
శ్వేతా పండిట్
ప్రతిభతో పదిమందిలో గుర్తింపు వచ్చాక వ్యక్తిత్వమే ప్రధానమవుతుంది. ప్రతిభ కన్నా మనకున్న సామాజిక బాధ్యతనే ప్రామాణికంగాతీసుకుంటారు! అలా చూసినప్పుడు ప్రతిభతో పాటు తన సామాజిక బాధ్యతను కూడా చాటుతున్నారు ప్రముఖ సినీ గాయని, నటి శ్వేతా పండిట్.కరోనా వైరస్ స్వేచ్ఛగా విహరిస్తున్న వాతావరణంలో మనం ఇంటి నుంచి అడుగు బయటపెట్టకపోవడమే సామాజిక బాధ్యతగా.. దేశసేవగా మారుతోంది. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ శ్వేతా పండిట్. గాన గంధర్వుడు పండిట్ జస్‌రాజ్‌కు మనవరాలు (మేనకోడలి కూతురు) శ్వేతా పండిట్. నెల రోజుల కిందట ఇటలీకి వెళ్లిన ఆమె రోజురోజుకి అక్కడ కరోనా వ్యాప్తి తీవ్రమవడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అప్పటికి మన దేశంలో కరోనా ప్రభావం లేకపోయినప్పటికీ.. ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాలేదు. ‘కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇక్కడి (ఇటలీ) నుంచి నేను అక్కడికి రావడం బాధ్యతారాహిత్యమే అవుతుంది.
విమాన ప్రయాణం అంత సేఫ్ కాదు. నాకే కాదు భారతదేశంలో నేను చేరుకునే ప్రదేశానికి కూడా. అందుకే నెల రోజులుగా ఇటలీలో నేనుంటున్న ఇంట్లోంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తున్నాను. ఇక్కడ భయంకరమైన పరిస్థితి. అంబులెన్స్ సైరన్ వింటూ నిద్రపోతున్నాను. మళ్లీ తెల్లవారి ఆ సైరన్‌తోనే నిద్రలేస్తున్నాను. అంబులెన్స్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించడం లేదు. రోడ్ల మీద అవి తప్ప ఇంకేవీ తిరగడం లేదు. ఫ్రెండ్స్.. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి.. గవర్నమెంట్ చెప్పే సూచనలు పాటించండి.. ఇంట్లోంచి బయటకు రాకండి.. ఇవి మనకు కీలకమైన రోజులు. జాగ్రత్తగా ఉంటే పెద్ద గండం నుంచి గట్టెక్కిన వాళ్లమవుతాం. లేదంటే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆ దుస్థితి మనకు రావద్దు’ అంటూ అక్కడి విషయాలను, వార్తలను, తన క్వారంటైన్ కాలాన్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, మన క్షేమాన్ని కోరుతున్నారు శ్వేత.
ఈ దేశానికి రాకుండా అక్కడే ఉండిపోయిన శ్వేత నిర్ణయాన్ని, ఆమె సాహసాన్ని అభినందిస్త్నురు పలువురు సినీప్రముఖులు, రాజకీయనేతలు.ప్రతిభాశాలి శ్వేతా పండిట్ బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ పాటలు పాడారు.. పాడుతున్నారు. నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం ‘అంజలి’తో సినిమాల్లో పాటల ప్రయాణం మొదలుపెట్టారు. హిందీలోకీ డబ్ అయిన అంజలీలో కూడా ఆమే పాడారు. దాంతో బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలు అనే కితాబునూ పొందారు శ్వేత. తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్‌తో కలిసి తొమ్మిదో యేటనే సింగీత దర్శకురాలిగా మారారు . ‘సాజ్’ అనే హిందీ సినిమాకు. సాయి పరాంజ్‌పే దర్శకత్వం వహించిన ఈ సినిమాను లతా మంగేష్కర్ బయోగ్రఫిగా చెప్తారు. శ్వేత క్షేమంగా ఇటలీ నుంచి మన దేశానికి చేరుకోవాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment