కట్‌ చేస్తే ఫారిన్‌ | Special story to telugu movies Foreign schedule | Sakshi
Sakshi News home page

కట్‌ చేస్తే ఫారిన్‌

Published Tue, Sep 18 2018 12:08 AM | Last Updated on Tue, Sep 18 2018 12:08 AM

Special story to telugu movies Foreign schedule - Sakshi

ఎక్కువలో ఎక్కువ  ఏడు క£ý లుంటాయి.అటు తిప్పి ఇటు తిప్పి రాసినా..ఇటు తిప్పి అటు తిప్పి రాసినా మూలం సప్తగాధలే.మరి కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్‌.సప్త సముద్రాలు దాటాలి.ఇక్కడ ప్రేమించుకున్నఅబ్బాయి అమ్మాయి సడన్‌గా న్యూజిల్యాండ్‌లో గంతులేస్తారు.ఇక్కడ చాలెంజ్‌ చేసిన విలన్‌ని హీరో అక్కడెక్కడో అబుదాబీలో తంతూ ఉంటాడు.ఇక్కడ కార్‌ చేజ్‌ మొదలైతే 
బ్యాంకాక్‌లో ఎండ్‌ అవుతుంది.కథకు కొత్తదనం కథనం అంటారు. ప్రొడ్యూసర్లు కదలండి అంటారు.

మన సినిమా వాళ్లు చాలా కాలం పాటలకు ఊటీ వెళ్లారు. బోర్‌ కొట్టింది. కాశ్మీర్‌ వెళ్లారు. బోర్‌ కొట్టింది. రాజస్తాన్‌ ఎడారిలో ఒంటెలను పరిగెత్తిస్తూ వెనుక గ్రూప్‌ డాన్సర్ల మధ్య ‘ఓ ప్రియా ప్రియా’ అనిపించారు.అందరూ ఫాలో అయ్యాక అదీ బోర్‌ కొట్టింది. అవే పాటలు. లొకేషన్‌తోనే అందం అని బాలీవుడ్‌లో యష్‌ చోప్రా ‘సిల్‌సిలా’ వంటి సినిమాలతో అలవాటు చేశాడు. మనవాళ్లు ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లలేకపోవచ్చు. కనీసం మారిషస్‌ వెళ్దాం అనుకున్నారు. వెళ్లారు. కొన్నాళ్లకు అదీ బోర్‌ కొట్టింది. సినిమా బోర్‌ కొట్టకుండా ఉండాలంటే లొకేషన్‌ బోర్‌ కొట్టకుండా ఉండాలనేది పాత ఫార్ములాయే అయినా ఇప్పుడది ఎక్కువగా వాడుకలో ఉంది. ‘అందమైన అనుభవం’ సినిమాలో కె.బాలచందర్‌ సింగపూర్‌ను చూపిస్తే కొత్తగా చూశారు. ‘పడమటి సంధ్యా రాగం’లో జంధ్యాల అమెరికా చూపిస్తే ఫ్రెష్‌గా ఫీలయ్యారు. నిన్నగాక మొన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘కంచె’, ‘ఫిదా’, ‘లై’, ‘చల్‌ మోహనరంగా’ వంటి సినిమాలన్నీ ఫారిన్‌ లొకేషన్ల వల్లే మరింత బ్రైట్‌గా కనిపించాయని చెప్పుకోవచ్చు. ఈ వరుసలో ఇప్పుడు కొన్ని షూటింగ్‌లు ఫారిన్‌ లొకేషన్లలో జరుగుతున్నాయి. కొన్ని జరగబోతున్నాయి.

వీసా అంత వీజీ కాదు
సినిమాలకు ఫారిన్‌ షెడ్యూల్‌ ఆషామాషీ కాదు. చాలా తతంగం ఉంటుంది. ముందు సినిమాకి కావాల్సిన సీన్స్‌కు అనుగుణంగా లొకేషన్స్‌ సెర్చ్‌ చేసుకోవాలి. ఎంత బడ్జెట్‌లో పూర్తి చేయాలో అంచనా ఉండాలి. సినిమాలోని ముఖ్య తారల కాంబినేషన్‌ డేట్స్‌ కుదరాలి. వాళ్లకు వీసా ప్రాబ్లమ్స్‌ లేకుండా చూసుకోవాలి. అక్కడ లోకల్‌ ఆర్టిస్టుల సదుపాయం ఉందో లేదో వాకబు చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎల్తైతే అక్కడి ప్రభుత్వ పర్మిషన్‌లు దొరకడం మరో ఎత్తు. ఒక్కో దేశం చట్టం ఒక్కోలా ఉంటుంది. తెలియక ఎక్కడపడితే అక్కడ కెమెరా పెడితే చిక్కులొస్తాయి. ఇన్ని వ్యవహారాలు తెముల్చుకుని అంతమంది కలిసి అంతదూరం వెళితే వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. లేకుంటే పెట్టిన డబ్బు వృథా అవడమే కాకుండా ఖాళీ రీలుతో తిరిగి రావాలి. అయినప్పటికీ ప్రేక్షకులను రంజింప చేయడం కోసం నిర్మాత, దర్శకులు రిస్క్‌ తీసుకుంటూ ఉంటారు. హిట్‌ చేయడానికి ఎంత దూరమైనా వెళుతుంటారు. ప్రస్తుతం ఎవరు వెళుతున్నారో చూద్దాం. 

జార్జియాకు సైరా
‘సైరా నాన్నగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఖర్చుకు వెనకాడేది లేదు’ అని ఇటీవల ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫారిన్‌ షెడ్యూల్‌ను జార్జియాలో ప్లాన్‌ చేశారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో సాగే ఈ షెడ్యూల్‌లో వార్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ప్రస్తుతం యూనిట్‌ జార్జియాకు చేరుకుంది. అయితే చిరంజీవి వెంటనే ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అవ్వరట. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ గ్రేగ్‌ పావెల్‌ ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, విజయ్‌సేతుపతి, తమన్నా, సుదీప్‌ ముఖ్యపాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

అమెరికాకు మహర్షి
మహేష్‌బాబు అన్న రమేష్‌బాబు హీరోగా వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ షూటింగ్‌ అంతా అమెరికాలో జరిగింది. ఇప్పుడు మహేష్‌ షూటింగ్‌ కూడా అమెరికాలో జరగనుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ సినిమా కోసం దాదాపు 25 రోజుల  షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చేశారు. వచ్చే నెల ఫస్ట్‌ వీక్‌లో ఈ టీమ్‌ ఫ్లైట్‌ఎక్కి అమెరికాలో వాలిపోతారు. ఈ షెడ్యూల్‌లో పాటలను తీస్తారట. అందుకోసం లొకేషన్‌ సెర్చింగ్‌ను దర్శకుడు వంశీ ౖపైడిపల్లి ఎప్పుడో పూర్తి చేశారని టాక్‌. 

యూరప్‌లో ప్రభాస్‌
‘సాహో’ సినిమా కోసం ప్రభాస్‌ అబుదాబిలో ఫైట్స్‌ చేసిన సంగతి తెలుసు. ఈ సినిమా షెడ్యూల్‌  హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే రీసెంట్‌గా ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు  యూరప్‌లోనే. ముఖ్యంగా ఇటలీలో ఎక్కువ రోజులు ప్లాన్‌ చేశారు. 

ఆన్‌ లొకేషన్‌
ఇటీవల రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సూట్‌కేస్‌తో వెళుతున్న ఫొటో పెట్టి ‘లాంగ్‌ జర్నీ’ అని పెట్టారు. కారణం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా కోసం అజర్‌ బైజాన్‌కు బయల్దేరాల్సి రావడమే. ప్రస్తుతం అక్కడ షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. విలన్‌ పాత్ర చేస్తున్న వివేక్‌ ఒబెరాయ్‌ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యారు. ప్రశాంత్, ఆర్యన్‌ రాజేశ్, స్నేహ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. 


కొరియాలో శర్వానంద్‌
కొరియాలో ఏదో స్కెచ్‌ వేశాడు గ్యాంగ్‌స్టర్‌. ఆ స్కెచ్‌ సక్సెస్‌ అవ్వడానికి అక్కడే 25 రోజులు మకాం వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ రీల్‌ గ్యాంగ్‌స్టర్‌ ఎవరో కాదు శర్వానందే. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా  తెరకెక్కుతోన్న  సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ కోసం కొరియా వెళ్లనుంది చిత్రబృందం. యాక్షన్‌ సన్నివేశాలను అక్కడ ప్లాన్‌ చేశారట. ఇందులో శర్వానంద్‌ది డ్యూయెల్‌ రోల్‌. 

ట్రిప్‌ కేన్సిల్‌
‘అరవింద సమేత వీరరాఘవ’ పాటల కోసం ఫారిన్‌లో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. కానీ ఈ సినిమా హీరో ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ హఠాన్మరణం వల్ల, మరోవైపు రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటం వల్ల ఆ ట్రిప్‌ కేన్సిల్‌ అయ్యింది.  ఫారిన్‌ షెడ్యూల్‌ను వద్దను కున్నారట టీమ్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయిక. 
ఈ సినిమాల షూటింగ్‌లన్నీ ఏ అంతరాయాలు లేకుండా జరగాలనీ యూనిట్‌లన్నీ క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రావాలని కోరుకుందాం.

వెళ్లొచ్చారు... 
షూటింగ్‌ కోసం ఫారిన్‌ లొకేషన్‌కు వెళ్తున్న వారి నంబర్‌తో పాటు వెళ్లొచ్చినవారి నంబర్‌ కూడా ఘనంగా ఉంది.  రెండు రోజుల క్రితమే ప్రాగ్‌లో ‘ఎఫ్‌ 2’ కోసం షూటింగ్‌ ముగించుకుని వచ్చారు వెంకటేష్, వరుణ్‌ తేజ్‌. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. మొన్నా మధ్యే ‘దేవదాస్‌’ కోసం బ్యాంకాక్‌ వెళ్లొచ్చారు నాగార్జున, నాని. ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. అలాగే హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ కోసం నాగార్జున బల్గేరియా చూసొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక రవితేజ ఆగస్టు నెల అంతా  ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ సినిమా కోసం అమెరికాలో ఉండొచ్చారు. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ 40 రోజులు అమెరికాలోనే జరిగింది. అలాగే హీరో అఖిల్‌ కూడా తన తాజా చిత్రం కోసం 50 రోజులు యూకేలో గడిపారు. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి ఈ సినిమాకు డైరెక్టర్‌. ఈ సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.  
– ఇన్‌పుట్స్‌: శివాంజనేయులు ముసిమి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement