
విమానం కనిపెట్టిన భారతీయుడి కథ ఇది : హీరో ఆయుష్మాన్ ఖురానా
‘విక్కీ డోనర్’, ‘నౌటంకీ సాలా’ చిత్రాలతో హిందీ తెరపై ఎగసిన సరికొత్త కెరటం ఆయుష్మాన్ ఖురానా. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా
‘విక్కీ డోనర్’, ‘నౌటంకీ సాలా’ చిత్రాలతో హిందీ తెరపై ఎగసిన సరికొత్త కెరటం ఆయుష్మాన్ ఖురానా. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా తిరుగులేదనిపించుకున్న ఆయుష్మాన్ నటించిన తాజా చిత్రం ‘హవాయ్‌జాదా’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయుష్మాన్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
‘హవాయ్ జాదా’ ప్రత్యేకత ఏంటి?
చరిత్రకెక్కాల్సిన మన భారతీయుడి పేరు మరుగునపడి పోయిన విషయాన్ని భారతీయులందరికీ చెప్పే కథ ఇది. ఇందులో నా పాత్ర పేరు శివ్‌కర్ బాపూజీ తల్‌పాడే. నిజజీవిత పాత్ర అన్నమాట. భారతదేశంలో తొలి విమానాన్ని తయారు చేసింది శివ్‌కరే. 1895లో ఆయన విమానం తయారు చేసి, బాలగంగాధర్ తిలక్, మరో 500 మంది ప్రజల సమక్షంలో ఆ విమానాన్ని ఎగరేశారు. కానీ, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుడికి ఆ ఘనత దక్కడం ఇష్టం లేక ఆ తర్వాత ఎప్పుడో పదేళ్లకు రైట్ బ్రదర్స్ చేసిన ప్రయత్నాన్ని చరిత్రకు ఎక్కించింది. ఆ విధంగా మన భారతీయుడికి అన్యాయం జరిగింది. ఈ చిత్రదర్శకుడు విభు పురీకి విషయం తెలిసి సినిమా చేయాలనుకున్నారు. శివకర్‌గా నన్ను ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ పాత్ర కోసం మరాఠీ భాష నేర్చుకున్నాను.
రైట్ బ్రదర్సే విమానాన్ని కనిపెట్టారని బ్రిటీషువారు నమ్మబలికిన నేపథ్యంలో పాశ్చాత్య దేశాల్లో ఈ చిత్రంపై వివాదం రేగే అవకాశం ఉంది కదా?
ఆ సంగతలా ఉంచితే ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ చిత్రం ఇది. వివాదం గురించి నేను ఆలోచించడం లేదు. ఓ భారతీయుడిగా ఈ చిత్రం చేయడం నా బాధ్యత అని భావించా.
శివ్‌కర్‌ని బ్రిటిష్‌వాళ్లు తొక్కేశారని మీరు బలంగా నమ్ముతున్నారా?
కచ్చితంగా నమ్ముతున్నా. అప్పట్లో సోషల్ మీడియా లేదు. వార్తా పత్రికలు ఉన్నప్పటికీ అవన్నీ బ్రిటిష్ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించేవి. అందుకే, శివ్‌కర్ ప్రతిభ వెలుగులోకి రాలేదు. అదే ఇప్పుడైతే ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్లోనే ఒక్క వార్త పెడితే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పాకిపోతుంది.
మన భారతీయుల ప్రతిభ గురించి మీరేం చెబుతారు?
మన భారతీయులు విదేశీయులకు ఏ మాత్రం తీసిపోరు. విచారం ఏంటంటే, మన హీరోలను.. అంటే కేవలం సినిమా హీరోలను కాదు.. స్పోర్ట్స్ హీరోస్, సైంటిస్ట్స్‌ని మనం సీరియస్‌గా తీసుకోం. మనలో ఉన్న ప్రతిభను మనమే గుర్తించకపోతే ఎలా!
‘విక్కీ డోనర్’ సినిమాలో స్పెర్మ్ డోనేట్ చేశారు. మరి నిజంగా చేసేంత ధారాళమైన మనసు మీకుందా?
నేనా పని చేసిన విషయం మీ హైదరాబాద్ వరకూ రాలేదనుకుంటా!
అయితే, ఆ సినిమా ఆదర్శంతో చేశారా?
లేదు. ‘రోడీస్’ అనే రియాల్టీ షో చేశాను. ఆ షో వీర్యదానానికి సంబంధించినది. అది చేసిన తర్వాత నిజంగా కూడా మనం ఎందుకలా చేయకూడదనిపించి, చేశాను. ఎవరికి దానం చేశానో నాకు తెలియదు. ఇస్తున్నవారికి పుచ్చుకుంటున్నవారి వివరాలు, పుచ్చుకుంటున్నవారికి ఇచ్చినవారి వివరాలు తెలియజేయరు కదా!
ఓకే.. మీ వ్యక్తిగత విషయానికి వద్దాం.. మీరు యంగ్ డాడీ అట..
(నవ్వుతూ). అవును. నాకిద్దరు పిల్లలు. ఒక బాబు, ఓ పాప. బాబుకి మూడేళ్లు. పాప పుట్టి ఈ ఏడాది ఏప్రిల్‌కి సంవత్సరం అవుతుంది.
సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నట్లున్నారు?
అవును. మాది ప్రేమ వివాహం. నా బాల్య స్నేహితురాలు తాహిరాని పెళ్లి చేసుకున్నాను. మాది స్వీట్ ఫ్యామిలీ.
-డి.జి.భవాని