలా తమ వైపుకి రప్పించుకోవాలా? అని ఆలోచించారు భక్తులంతా.

షిర్డీలో దేవీదాస్‌ అనే మహా తేజోవంతుడైన పండితుడు ఉన్నాడు. ఆయనకి ఎంతో గొప్పవారూ వయసులో పెద్దవారూ అయిన తాత్యా పాటిలు, షింపీ వంటి ఎందరో శిష్యులుగా అయి ఎన్నెన్నో విషయాలని ఈయన నుండి తెలుసుకుంటూ ఉండేవారు. అలాంటి దేవీదాసుకి సాయి భక్తులంతా విషయాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పి.. శరణుకోరుతున్నామన్నారు. దేవీదాసు అలీ ఉన్న చోటుకొచ్చి అలీతో వాదం ప్రారంభించాడు. కేవలం కురాన్‌–ఎ–శరీఫ్‌ కంఠస్థం చేసి ఉండడమే తప్ప వాటిలోతులు తెలియని కారణంగా దేవిదాసు వాదపాండిత్యం ముందు అలీ తట్టుకోలేక ఓటమిని అంగీకరించి సాయిని విడిచేసి షిర్డీ నుండి పారిపోయాడు. మేఘం విడిచిన సూర్యునిలా మళ్లీ సాయి దేదీప్యమానంగా ప్రవేశించసాగాడు. కొన్నేళ్ల తర్వాత అలీ షిర్డీకి వచ్చి సాయి పాదాల మీద పడి మన్నింపవలసిందని వేడి పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు అందరి సమక్షంలోనూ.

లో భావం..?
సాయి ఎందుకిలా ప్రవర్తించాడనేది గట్టి ప్రశ్న కదా! వ్యక్తికి అహంకారమనేది ప్రారంభమే పెరుగుతున్న కాలంలో పతనమౌతామనే విషయం స్ఫురణలోకి రాదు. దీనికి ఉదాహరణే ‘అలీ’!
మంచో చెడో ఒకరినంటూ గురువుగా ఎన్నుకున్నాక, అతణ్ని ఆశ్రయించాక శిష్యునిలానే గురువుకి శుశ్రూష చేయాల్సిందే తప్ప నడుమలో విడిచివేయకూడదు. నిజమైన గురువు ఎలా ఉండడో, ఎలా ఉండేవాడు మాత్రమే గురువో ఆ విషయాన్ని తెలియజేయ దలిచాడు సాయి. తెలియజెప్పాడు. లోకంలో ఎందరో కేవలం పాండిత్యం ద్వారా జనాన్ని ఆకర్షిస్తూ, ఆ తాము చెప్పేదాన్ని ఆచరించకుండా స్వప్రచారం ద్వారా ఎంతెంత ఎత్తులకి ఎదిగిపోతారో గమనిస్తూ వాళ్లని నిజమైన గురువులుగా ఎలా లెక్కించకూడదో తెలియజేసే వృత్తాంతమే ఈ సంఘటన. ఇలా జనం అందరికీ గుండెలలోతుగా విషయాన్ని అర్థమయ్యేలా చేసేందుకు సాయి ఆ కపట వంచన గురువుకి యథార్థ శిష్యునిగా సేవ చేశాడు. అందుకే సాయి లీలల్ని లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పేది కూడా! మహమ్మదీయుల ‘ఉరుసు’ పండుగని సాయి శ్రీరామనవమిగా మార్చాడు. అది ఎలా జరిగిందో చూద్దాం!
∙డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement