సౌత్‌ నుంచి నార్త్‌కు పాకిన రీమిక్స్‌ నషా ఇది..! | Special story to remix songs | Sakshi
Sakshi News home page

టాలీ మిక్స్‌ టు బాలీ మిక్స్‌

Published Tue, Sep 25 2018 12:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Special story to remix songs - Sakshi

పల్లవీ చరణాలే కలెక్షన్ల రణరంగంలో కీలకం.పాట పాతదైనా పర్వాలేదు కొత్తగా కొడదాం అనుకుంటున్నారు.రీమిక్స్‌ చేసి రిపీటెడ్‌గా ఆడియన్స్‌ను రప్పించొచ్చు అని భావిస్తున్నారు.నాటి ఘంటసాల ఇప్పటి హేమచంద్ర అవుతున్నాడు.నాటి హెలెన్‌ నేటి సోనాక్షి అవుతున్నది.హాల్లో కూర్చున్న ప్రేక్షకుడు కొత్తగా థ్రిల్లయితే క్లాప్స్‌ కొడుతున్నాడు.అతణ్ణి మెప్పించడానికి పాడిందే పాడుతున్నారు. సౌత్‌ నుంచి నార్త్‌కు పాకిన రీమిక్స్‌ నషా ఇది.

పాటలో పైసా ఉంది. మంచి పాట తెర మీద కాకతో పాటు కలెక్షన్లను కూడా పుట్టిస్తుంది. అందుకే సినిమా వాళ్లు పాట దగ్గర మాట రాకుండా చూసుకుంటారు. ఒక మాట ఎక్కువేసైనా సరే మంచి పాట రాబట్టుకోవాలని చూస్తారు. అంతేకాదు... హిట్టయిన పాటల్లో రసం ఎక్కువగా ఉంటుందని భావించి మళ్లీ ఒకసారి వాటిని రీమిక్స్‌ పేరుతో పిండడానికి రెడీ అయిపోతారు. తెలుగులో సూపర్‌ హిట్‌ పాటలు ఉన్నాయి. అయితే ఆ సూపర్‌హిట్‌ పాటల్లో నటించిన హీరోల వారసులే ఆ పాటలకు కూడా వారసులుగా ఉంటే అభిమానులు ఆనందపడతారనే భావన సినిమా వాళ్లకు కలిగింది. కలిగిన వెంటనే ఆచరణ కూడా మొదలయ్యింది.

నీ తొలిచూపులోనే...
ఎన్టీఆర్‌ నటించిన ‘జస్టిస్‌ చౌదరి’ సినిమాలోని ‘నీ తొలిచూపులోనే’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. శారదతో పాటు పూల గుచ్ఛం పట్టుకుని ఎన్టీఆర్‌ నటించిన ఆ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంది. బాలకృష్ణ హీరోగా రంగప్రవేశం చేసిన రోజులలో ఆయనకు ఎన్టీఆర్‌ పాట ప్లస్‌ అవుతుందన్న ఉద్దేశంతో ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలో ‘నీ తొలిచూపులోనే’ పాటను పెట్టారు. అయితే అప్పటికి రీమిక్స్‌ చేయడం మొదలుకాలేదు కనుక ఒరిజినల్‌ ట్రాక్‌నే రిపీట్‌ చేశారు. బాలకృష్ణ, రాధ కలిసి ఆ పాటలో నటించారు. అయితే ఒరిజినల్‌ పాట కంటే బాగా ఆ పాటను తీయకపోవడంతో పెద్దగా ప్రశంసలు రాలేదు. ఆ తర్వాత కొంతకాలం ఈ రిపీట్‌/రీమిక్స్‌ల జోలికి ఎవరూ వెళ్లలేదు.

ఇళయరాజా ‘ప్రేమ యాత్రలకు బృందావనము’...
వంశీ తీసిన ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’లో పాత పాటలకు కథానుసారం రీమిక్స్‌ పాటలు అవసరమయ్యాయి. ఇళయరాజా వంటి సంగీత దర్శకుడు పాత పాటలకు కొత్త రూపం ఎలా ఇస్తారా అని అందరూ కుతూహలంగా చూశారు. అయితే ఎంతో ప్రతిభాశాలి కనుక పాతపాటలను ఆయన గౌరవం చెడకుండా రీమిక్స్‌ చేశారు. ‘నిన్నలా చూస్తుంటే’, ‘సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా’, ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే’ పాటలు హిట్‌ అయ్యాయి. వాటికి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ డూపులు నటించినా ప్రేక్షకులు ఆనందించారు. ఇది ఓ మంచి ప్రయోగంగా మిగిలింది.

చినుకు చినుక అందెలలో...
‘మాయలోడు’ సినిమాలోని ‘చినుకు చినుకు అందెలలో’ పాట సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. కమెడియన్‌ బాబూమోహన్‌ ఆ సమయంలో పీక్‌లో ఉన్నారు. ఆయనకు సరసన సాక్షాత్తు సౌందర్య ఈ పాటలో నటించడంతో క్రేజ్‌ వచ్చింది. ‘మాయలోడు’ హిట్‌ కావడంలో ఈ పాట ముఖ్యపాత్ర పోషించింది. అందుకే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ పాటను రీమిక్స్‌ చేయకుండా ‘శుభలగ్నం’లో రిపీట్‌ చేశారు. అలీతో కలిసి సౌందర్య అదే పాటకు డాన్స్‌ చేయడం.. తిరిగి అంతే ప్రజాదరణ పొందడం చెప్పుకోదగ్గ అంశం.

ఈ రేయి తీయనిది....
దర్శకుడుగా మారిన పవన్‌ కల్యాణ్‌ తన తొలి సినిమా ‘జాని’లో ‘ఈ రేయి తీయనిది’ పాటను రీమిక్స్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ‘చిట్టిచెల్లెలు’లో సాలూరి రాజేశ్వరరావు చేసిన ఈ పాట మనోహరంగా ఉంటుంది. దానిని చెడగొట్టకుండా అంతే అందంగా దర్శకుడు రమణ గోగుల రీమిక్స్‌ చేశారు. చిత్రీకరణ కూడా అందంగా చేయడం వల్ల పాట రాణించింది. కాని సినిమా పరాజయం వల్ల పొందవలసినంత గుర్తింపు పొందలేదు. కాని అదే పవన్‌ కల్యాణ్‌ ‘ఖుషి’ సినిమాలో చేసిన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాట హిట్టయ్యి పేరు తెచ్చింది. 

ఎన్టీఆర్, ఏ.ఎన్‌.ఆర్, కృష్ణ...
ఆ తర్వాతి రోజులలో మంచి పాటలు కరువైనప్పుడల్లా లేదా సినిమాకు ఏదైనా క్రేజ్‌ తేవాలనుకున్నప్పుడల్లా పాత పాటల రీమిక్స్‌ ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్‌ పాటలు ‘ఆకుచాటు పిందె తడిసె’, ‘ఓలమ్మి తిక్క రేగిందా’ పాటలను జూ.ఎన్టీఆర్‌ తన సినిమాలు ‘అందాల రాముడు’, ‘యమదొంగ’ కోసం రీమిక్స్‌ చేశారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట ప్రభాస్‌ ‘అడవి రాముడు’లో రీమిక్స్‌ అయ్యింది. ‘రావోయి చందమామ’ పాట మంచు విష్ణు తొలి సినిమా ‘విష్ణు’లో రీమిక్స్‌ అయ్యింది. అక్కినేని ‘పల్లెకు పోదాం పారును చూదాం’ పాటను ఆయన మనమడు సుశాంత్‌ ‘ఆటాడుకుందాం రా’లో రీమిక్స్‌ చేశాడు. నాగార్జున ‘నేనున్నాను’ కోసం ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో’ రీమిక్స్‌ చేశారు. నాగార్జునాయే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కోసం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పాటను రీమిక్స్‌ చేశారు. ‘మనం’ కోసం ‘నేను పుట్టాను’ పాటను రీమిక్స్‌ చేస్తే ఆ పాట మంచి ఆదరణ పొందింది. తాత పాటలో నటించిన నాగ చైతన్య ఇప్పుడు తండ్రి పాట ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ పాటను రీమిక్స్‌ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ పాట ‘సవ్యసాచి’ సినిమాలో రానుంది. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా కోసం ఏఎన్‌ఆర్‌ హిట్‌ ‘ఒక లైలా కోసం తిరిగాను దేశం’ పాటను రీమిక్స్‌ చేయడం తెలిసిందే. ఇక కృష్ణ పాట ‘గలగలపారుతున్న గోదారిలా’ను పోకిరి కోసం మహేశ్‌బాబు రీమిక్స్‌ చేశారు. కృష్ణ ‘ఆకాశంలో ఒక తార’ను అల్లరి నరేశ్‌ ‘సీమటపాకాయ’ కోసం రీమిక్స్‌ చేశారు. 

చిరంజీవి పాటల పెన్నిధి
చిరంజీవి పాటలు మెగా కాంపౌండ్‌ హీరోలకు పెన్నిధిగా మారాయి. ఆయన పాటలకు తొలి వారసుడిగా రామ్‌చరణ్‌ ‘మగధీర’ కోసం ‘బంగారు కోడిపెట్ట’ పాటను, ‘నాయక్‌’ కోసం ‘శుభలేఖ రాసుకున్న’ పాటను, ‘రచ్చ’ కోసం ‘వాన వాన వెల్లువాయె’ పాటను రీమిక్స్‌ చేశారు. చిరంజీవి పాటలను వరుసపెట్టి రీమేక్‌ చేసిన మరో హీరో సాయిధరమ్‌ తేజ్‌. ఇతను చిరంజీవి పాటలు ‘గువ్వా గోరింకతో’, ‘అందం హిందోళం’, ‘చమకు చమకు చామ్‌’ పాటలను తన ‘సుప్రీం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘ఇంటెలిజెంట్‌’ సినిమాల కోసం రీమిక్స్‌ చేశారు. ‘అల్లరి’ నరేశ్‌ ‘సీమశాస్త్రి’ కోసం చిరంజీవి ‘మంచమేసి దుప్పటేసి’ పాటను రీమిక్స్‌ చేశారు.ఇంకా ఈ వరుసలో చాలాపాటలు రీమిక్స్‌ అయ్యేలా ఉన్నాయి. ఎన్‌.టి.ఆర్‌ బయోపిక్‌ కోసం కొన్ని పాటలు రీమిక్స్‌ చేయక తప్పదు. అలాగే చిన్న హీరోలు కూడా తమ సినిమాల బలం కోసం రీమిక్స్‌లవైపు చూస్తున్నారు. 


హిందీలో ఇదే వరుస
కాగా రీమిక్స్‌లకు దూరంగా ఉండే హిందీ పరిశ్రమ ఈ మధ్య రీమిక్స్‌ల వైపు దృష్టి పెట్టింది. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన పాటలను ఈ తరం హీరో హీరోయిన్ల పై పిక్చరైజ్‌ చేసి సినిమాకు కొత్త హంగు తీసుకురావడానికి, ఆ తరం ప్రేక్షకులతో కనెక్ట్‌ చేయడానికి ఈ రీమిక్స్‌లను దర్శక నిర్మాతలు ఉపయోగించుకుంటున్నారు. ‘తేజాబ్‌’లో ‘ఏక్‌ దో తీన్‌’ పాట ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఈ పాట దేశంలోని అన్ని మూలలకు పాకిపోయి మాధురి దీక్షిత్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. ఈ పాటను టైజర్‌ ష్రాఫ్‌ నటించిన ‘భాగీ 2’ కోసం రీమిక్స్‌ చేశారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ పాటకు స్టెప్పులేసింది. అయితే మాధురి మాధురే అని ప్రేక్షకులు కొంచెం నిరాశ చెందారు. 

దిల్‌ బర్‌ దిల్‌ బర్‌...
‘సిర్ఫ్‌ తుమ్‌’ సినిమాలో సుష్మితా సేన్, సంజయ్‌ కపూర్‌ పాడుకున్న ‘దిల్‌బర్‌ దిల్‌బర్‌...’ తొంభైల్లో చాలా క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ను జాన్‌ అబ్రహామ్‌ నటించిన ‘సత్యమేవ జయతే’ కోసం రీమిక్స్‌ చేశారు. నోరా ఫతేహి బెల్లీ డ్యాన్స్‌ జోడించి స్క్రీన్‌ని హాట్‌గా మార్చారు. ఒరిజినల్‌ పాటకు కొన్ని కొత్త వాక్యాలు జోడించి నేహా కక్కర్, ధ్వనీ బనుసలీ ఈ కొత్త వెర్షన్‌ను పాడారు. ఒరిజినల్‌ సాంగ్‌ లాగే ఈ సాంగ్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ కొత్త పాట యుట్యూబ్‌ టాప్‌ లేపేసింది అని చెప్పొచ్చు. 

హెలెన్‌ని తలచెన్‌
‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయే’  సినిమా కథ అంతా చైనాలో జరగడంతో అందులో 1950నాటి ‘హౌరాబ్రిడ్జ్‌’ పాట ‘మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చు’ను రీమిక్స్‌ చేశారు. ఈ పాట  చైనీస్‌ స్టైల్‌లో ఉండటమే దీనికి కారణం. అప్పట్లో హెలెన్‌ వేసిన స్టెప్పులను ఇందులో సోనాక్షీ సిన్హాతో వేయించారు. ఈ పాటకు కాలు కదపడమే కాకుండా  జెస్సీ గిల్‌తో కలసి గొంతు కూడా పలిపారు సోనాక్షీ.  పాత పాటంత ప్రశంసలు రాకపోయినా ఫర్వాలేదనిపించుకుంది. 1978లో ‘ఇన్‌కార్‌’ సినిమాలో హెలెన్‌ చేసిన ‘ఓ ముంగడా..’ పాట కూడా చాలా హిట్‌. దానిని  ‘ధమాల్‌’ సిరీస్‌లో వస్తున్న మూడో భాగం ‘టోటల్‌ ధమాల్‌’లో రీమిక్స్‌ చేశారు. ఈ సాంగ్‌ను అజయ్‌ దేవగణ్, సోనాక్షి మీద చిత్రీకరించారు. 

రుక్‌ రుక్‌ రుక్‌ 
‘రుక్‌ రుక్‌ రుక్‌.. అరె బాబా రుక్‌..’ పాట ‘విజయ్‌పథ్‌’ సినిమాలో పెద్ద హిట్‌. దేవగన్‌ వెంటపడతూ టబు పాడే ఈ పాటను తాజాగా కాజోల్‌ యాక్ట్‌ చేసిన ‘హెలీకాఫ్టర్‌ ఈల’ అనే సినిమా కోసం రీమిక్స్‌ చేశారు.  భర్త అజయ్‌ దేవగన్‌ పాట రీమిక్స్‌లో కాజోల్‌ చేయడం ఒక విశేషం.  ఈ పాత ట్యూన్‌కి తనదైన స్టైల్‌లో స్టెప్స్‌ వేశారట కాజోల్‌. ‘1942: ఎ లవ్‌ స్టోరీ’లోని ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో ఏశా లగా..’ సాంగ్‌ కూడా రీమిక్స్‌ కానుంది.సౌత్‌ అయినా నార్త్‌ అయినా పాట కోసం తిప్పలు పడితేనే సినిమా హిట్‌ అవుతుందనే ట్రెండ్‌ ఉంది. కాకపోతే ఒకసారి తెర మీద చూసిన పాట ఒక ముద్ర వేస్తుంది. రీమిక్స్‌ దానికి మించిందిగా ఉంటే పాస్‌ అవుతుంది. లేకపోతే పాత పాటతో పోల్చి పెదవి విరుస్తారు ప్రేక్షకులు. కాని పాత పాటను కొత్తగా కనెక్ట్‌ చేశారో కాసులు రాలుతాయి. ప్రస్తుతం పాత పాటలను విసిరి కొత్త కాసులను ఏరుకునే ప్రయత్నంలో ఉన్నారు సినీబేహారులు... వెండితెర మాయావీలు. వాళ్లకు జయం సిద్ధించాలని కోరుకుందాం.
– ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement