‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి వైవిధ్యమైన కథలతో కథానాయకుడిగా రెండు విజయాలు అందుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘జంబలకిడి పంబ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం. మార్చి 10 వరకు నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిది ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. వెన్నెలకిశోర్ పాత్ర కూడా హైలైట్ గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘జంబలకిడి పంబ’ ఎంత సూపర్‌హిట్ టైటిలో అందరికీ తెలిసిందే. మా చిత్ర కథకు కూడా చక్కగా సరిపోయే టైటిల్ అది. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఒక వైపు వినోదాన్ని పండిస్తూనే, మరో వైపు భావోద్వేగాలు ఉండే పాత్రలో ఆయన కనిపిస్తారు. శ్రీనివాసరెడ్డి కెరీర్‌లో మరో కీలక చిత్రమవుతుంది’ అని అన్నారు.
ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment