సేవలోనూ స్టార్లే! | social service by heroines | Sakshi
Sakshi News home page

సేవలోనూ స్టార్లే!

Published Sat, Mar 8 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

సేవలోనూ స్టార్లే!

సేవలోనూ స్టార్లే!

అద్దాల మేడలు, పొడవాటి కార్లు, చిటికేస్తే పనులు చేసిపెట్టడానికి చుట్టూ మనుషులు...చుక్కలనంటే పారితోషికం తీసుకునే చక్కని కథానాయికల జీవితం ఇలా ఉంటుందని చాలామంది ఊహిస్తారు. ఈ సౌకర్యాలన్నీ అనుభవించే స్థాయికి చేరడానికి వాళ్లు పడే కష్టాలు వాళ్లకి ఉంటాయి. ఆ సంగతి  వదిలేస్తే.. ఆ దేవుడు తమకు ఇంత మంచి జీవితాన్నిచ్చాడు కాబట్టి, వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తపనపడే తారలు చాలామంది ఉన్నారు. సినిమాల్లో యాక్ట్ చేయడం మాత్రమే కాదు.. షాప్ ఓపెనింగ్స్, యాడ్స్ ఇలా నిమిషాలు లెక్కపెట్టి వీళ్లు పారితోషికం తీసుకుంటున్నారు. అంత ఖరీదైన నిమిషాలను ఎంతో దారాళంగా సేవా కార్యక్రమాలకు ఖర్చుపెట్టి, తమ అంతః సౌందర్యాన్ని చాటుకుంటున్నారు. ‘మహిళా దినోత్సవ’ వేళ ఆ ‘రియల్ హీరోయిన్స్’ గురించి  తెలుసుకుందాం...

 


 
 సగం జీవితంసేవలకే...
 
 అమల జీవితం వడ్డించిన విస్తరే అనాలి. కథానాయికగా చక్కగానే రాణించారు. వ్యక్తిగత జీవితం ఇంకా సూపర్బ్. మామూలుగా అయితే, ఆ జీవితాన్ని హాయిగా ఆస్వాదించేస్తారు. కానీ, అమల అలా కాదు. తనకెలాగూ మంచి జీవితం లభించింది కాబట్టి, సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. అది కూడా మూగ జీవాలకు. హైదరాబాద్‌లో బ్లూ క్రాస్ సంస్థ ఆరంభించి, సగం జీవితాన్ని దానికే కేటాయించేశారామె. అది మాత్రమే కాకుండా ‘వేగన్’గా మారిపోయారు. జంతు ఉత్పత్తులను కాకుండా కేవలం శాకాహారం మాత్రమే తీసుకునేవారిని వేగన్ అంటారు. దీన్నిబట్టి అమల అంకితభావం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు బ్లూ క్రాస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు మహిళలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అమల.


 
 చిన్ననాటి ప్రేరణతో...
 అది న్యూఢిల్లీలోని డీఎస్‌పీ స్కూల్. శ్రీయ చదువుకున్నది అక్కడే. ఆ స్కూల్ ఎదురుగా ఓ అంధుల పాఠశాల ఉంది. వీలు కుదిరినప్పుడల్లా అక్కడికెళ్లడం, ఆ పాఠశాలలో ఉన్నవారిని చూడటం శ్రీయకు అలవాటు. పెద్దయిన తర్వాత వాళ్ల కోసం ఏమైనా చేయాలనుకోవడం మాత్రమే కాదు.. ఆచరణలో పెట్టారామె. ‘శ్రీ’ పేరుతో ఓ స్పా ఆరంభించారు. బాడీ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ లాంటి సేవలు లభిస్తాయి. అక్కడ పనిచేస్తున్నవాళ్లల్లో కొంతమంది పూర్తిగా అంధులు కాగా, కొంతమందికి కొంచెం చూపు ఉంటుంది. వాళ్లకి ఏదైనా ఉపాధి కల్పించాలనే ఆకాంక్షతో ఈ స్పా పెట్టానని శ్రీయ తెలిపారు. ఈ స్పాలో వీరు అందిస్తున్న సేవలు అద్భుతం అని ముంబయ్ టాక్.
 
 
 ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా...

 సమంత కథానాయిక అయ్యి నాలుగేళ్లయ్యింది. ప్రస్తుతం తను ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్. తల్చుకుంటే కేలండర్‌లో ఒక్క డేట్ కూడా మిగలకుండా సినిమాలు, యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ కమిట్ అయిపోవచ్చు. కానీ, సమంత అలా చేయలేదు. వాటిని తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకే, ‘ప్రత్యూష ఫౌండేషన్’ ప్రారంభించారు. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం వర్క్ చేస్తున్నారామె. చిన్న స్థాయిలో మొదలుపెట్టి, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయా లన్నది సమంత ఆకాంక్ష.
 
 

 23 మంది పిల్లలకు సహాయం!
 హన్సిక వయసు 23. ఆమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్యా ఇరవైమూడే. ఈ పిల్లల చదువు, సంరక్షణకయ్యే ఖర్చుని హన్సికే భరిస్తారు. అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదని, అందుకే పిల్లలను చదివిస్తున్నానని ఆమె ఓ సందర్భంలో తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు హన్సిక.
 
 ఇంకా మూగజీవాల సంరక్షణ కోసం త్రిష పాటుపడుతున్నారు. బాలీవుడ్‌లో కత్రినా కైఫ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహిస్తున్న ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థకు ఇటీవల 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారామె. ప్రతి నెలా కొంతమంది వృద్ధులకు వెయ్యి రూపాయలు ఇస్తుంటారట ఏక్తాకపూర్. ఇంకా ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి, దియా మీర్జా తదితర తారలు అడపా దడపా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement