
విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా మారి మొత్తంగా వంద సినిమాలు పూర్తి చేశారు శ్రీకాంత్. తాజాగా వచ్చిన ‘యుద్ధం శరణం’ సినిమాలో మళ్లీ విలన్ పాత్రలో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆయన మరో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభయ్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ జై రాజాసింగ్ దర్శకత్వంలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రం రూపొందించనుంది. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘కథ వినగానే నచ్చి, వెంటనే ఒప్పుకున్నా. ఇలాంటి మంచి కథలో కీ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. జై రాజాసింగ్ కొత్త దర్శకుడైనా భిన్నమైన కథను ప్రతిభావంతంగా రాసుకున్నారు’’ అన్నారు. ‘‘ఎప్పుడూ మంచి పాత్రలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని శ్రీకాంత్‌గారు ఆరాటపడుతుంటారు. ఆయనలో గొప్ప నటుడున్నారు. కథ రాసుకుంటున్నప్పుడే ఈ పాత్ర ఆయనే చేయాలని అనుకున్నా. ఇప్పటివరకూ చూడని కొత్త తరహాలో ఆయన పాత్ర ఉంటుంది’’ అన్నారు జై రాజా సింగ్.