సిద్ధార్థ్‌తో నాలుగోసారి.. | Siddharth And Trisha May Act In Andhadhun Remake | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్‌తో నాలుగోసారి..

Published Sat, Apr 20 2019 9:07 AM | Last Updated on Sat, Apr 20 2019 9:07 AM

Siddharth And Trisha May Act In Andhadhun Remake - Sakshi

తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్, త్రిషలది హిట్‌ కాంబినేషన్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఈ జంట కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సిద్ధార్థ్‌ కోలీవుడ్‌లో నటించి చాలా కాలమవుతోంది. ఆయన సొంతంగా నిర్మించి, నటించిన ఆవళ్‌ చిత్రం తరువాత మరో చిత్రంలో నటించలేదు. అయితే తాజాగా శశి దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి శివప్పు మంజల్‌ పచ్చై చిత్రంలో నటిస్తున్నారు. ఇక నటి త్రిష మార్కెట్‌ ఆ మధ్య తడబడ్డా 96 చిత్రంలో మళ్లీ సక్సెస్‌ గాడిలో పడింది. రజనీకాంత్‌తో నటించిన పేట హిట్‌ ఆమెకు మరింత జోష్‌ను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష త్వరలో దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ కథ, కథనం అందించి సొంతంగా నిర్మించనున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రం ఫేమ్‌ శరవణన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్‌. అంధధాన్‌ అనే హిందీ చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించారు. నటి రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది. అంధాదున్‌ చిత్రం ఇటీవల చైనాలో విడుదలై సుమారు రూ.200 కోట్లు వసూల్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తమిళంలో రీమేక్‌ కానుందని, ఇందులో హీరోగా సిద్ధార్థ్‌ నటించనున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రంలో త్రిష నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ఈ జంట నాలుగోసారి రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇంతకు ముందు ఈ జంట ఆయుధ ఎళుత్తు, ఆరణ్మణై–2, తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల్లో నటించారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement