
నేను మగాణ్ణి అయితే.. లుంగీలే కట్టేదాన్ని!
‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటారు. అంటే.. తెలివితేటలున్న అందగత్తె అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికో ఉదాహరణగా శ్రుతిహాసన్‌ని చెప్పుకోవచ్చు. ఆమెతో మాట్లాడితే ఆత్మవిశ్వాసానికి చిరునామా అనిపించక మానదు. కెరీర్ ప్రారంభంలో ‘అన్‌లక్కీ’ అనిపించుకున్న శ్రుతిహాసన్ ఇప్పుడు వరుస విజయాలతో ‘లక్కీ’ అనిపించుకుంటున్నారు. కానీ, తాను ఇవేమీ పట్టించుకోనని, ప్రతి సినిమాకీ శాయశక్తులా కృషి చేస్తానని శ్రుతి చెప్పారు. ఇటీవల విడుదలైన ‘రేసుగుర్రం’ విజయం ఆనందాన్నిచ్చిందంటున్న శ్రుతితో జరిపిన ఇంటర్వ్యూ...
వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తోంది?
ఆనందంగా ఉంది. కానీ పూర్తిగా ఆస్వాదించే సమయం మాత్రం లేదు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. దాంతో షూటింగ్స్‌తోనే సరిపోతోంది.
‘రేసుగుర్రం’లో ఉద్వేగాలను బయటపెట్టని స్పందనగా నటించారు కదా.. ఆ పాత్ర ఎలాంటి అనుభూతినిచ్చింది?
నా నిజజీవితానికి భిన్నమైన పాత్ర ఇది. నా ఫీలింగ్స్‌ని బయటపెట్టేస్తుంటాను. కానీ, ఈ సినిమాలో నవ్వడం, భయపడటం కూడా లోలోపలే. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. నిజానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి స్వభావం ఈ పాత్రలానే ఉంటుంది. ఆయన ఎక్కువగా మాట్లాడరు. కానీ, తను ఏం తీయాలనే విషయాల మీద స్పష్టత ఉంటుంది.
ఈ సినిమాలో లుంగీ కట్టుకున్నారు...?
లుంగీ కట్టడం ఇదే ప్రథమం. చాలా సౌకర్యవంతంగా అనిపించింది. ఒకవేళ మగాణ్ణి అయ్యుంటే ఎక్కువగా లుంగీలే కట్టుకునేదాన్ని
ఆ మధ్య అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది కదా.. ఆ తర్వాతేమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
ఆరోగ్యం విషయంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. ఇప్పుడు మరింత జాగ్రత్త వహిస్తున్నా. ఎందుకంటే ఆ ఆపరేషన్ తర్వాత బరువు పెరుగుతారని, త్వరగా నీరసపడతారని విన్నాను.
మరి.. బరువు పెరగకుండా ఉండటానికి ఏం చేస్తున్నారు?
ఎప్పటిలానే యోగా చేస్తున్నాను. వ్యాయామాలను మిస్ కాను. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. అలాగని కడుపు మాత్రం మాడ్చుకోను.
ఓకె.. ఇప్పటివరకు మీ జీవితంలో జరిగినవాటిలో మర్చిపోలేని కొన్ని సంఘటనలను చెబుతారా?
నా చిన్నప్పుడు జరిగిన రెండు సంఘటనల గురించి ముఖ్యంగా చెప్పాలి. నాన్నగారి వరల్డ్ టూర్‌లో భాగంగా నేను వేదిక మీద ఓ పాట పాడాను. అప్పుడు నా వయసు ఐదేళ్లు. స్టేజి మీద పాడటం అదే మొదటిసారి కావడంతో కొంచెం బెరుకుగా అనిపించింది. కానీ, పాడేశాను. మా చెల్లెలు పుట్టినప్పుడు నాకు భలే అనిపించింది. అప్పుడు నా వయసు నాలుగున్నరేళ్లు. చెల్లెలు పుట్టినప్పుడు ఆడుకోవడానికి మనకు మంచి బొమ్మ దొరికింది అనిపించింది. మామూలుగా ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే దాదాపు గొడవ పడుతుంటారు. కానీ, మేమిద్దరం అస్సలు గొడవపడేవాళ్లం కాదు.
అక్షర కథానాయికగా నటిస్తోంది కదా. సలహాలేమైనా తీసుకుందా?
ఎందుకు తీసుకోవాలి? తన కెరీర్ తన ఇష్టం కదా.
మీరు కూడా మీ అమ్మానాన్నల సలహా తీసుకోరనుకుంటా! అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిదేగా?
మంచిదే. కాదనడంలేదు. కానీ, నేను చేయబోయే సినిమాల గురించి వారి సలహా తీసుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, ఏ సినిమాకైనా 50, 60 రోజులు షూటింగ్ చేస్తాం. అన్ని రోజులు ఒకే యూనిట్‌తో ఉండబోయేది నేనే. మా అమ్మానాన్న కాదు. అలాంటప్పుడు ఏ యూనిట్‌తో సినిమా చేస్తే బాగుంటుందో నేనే నిర్ణయించుకోవాలి. ఇక, ఎలాంటి పాత్రలు చేయాలనే విషయం మీద ఎప్పుడైనా సందేహం వచ్చిందనుకోండి తప్పకుండా మా అమ్మానాన్నని అడుగుతాను. అంతేకానీ చిన్న చిన్న విషయాలకు కూడా వారి సలహా మీద ఆధారపడాలనుకోను.
తెలుగు కాకుండా ఇతర భాషల్లో మీరు చేస్తున్న సినిమాల గురించి?
తమిళంలో విశాల్ సరసన ‘పూజై’, హిందీలో ‘గబ్బర్’, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాల్లో నటిస్తున్నాను.
సో.. విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తున్నారన్నమాట?
అవును. కానీ, ఇదే బాగుంది. మా కుటుంబానికి సినిమాలు తప్ప వేరే ప్రపంచం లేదు. వేరే ఏదైనా చేయాలన్నా మాకు తెలియదు. ఈ సినిమా ప్రపంచానికి దూరమైతే ఇంత ఆనందంగా మాత్రం బతకలేను. అందుకని నాకు విశ్రాంతి దొరక్కపోయినా ఫర్వాలేదు.
ముంబయ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ఆ మధ్య ఓ వ్యక్తి మీ ఇంట్లోకి చొరబడ్డాడు కదా. ఆ సంఘటనతో ఇక ఒంటరిగా ఉండకూదని ఫిక్స్ అయ్యారా?
ఊహూ. జీవితం అన్నాక ఇలాంటివి జరగడం సహజం. అంత మాత్రాన బేలగా మారిపోతే మున్ముందు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. వాటిని తట్టుకుని నిలబడలేం. ఇలాంటి సంఘటనలు మరింత ధైర్యం పెంచడానికి ఉపయోగపడతాయన్నది నా అభిప్రాయం. నన్నంత సులువుగా ఎవరూ భయపెట్టెయలేరు.
అంటే.. చాలా ధైర్యవంతురాలనుకోవచ్చా?
కచ్చితంగా అనుకోవచ్చు. భయపడితే ఏమీ చేయలేం. భయపడకపోతే ఏదైనా సాధించగలుగుతాం.
- డి.జి.భవాని