గ్రాండ్‌ షో మేన్‌ | special story to ranbeer kapur | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ షో మేన్‌

Published Thu, Dec 15 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

గ్రాండ్‌ షో మేన్‌

గ్రాండ్‌ షో మేన్‌

రాజ్‌కపూర్‌ మరణించినప్పుడు రణ్‌బీర్‌కు ఆరు సంవత్సరాలు. తాతగారి గొప్పతనం విని పులకించిపోతుంటాడు.
  నేను ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలిసినప్పుడే నన్ను నేను స్టార్‌ అనుకుంటాను... అంటాడు రణ్‌బీర్‌.
దీపికా పదుకొనె, రణ్‌బీర్‌... కెరీర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్‌. దీపికా అతడిని బాగా ఇష్టపడింది. ‘ఇతర ప్రలోభాల వల్ల ఆమె స్నేహాన్ని వదలుకున్నాను’ అని రణ్‌బీర్‌ చెప్పాడు.
కత్రీనా కైఫ్‌తో రణ్‌బీర్‌ స్నేహం నడిచింది. కాని ఆ ముక్కు ఒక్క తుమ్ముకే ఊడిపోయింది.

రణ్‌బీర్‌ కపూర్‌ టాప్‌ 10 సినిమాలు
1.     ఏ దిల్‌ హై ముష్కిల్‌
2.     బర్ఫీ
3.     రాక్‌స్టార్‌
4.     వేకప్‌ సిద్‌
5.     రాజ్‌నీతి
6.     ఏ జవానీ హై దివానీ
7.     అన్‌జానీ అన్‌జానా
8.     అజబ్‌ ప్రేమ్‌కీ గజబ్‌ కహానీ
9.     సావరియా
10.    బే షరమ్‌

రాజ్‌ కపూర్‌కు షో మేన్‌ అనే బిరుదు ఉంది.
ఆయన గ్రాండ్‌ సన్‌ని ‘గ్రాండ్‌ షో మేన్‌’ అనక తప్పదు.
ఏ సినిమాలో నటించినా దృష్టి తన మీద పడేలా చేసుకునే నటుడు రణ్‌బీర్‌.
తాతకు దగ్గులు నేర్పించే స్థాయిలో ‘బర్ఫీ’, ‘రాక్‌స్టార్‌’,
‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ వంటి సినిమాలలో నటించాడు.
తండ్రి రిషి కపూర్, తల్లి నీతూ సింగ్‌ల కంటే కచ్చితంగా మెరుగైన నటుడు.
ఇటీవల ఫ్లాపుల తర్వాత ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’తో లేచి నిలబడిన మొనగాడు రణ్‌బీర్‌ కపూర్‌.

సినిమా వాళ్ల జీవితం పైకి కనిపించేటటువంటిది కాదు. ముళ్లుంటాయి – అని అంటూ ఉంటారు. రణ్‌బీర్‌ కపూర్‌ దారిలో కూడా ముళ్లున్నాయి. కాకపోతే ఆ ముళ్ల పేర్లు– రిషి కపూర్, నీతూ సింగ్‌.

రణ్‌బీర్‌ కపూర్‌ బంగ్లాలో అతడికి ఇష్టమైన భాగం ఏదైనా ఉందంటే అది మెట్ల వరుసే. చాలాసార్లు రణ్‌బీర్‌ తన బాల్యంలో ఆ మెట్ల మీద కూచుని ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకూ ఆ మెట్ల మీదే ఉండిపోయేవాడు. కారణం– లోపల తల్లిదండ్రుల తగాదా నడుస్తూ ఉండేది. వస్తువులు పగులుతూ ఉండేవి. అరుపులు వినిపిస్తూ ఉండేవి. చివరికి వాళ్లు రాజీ పడేవారు. ఈ లోపు రణ్‌బీర్‌ కపూర్‌ నిముషాలు లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు.

సెలబ్రిటీల మధ్య పొరపొచ్చాలు సహజం. ఇక వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయినప్పుడు మరీ సహజం. రిషీ బిజీ స్టార్‌. నీతు పెళ్లయ్యాక కుటుంబానికి కట్టుబడింది. అతడు బయటా ఆమె ఇంట్లో... తెలియని అభద్రత... దూరం ఇవి సమస్యకు కారణాలు.
ఆ కొట్లాటలు రణ్‌బీర్‌ మీద వయసులో అతడి కంటే రెండేళ్లు పెద్దదయిన అతడి సోదరి రిద్ధిమా మీద ప్రభావం చూపాయి. ‘తర్వాత తర్వాత ఆ గొడవలు ఎంత పెద్ద ఎమోషన్‌ని అయినా లోపలికి తీసుకునే స్థాయికి నా మానసిక లోతులను పెంచాయి’ అని రణ్‌బీర్‌ చెప్పుకున్నాడు. రణ్‌బీర్‌ రానురాను ఇంట్రావర్ట్‌గా మారిపోయాడు. తల్లితోనే అనుబంధం పెంచుకున్నాడు. తండ్రితో దాదాపు దూరమే. ఆ తర్వాత చాలా రోజులకు తండ్రితో కలిసి పని చేసేటప్పుడే తండ్రి హృదయం కూడా మంచిదే అని గ్రహించాడు.

చదువు రాదు. తల్లిదండ్రులు ముంబైలో ప్రసిద్ధ స్కూల్‌ – బాంబే స్కాటిష్‌ స్కూల్‌లో చేర్పిస్తే చివరి నుంచి మూడో ర్యాంకులో ఉండేవాడు. అల్లరి ఎక్కువ. ఒకసారి ప్రిన్సిపాల్‌ అతడి జుట్టు పట్టుకుని వరండాలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొట్టుకుంటూ వెళ్లాడు. అయినా దారికి రాలేదు. ఆ రోజుల్లో కరాటేలో చేరి పెద్దయ్యాక కరాటే ఇన్స్‌ట్రక్టర్‌ కావాలని అనుకున్నాడు. కాని ఆ తర్వాత తెలిసింది– సినిమాల్లో పని చేయడానికి చదువు పెద్దగా అక్కర్లేదని. చదువు అక్కర్లేదా? ఇంతకు మించిన మంచి మాట లేదని 7–8 తరగతులు చదువుతుండగా  తాను కాబోయే సినిమా హీరో అని నిశ్చయించుకున్నాడు. అయితే పది గండం దాటాలి కదా. పరీక్షలు రాశాడు. చివరకు రిజల్ట్స్‌ వచ్చాయి. అతడి కష్టం మీద 53.4 పర్సెంటేజీ మార్కులు వచ్చాయి. ఆ సమయంలో రణ్‌బీర్‌ తన తండ్రి రిషితో కలిసి న్యూయార్క్‌లో ఉన్నాడు. మార్కులు తెలుసుకున్న నీతూ సింగ్‌ అమెరికాకు ఫోన్‌ చేసి ఒకటే ఏడవడం– నా బంగారు తండ్రి పాసయ్యాడు... పదో తరగతి పాస్‌ అయ్యాడు... అని. న్యూయార్క్‌లో తండ్రి పెద్ద పార్టీ ఇచ్చాడు. కపూర్‌ ఫ్యామిలీలో పదో క్లాసు ఇబ్బంది పడకుండా పాసైన మొదటి కుర్రాడు మరి రణ్‌బీర్‌.

పెద్దింటి కుటుంబాలు తమ పిల్లలను అమెరికాలోని బిజినెస్‌ స్కూళ్లలో చదివించడం ఫ్యాషన్‌. రిషి కపూర్, నీతూ సింగ్‌ కూడా రణ్‌బీర్‌ దగ్గర అలాంటి ప్రతిపాదన తెస్తే నేనెలాగూ యాక్టర్‌ని కావాలనుకుంటున్నాను కదా మధ్యలో ఈ డూప్లికేట్‌ చదువు ఎందుకు నేరుగా యాక్టింగ్‌కు సంబంధించిన చదువే చదువుతాను అని న్యూయార్క్‌ మెథడ్‌ యాక్టింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు చదువుకున్నాడు. కాని ఒంటరితనం... బోరింగ్‌ క్లాసులు... ఈ గొడవ ఎందుకు చలో ఇండియా అనుకొని వచ్చేశాడు.

అప్పట్లో సంజయ్‌లీలా బన్సాలీ ఉమ్ము కూడా పెట్రోల్‌లా మండుతోంది. బన్సాలీ హీరోగా లాంచ్‌ చేస్తే ఆ హీరోకి తిరుగుండదు. రణ్‌బీర్‌ కూడా సంజయ్‌ తనను హీరోగా లాంచ్‌ చేయాలని కోరుకున్నాడు. అతణ్ణి ఇంప్రెస్‌ చేయడానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు. అప్పుడు బన్సాలీ ‘బ్లాక్‌’ సినిమా తీస్తున్నాడు. ఒకసారి టీమ్‌లో చేరాక ఎవరి కొడుకైనా ఒకటే. రణ్‌బీర్‌ కపూర్‌కి సెట్లో ఇతరులకు ఎదురయ్యే అన్ని రకాల అవమానాలు ఎదురయ్యాయి. మరుసటి రోజు ఉదయం షూటింగ్‌ అంటే ఈ ముందు రోజు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు లైట్లు బిగించడం సెట్‌లో సహాయకుడిగా పని చేయడం.. ఫ్లోర్లు తుడవడం... అంతా చాకిరి. అదంతా చేశాడు. చివరకు బన్సాలీ కరుణించాడు. సినిమా దొరికింది. భారీ సినిమాయే దొరికింది. రిషికపూర్‌ నీతూ సింగ్‌ల కుమారుడు రణ్‌బీర్‌ కపూర్‌– అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్‌ కపూర్‌లు జంటగా బన్సాలీ సినిమా అనౌన్స్‌ చేశాడు. పేరు– సావరియా.

‘సావరియా’ ఫ్లాప్‌ అయ్యింది. భయంకరంగా ఫ్లాప్‌. రణ్‌బీర్‌ కపూర్‌ అందులో టవల్‌ కట్టుకుని పాట పాడితే దానిని చూసి అందరూ ఆటపట్టించారు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. కొందరు మాత్రం రణ్‌బీర్‌ యాక్టింగ్‌ బాగుందని అన్నారు. వచ్చిన ప్రచారం ఎంతో కొంత వచ్చింది దీనిని వాడుకుందాం అని భావించిన యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వెంటనే రణ్‌బీర్‌తో ‘బచ్‌ నా ఏ హసీనో’ సినిమాను ప్రకటించింది. ‘బచ్‌ నా ఏ హసీనో’ మకుటంతో మొదలయ్యే ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ పాట రిషి కపూర్‌ జీవితాన్ని వెలిగించింది కనుక ఆ పేరుతో వచ్చే సినిమా రణ్‌బీర్‌ను ఫీల్డ్‌లో స్థిరపరుస్తుందని భావించారు. అంచనా తప్పలేదు. ఆ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ అయ్యింది. 2009 వచ్చేసరికి రణ్‌బీర్‌ అకౌంట్లో మూడు సినిమాలు పడ్డాయి. 1. వేకప్‌ సిద్, 2. అజబ్‌ ప్రేమ్‌కీ గజబ్‌ కహానీ 3. రాకెట్‌ సింగ్‌. మూడూ బాక్సాఫిస్‌ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి. మూడింటికీ కలిపి రణ్‌బీర్‌ ఫిల్మ్‌ఫేర్‌ నుంచి క్రిటిక్స్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే రణ్‌బీర్‌లోని నటుడి సత్తాను చాటిన రెండు సినిమాలు మాత్రం ఆ తర్వాత వచ్చాయి. అవి ‘రాక్‌స్టార్‌’, ‘బర్ఫీ’. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో వచ్చిన ’రాక్‌స్టార్‌’ గాఢమైన అనుభూతులను ప్రదర్శించగల శక్తిని వెలికి తెచ్చింది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో వచ్చిన ‘బర్ఫీ’ మూగ చెవిటి పాత్రను ఇచ్చి కేవలం హావభావాలతో ఒక పెద్ద సినిమాను భుజం పై మోయగల సత్తా రణ్‌బీర్‌కు ఉందని నిరూపించింది. ఆ తర్వాత అతడికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఇచ్చిన సినిమా – ‘ఏ జవానీ హై దివానీ’.

ఫ్లాపులు రావడం చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి. పైగా బాగా ఆడుతాయనుకున్న సినిమాలు పోతే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. బే షరమ్‌ (2013), రాయ్‌ (2015), బాంబే వెల్వెట్‌ (2015) రణ్‌బీర్‌ కపూర్‌ని దాదాపు చావు దెబ్బ తీశాయి. మూడు పెద్ద ఫ్లాపులు. మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ దీపికా పదుకొనెతో యాక్ట్‌ చేసిన సినిమా ‘తమాషా’ (2015) కూడా సోసోగా వెళ్లింది. ఒక హీరోకు ఇన్ని ఫ్లాపులు కష్టమే. అప్పటికే రణ్‌బీర్‌ భారతదేశంలో భారీ పారితోషికం డిమాండ్‌ చేసే నటుడి స్థాయిలో నిలబడి ఉన్నాడు. గ్రాఫ్‌ పడటానికి లేదు. మరేం చేయాలి. జవాబు కనిపించింది. అది– కరణ్‌ జొహర్‌.

టాలెంట్‌ ఉన్న నటుడికి టాలెంట్‌తో పాటు పోరాటం చేయగల నటుడికి సరైన అవకాశం ఇస్తే నిలబడతాడు అనటానికి మొన్న వచ్చిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా ఒక ఉదాహరణ. కరణ్‌ జొహర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేక వొడిదుడుకులను దాటుకుని (పాకిస్తాన్‌ నటీనటులు ఉన్నారని గొడవైంది) విడుదలయ్యి విజయం సాధించింది. భారీ విజయమే సాధించింది. శుద్ధమైన ప్రేమను కనుగొనే ప్రయాణం చేసిన ఒక ప్రేమికుడి కథ అయిన ఈ సినిమాలో రణ్‌బీర్, అనుష్కల నటనతో పాటు పాటలు కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. అయిపోయిందనుకున్న రణ్‌బీర్‌ మళ్లీ తన ట్రాక్‌లో సగర్వంగా నిలబడ్డాడు.

రణ్‌బీర్‌ నటుడుగా తన తోటి నటులైన షాహిద్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి వారితో పోటీ పడటం ఎలాగూ ఉంటుంది... కాని కపూర్‌ల వారసుడిగా వారి కంటే ముందు ఉండాల్సిన బరువు కూడా ఉంటుంది. ఆ సంగతి రణ్‌బీర్‌కు తెలుసు.
అందుకే అతడు మరింత కష్టపడుతుంటాడు. తనను తాను నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంటాడు.
ఏ కష్టమైనా ముష్కిల్‌గానే ఉంటుంది.
కాని హిట్‌ సినిమా కోసం ఆ ముష్కిల్‌కు ఎస్‌ అంటుంటాడు రణ్‌బీర్‌.

రణ్‌బీర్‌ కపూర్‌ టాప్‌ 10 పాటలు
1.     జబ్‌ సే తేరే నైనా – సావరియా
2.     బచ్‌ నా ఏ హసీనో – బచ్‌ నా ఏ హసీనో
3.     గూంజ్‌సా హై కోయి ఇక్‌తారా – వేకప్‌ సిద్‌
4.     ఎత్తిసీ హసీ ఎత్తిసీ ఖుషీ – బర్ఫీ
5.     తూ జానే నా – అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ
6.     జో భి మై – రాక్‌స్టార్‌
7.     బద్‌ తమీజ్‌ దిల్‌ – ఏ జవానీ హై దివానీ
8.     తూ హై కి నహీ – రాయ్‌
9.     తూ సఫర్‌ మేరా – ఏ దిల్‌ హై ముష్కిల్‌
10.     మేరి రూహ్‌కా పరిందా   (బులయా)– ఏ దిల్‌ హై ముష్కిల్‌
– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement