దసరా బుల్లోడు ఏయన్నార్ గుర్తొస్తున్నారు | Soggade Chinni Nayana Audio Launch | Sakshi
Sakshi News home page

దసరా బుల్లోడు ఏయన్నార్ గుర్తొస్తున్నారు

Published Sat, Dec 26 2015 12:53 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

దసరా బుల్లోడు ఏయన్నార్ గుర్తొస్తున్నారు - Sakshi

దసరా బుల్లోడు ఏయన్నార్ గుర్తొస్తున్నారు

- కె. రాఘవేంద్రరావు
‘‘నాగార్జునను పంచెకట్టులో చూస్తుంటే, ‘దసరా బుల్లోడు’ సినిమాలో ఏయన్నార్‌గారు గుర్తొస్తున్నారు. ఆ సినిమాకన్నా ఈ చిత్రం రెట్టింపు విజయం సాధించాలి. నాగార్జున ఒక చేతిలో కర్ర, మరో చేతిలో రమ్యకృష్ణ, లావణ్య, హంసా నందినితో స్టిల్ చూస్తుంటే  బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమాకి తిరుగు లేదనిపిస్తోంది’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి నాయకా నాయికలుగా రూపొందిన చిత్రం ‘సొగ్గాడే చిన్ని నాయనా’.

నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ, హంసా నందిని తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని రాఘవేంద్రరావు ఆవిష్కరించి, నాగార్జునకు ఇచ్చారు. ఆడియో వేడుక చాలా విభిన్నంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నట్లుగా లైవ్‌గా నాగ్, లావణ్య, అనసూయ, హంసా నందిని వేదికపై పెర్‌ఫార్మ్ చేశారు. పంచెకట్టులో నాగ్ చేసిన మాస్ డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ - ‘‘నాన్నగారు, నేను, చైతూ చేసిన ‘మనం’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారు అభిమానులకు బాగా దగ్గరవ్వడానికి కారణం ఆయన చిత్రాల్లో ఉండే ఆప్యాయతానురాగాలు, అనుబంధాలు. వాటిని దృష్టిలో పెట్టుకునే  ఈ కథ ఎంచుకున్నాను. నాకు, అభిమానులకు ఫేవరెట్ మూవీ ‘హలో బ్రదర్’. ఆ చిత్రంలో ఉన్నంత వినోదం ఇందులో ఉంటుంది.

అలాగే, ఈ సినిమాలోని ఆట, పాట, మాట.. ప్రతి సన్నివేశం పసందుగా అనిపిస్తాయి. సాధారణంగా సంక్రాంతిని పచ్చని పల్లెలో తియ్యగా జరుపుకోవాలనుకుంటాం. ఆ పచ్చదనం, తియ్యదనం ఈ చిత్రంలో ఉంటాయి. అనూప్ రూబెన్స్ ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చాడు. జనవరి 15కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. రామ్మోహన్ ఇచ్చిన రెండు పేజీల కథను దర్శకుడు కల్యాణ్ కృష్ణ డెవలప్ చేసి, ఈ సినిమా చేశాడు. ఇలా కొత్తవాళ్లెవరు వచ్చినా అవకాశం ఇస్తాను’’ అని చెప్పారు.

అందరికీ దేవుడు ఒక్కో అవతారంలో కనిపిస్తే, తనకు నాగార్జున రూపంలో కనిపించాడని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు. ‘హలో బ్రదర్’ టైమ్‌లో  నాగ్ ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, అఖిల్, నాగసుశీల, అమల, మహేశ్‌రెడ్డి, పి. కిరణ్, సునీల్ నారంగ్, అనూప్ రూబెన్స్, సుమంత్, సుశాంత్, లావణ్యా త్రిపాఠీ, అనసూయ, హంసా నందిని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement