
వైజాగ్ కోసం...నేను సైతం!
శ్రీయ మంచి నటి మాత్రమే కాదు.. మంచి చిత్రకారిణి కూడా. ఆ విషయం కొద్దిమందికే తెలుసు. చిన్నప్పుడు సరదాగా ఎన్నో అందమైన బొమ్మలు గీసిన శ్రీయ తాజాగా కుంచె పట్టారు. అయితే ఈసారి సరదా కోసం కాదు.. ఓ బలమైన కారణం కోసం. హుదూద్ తుపాను కారణంగా నిన్నటి విశాఖపట్నం శోభ ఇప్పుడు లేదు.
నగరానికి మళ్లీ పాత వైభవాన్ని తీసుకురావడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సహాయం చేస్తున్నారు. శ్రీయ కూడా తన వంతుగా రెండు బొమ్మలు గీశారు. వైజాగ్ పునరుద్ధరణ కోసం నిధి సమకూర్చే దిశలో ఏర్పాటు చేసిన ఒక ‘ఆర్ట్ షో’కు తాను గీసిన కృష్ణుడు, బుద్ధుడి బొమ్మలను పంపించారు శ్రీయ. ఆదివారం హైదరాబాద్‌లో ఈ షో జరగనుంది.
ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ -‘‘ఆర్ట్ షోకి ఏదైనా బొమ్మలు గీసివ్వాలని నిర్వాహకులు నన్ను కోరారు. ఓ సత్కార్యం కోసం చేస్తున్నది కాబట్టి, వెంటనే అంగీకరించాను. నా పరిధిలో వైజాగ్ కోసం ఏ సహాయం చేయడానికైనా వెనకాడకూడదనుకున్నాను. విశాఖ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. బోల్డన్ని తీపి జ్ఞాపకాలు మిగిల్చిన నగరం అది. నటిగా నా తొలి సన్నివేశం చేసింది అరకులోనే. అలాగే, నౌకాదళంలో పని చేస్తున్న నా కజిన్ ఉండేది ఆ నగరంలోనే. ప్రకృతి సృష్టించిన బీభత్సం గురించి తను చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది’’ అని చెప్పారు.