వివాదంలో శ్రీకాంత్ 'మెంటల్'
ఈ శుక్రవారం విడుదలైన శ్రీకాంత్ మూవీ మెంటల్పై మరో వివాదం మొదలైంది, గతంలో టైటిల్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అభ్యంతరం తెలపటంతో మెంటల్ పోలీస్‌గా ఉన్న పేరును మెంటల్‌గా మార్చారు. తాజాగా ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా వేరే వారి పేరు వేశారంటూ కరణం పి బాబ్జీ అనే వ్యక్తి గొడవకు దిగాడు.
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల మూలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫస్ట్ లుక్ టీజర్లు రిలీజ్ అయిన సమయంలో చిత్ర దర్శకుడిగా కరణం పి బాబ్జీ పేరు కనిపించినా.. విడుదలకు దగ్గరయిన తరువాత మాత్రం ఎస్ కె బషీద్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. టైటిల్స్ లోనూ బషీద్ పేరుతోనే సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ విషయంపై స్పందించిన కరణం బాబ్జీ, మెంటల్ సినిమాకు తానే దర్శకుడినని, తన పేరు తీసేసి బషీద్ పేరు వేశారని ఆరోపించారు. ఈ సినిమాకు 5.17 లక్షల పెట్టుబడి కూడా పెట్టానని, దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా కోసం పనిచేశానని తెలిపాడు. టైటిల్ విషయంలో హీరో శ్రీకాంత్‌కు ఫోన్ చేస్తే అరగంటలో మార్పిస్తానని చెప్పి ఇంత వరకు మార్పించలేదని ఆరోపించారు.
రేపటిలోగా పేరు మార్చకపోతే ఛాంబర్ ముందు దీక్ష చేస్తానని, అప్పటికీ స్పందించకపోతే బషీద్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాన్నారు. ఈ విషయంపై స్పందించిన నిర్మాత మండలి పేరు మార్చే అధికారం నిర్మాతకు మాత్రమే ఉంటుందని, నిర్మాత ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.