వివాదాలకు చిరునామా అనిపించుకున్న తమిళ హీరో శింబు ఈ మధ్య బాగా బరువు పెరగడంతో పాటు గడ్డం పెంచేశారు. దర్శకుడు-నటుడు ఎస్.జె. సూర్య అయితే జిమ్‌లో అదే పనిగా కసరత్తులు చేస్తున్నారు. హోమ్లీ హీరోయిన్ విద్యాబాలనేమో వాట్సాప్ ద్వారా మాతృభాష నేర్చుకుంటున్నారు. హాట్ గాళ్ కంగనా రనౌత్ అయితే ఏకంగా బట్టలు ఉతుకున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ అన్నట్లు.. ‘ఏమైంది వీళ్లకు’ అనుకుంటున్నారా? మరేం లేదు.. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ల్లోని పాత్రల కోసమే కసరత్తులు చేస్తున్నారు.
అశ్విన్ తాతగారు...వెరీ పవర్‌ఫుల్ సారూ...
‘అన్బానవన్.. అసరాదవన్.. అడంగాదవన్’.. శింబు హీరోగా నటిస్తున్న తమిళ చిత్రమిది. ఇందులో శింబు యువకుడిగా, మధ్యవయస్కుడిగా, వృద్ధుడిగా మూడు పాత్రల్లో కనిపించనున్నారు. మధ్యవయస్కుడి సరసన శ్రీయ, యువకుడి సరసన తమన్నా నాయికలుగా నటిస్తున్నారు. మూడు పాత్రల్లోనూ వ్యత్యాసం చూపించడానికి శింబు కసరత్తులు చేశారు. ముఖ్యంగా వృద్ధ పాత్ర కోసం చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ పాత్ర పేరు అశ్విన్ తాత. ఈ తాతగారు చాలా దృఢంగా ఉంటారట. అందుకని శింబు బరువు పెంచారు. ఈ పాత్రలో 95 కిలోల బరువుతో కనిపిస్తారు. గడ్డం, మీసాలు పెంచారు. మొహం మీద ముడతలు కనిపించాలి కాబట్టి, ప్రోస్థెటిక్ మేకప్ వేయించుకుంటున్నారు. ఇటీవల మేకప్ టెస్ట్ కూడా చేశారు. త్వరలో తాత పాత్రకు సంబంధించిన సీన్స్ తీస్తారు.
సిక్స్ ప్యాక్ సూర్య
మామూలుగా హీరోలు పాత్ర డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్ చేస్తారు. విలన్లకు ఆ పట్టింపు ఉండదు. ఎలాగైనా ఉండొచ్చు. నిన్న మొన్నటివరకూ పరిస్థితి ఇదే. ఇప్పుడు సీన్ మారింది. విలన్లు కూడా మేకోవర్ అవుతున్నారు. ప్రస్తుతం ఎస్.జె.సూర్య ఆ పని మీదే ఉన్నారని సమాచారం. ‘నాని’, ‘ఖుషి’, ‘పులి’ వంటి తెలుగు చిత్రాలతో పాటు పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్.జె. సూర్య హీరోగా కూడా నటిస్తుంటారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఎస్.జె.సూర్య సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారట.
వాట్సప్ విద్యా!
‘డర్టీ పిక్చర్’లో గ్లామరస్‌గా విజృంభించినా ‘హోమ్లీ హీరోయిన్’ అనే ట్యాగ్ మాత్రం విద్యాబాలన్‌కి దూరం కాలేదు. నటిగా ఈవిడగారు సంపాదించుకున్న మార్కులు అలాంటివి. పాపం.. ఇటీవల డెంగ్యూ బారిన పడ్డారామె. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యాబాలన్ సెల్‌ఫోన్‌లో వాట్సాప్ ద్వారా తన మాతృభాష మలయాళం నేర్చుకుంటున్నారట. మలయాళ కవయిత్రి కమలా దాస్ జీవిత చరిత్రతో రూపొందనున్న మలయాళ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేయనున్నారు. విద్యాబాలన్ పుట్టింది కేరళలో అయినా పెరిగింది, చదువుకున్నది ముంబైలో. అందుకని మాతృభాష తెలియదు. ఇప్పుడు మలయాళ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి, భాష మీద పట్టు సాధించాలనుకుంటున్నారట. 30 రోజుల్లో మలయాళం నేర్పే పుస్తకం కొనుక్కున్నా జ్వరంతో కాగితాల మీద దృష్టి పెట్టలేకపోయారట. అందుకే వాట్సాప్‌ని ఆశ్రయించారట. మలయాళంలో ఫ్రెండ్స్ మెసేజులు పంపిస్తుంటే.. వాటి ద్వారా భాష నేర్చుకుంటున్నారట.
గులాబీ బాల.. కష్టాలేల!
సుకుమారి కంగనా రనౌత్ నేల తుడిస్తే, బట్టలు ఉతికితే చూడ్డానికి అభిమానులకు బాధగానే ఉంటుంది. అయినా, కోట్లు సంపాదిస్తున్న ఈ మేడమ్ ఎందుకీ పనులు చేస్తారనే సందేహం కలగొచ్చు. సినిమా కోసం చేయాల్సి వచ్చింది. కంగనా కథానాయికగా రూపొందనున్న చిత్రం ‘సిమ్రన్’. హన్సల్ మెహతా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలోని పాత్రకు సంబంధించిన వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి కంగనా యూఎస్ వెళ్లారు. అక్కడి అట్లాంటా హోటల్‌లోని హౌస్‌కీపింగ్ టీమ్‌తో మాట్లాడారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో? అడిగి తెలుసుకున్నారు. తన రూమ్‌కి వచ్చాక శుభ్రంగా ఊడ్చారట. బట్టలు ఉతుక్కున్నారట. పాత్రలో జీవించడానికే ఇదంతా చేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అవసరమే అన్నీ చేయిస్తుంది!
Published Sun, Sep 25 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement