నన్ను లైంగికంగా వేధించారు: గాయని చిన్మయి | Singer Chinmayi: I was groped at an event recently | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 7:08 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Singer Chinmayi: I was groped at an event recently - Sakshi

సాక్షి, చెన్నై :  సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉండే ప్రముఖ గాయని చిన్మయి తాజాగా వరుస ట్వీట్లలో బాలలపై లైంగిక హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాల్యంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. అంతేకాకుండా ఇటీవల ఓ కార్యక్రమంలో తన పట్ల ఓ గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, తనను లైంగికంగా తాకాడని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో..  పిల్లలుగా ఉన్న సమయంలో ఎంతోమంది మహిళలు, పురుషులు ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారేనని తెలియడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, సోదరులు, సహ ప్రయాణికులు, అంకుల్స్‌, గ్రాండ్‌పేరెంట్స్‌, ఆఖరికీ మహిళల చేతిలో కూడా వేధింపులు ఎదుర్కొన్నవారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

‘సాధారణంగా ఇళ్లలో, ప్రజారవాణా ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక స్థలాల్లో, విద్యాసంస్థల్లోనూ లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పడానికి చాలామంది బాలికలు, బాలుర ధైర్యం చాలాదు. తాము చెప్పినా వారు నమ్మరేమోనని వెనకాడుతారు’ అని అన్నారు. బాలికలు చెప్తే వినే అవకాశమున్నా.. పురుషులు చెప్తే అసలే వినరని పేర్కొన్నారు. బాల్యంలో తమపై లైంగిక దాడి, లైంగిక వేధింపులు జరిగాయని పురుషులు చెప్తే.. వారినే ఎద్దేవా చేస్తారని, అదేవిధంగా మహిళలు చెప్తే.. వారు ఎంజాయ్‌ చేశారని నిందిస్తారని, బాలలు తమపై జరిగే లైంగిక దాడులను ఎంజాయ్‌ చేస్తున్నట్టు పెద్దలు పేర్కొనడం తరహాలో ఇది కూడా వికృతంగానే ఉంటుందని ఆమె కామెంట్‌ చేశారు. లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్తే.. చదువు, ఉద్యోగాన్ని మాన్పించి.. ఇంట్లో కూర్చోబెడతారేమోనన్న భయంతో అమ్మాయిలు వెనుకాడుతారని, అయితే, ప్రస్తుతం పరిస్థితి కొంతవరకు మారినట్టు కనిపిస్తోందని గాయని చిన్మయి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement