సినిమా: పురుషులు ఆ విషయాన్ని గ్రహించాలి అంటోంది నటి సిమ్రాన్. ఈ పేరు విని చాలా కాలమైంది కదూ. అవును మరి ఈమె తమిళ సినిమాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. 1990 ప్రాంతంలో కోలీవుడ్, టాలీవుడ్ అంటూ తారతమ్యం చూపకుండా కథానాయకిగా దున్నేసిన నటి సిమ్రాన్. ఆ తరువాత తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి పరిమితమైంది. అయితే కోడిట్ట ఇడంగళ్ నిరంబుగా వంటి ఒకటి రెండు చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో కనిపించినా, ఆ తరువాత మళ్లీ సినిమాకు దూరమైంది. అలాంటిది పేట చిత్రంలో రజనీకాంత్‌తో నటించింది. ఇందులోనూ పాత్ర పరిధి చాలా తక్కువే అయినా, అందంగా కనిపించింది. పేట చిత్రం తనకు మంచి రీఎంట్రీ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నటి సిమ్రాన్ ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చింది. అందులో కాస్త మగవారిపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది కూడా. ఇంతకీ ఈ భామ ఏం అందో చూద్దాం.
90 ప్రాంతంలో నటిగా నేను చాలా బిజీ. ఎంత బిజీ అంటే పూర్తిగా సినిమాల్లోనే మునిగితేలాను. ఆ సమయంలో బయట ప్రప్రంచం గురించి గానీ, కుటుంబ గురించి గానీ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. ఆ సమయంలో నేను చాలా విషయాలను కోల్పోయాను. అయితే ఇప్పుడలా కాదు. పండగలు వస్తే అందుకు సమయాన్ని కేటాయిస్తున్నాను. అదే విధంగా పిల్లలు, కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడంపై శ్రద్ధ చూపుతున్నాను. నేనిప్పుడు సంతోషంగా ఉండటానికి కారణం ఇదే. కాగా మగవారు జయిస్తున్నారంటే అందుకు వారి వెనుక స్త్రీలు ఉంటున్నారు. ఈ విషయాన్ని వారు గ్రహించాలి. స్త్రీలు అన్ని విషయాల్లోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కదిద్దడంతోనే మగవారు జయించగలుగుతున్నారు. అందుకే నేనంటా మగవారి కంటే ఆడవారే ఉన్నతమైనవారు అని పేర్కొంది. అయినా సిమ్రాన్ సడన్‌గా పురుష పుంగవులపై దాడి చేయడానికి నేపథ్యం ఏముంటుందనే ఆరాలు తీసే పనిలో సినీ వర్గాలు బిజీ అయిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment