
8 నిమిషాల సీన్ : 20 కోట్ల ఖర్చు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు. ముందుగా 90 కోట్లతోనే సినిమా పూర్తి చేయాలని భావించినా ఇప్పుడు బడ్జెట్ 120 కోట్లు మించిపోయిందన్నా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మురుగదాస్ చిత్రాల్లో సినిమాకే హైలెట్ అనిపించే సీన్ ఒకటి తప్పకుండా ఉంటుంది. తుపాకీలో 12 మంది టెర్రరిస్ట్ లను ఒకేసారి చంపే సీన్, కత్తి సినిమాలో ముసలివాళ్లతో కలిసి సిటీకి వాటర్ సప్లయ్ ని అడ్డుకునే సీన్స్ హైలెట్ అయ్యాయి. తాజాగా స్పైడర్ సినిమాలోనూ ఆ తరహా సీన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట.
దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఈ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. విలన్ అమాయక ప్రజలను చంపేందుకు చేసే ప్రయత్నాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడన్నదే సీన్. పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్ లతో పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ సీన్, ఆడియన్స్ కన్నార్పకుండా చూసేలా ఉంటుందట. మరి ఈ వార్తపై అయినా చిత్రయూనిట్ అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి.