
తమిళ సినిమా: వేలైక్కారన్ చిత్రం సాధిస్తున్న వసూళ్లతో తనకు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతోందని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన చిత్రం వేలైక్కారన్. మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని 24ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మించారు. అనిరుద్ సంగీతాన్ని అందించారు.
క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ వేలైక్కారన్ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చాలా సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఈ చిత్రం ఇంతకు ముందు శివకార్తికేయన్ నటించిన చిత్రాలన్నిటి కంటే అధిక వసూళ్లను సాధిస్తోందని తెలిపారు. తమిళనాడులోనే కాకుండా కర్ణాటక, కేరళ ప్రేక్షకులు వేలైక్కారన్ చిత్రానికి విశేష ఆదరణ చూపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా కేరళలో మరో 30 స్క్రీన్స్‌ను అదనంగా పెంచారని తెలిపారు.
ఇక ఓవర్‌సీస్‌లో వేలైక్కారన్‌కు అనూహ్య ఆదరణ లభిస్తోందని చెప్పారు. వేలైక్కారన్ చిత్ర వసూళ్ల గణాంకాలను బట్టి చిత్ర విజయాన్ని ట్రేడ్ వర్గాలు ధ్రువీకరించడం ఆనందంగా ఉందని తెలి పారు. ఒక మంచి సందేశంతో కూడిన చిత్రాన్ని తాము ఎప్పుడూ ఆదరిస్తామని ప్రేక్షకులు వేలైక్కారన్ చిత్రం ద్వారా మరోసారి నిరూపించారని అన్నారు. సమాజానికి కావలసిన ఒక సందేశంతో కూడిన మంచి కమర్శియల్ చిత్రాన్ని ప్రజల్లోకి చేరినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు మోహన్‌రాజా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment