నేను భయపడే టైప్ కాదు!
‘‘నేను ఎలాంటి చిత్రం చేసినా... ప్రేక్షకులు నా నుంచి ఆశించే వినోదం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయను. అలాగే, ఇక నుంచి ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేకుండా... పూర్తి భిన్నమైన కొత్త తరహా చిత్రాలు చేయాలనే ఆలోచనతో ఉన్నా’’ అన్నారు శ్రీను వైట్ల. వరుణ్‌తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ నెల 14న రిలీజవుతోంది.
శ్రీను వైట్ల మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు వరుణ్‌ను చూసి ‘బాగున్నాడీ అబ్బాయి’ అంటే... నాగబాబు అన్నయ్య ‘నువ్వు సినిమా తీయొచ్చుగా’ అనేవారు. తప్పకుండా అనేవాణ్ణి. ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కిన ట్రావెల్ ఫిల్మ్, ఈ ‘మిస్టర్’తో కుదిరింది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్... అన్నిటిలో వరుణ్‌ని బాగా చూపించే ప్రయత్నం చేశా. నిర్మాతలు బుజ్జి, మధుగార్లు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టీమ్ సపోర్ట్‌తో అనుకున్నది తీశాననే సంతృప్తి ఉంది. మంచి సినిమా తీసి ఫెయిల్ అయితే బాధ ఉంటుంది.
నేను అనుకున్నట్టు చేయలేని పరిస్థితులు ‘బ్రూస్ లీ’కి వచ్చాయి. మంచి సినిమా తీయలేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారని గట్టిగా నమ్మాను. ఆ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్వించలేకపోయా. ‘మిస్టర్’తో నవ్విస్తా. సక్సెస్ కోసం ఈ సినిమా తీయలేదు. ప్రేక్షకులపై ప్రేమతో తీశా. నేను ఫెయిల్యూర్స్‌కి భయపడే టైప్ కాదు. నా కెరీర్ చూస్తే... ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నేను మరింత స్ట్రాంగ్‌గా పనిచేస్తా. ‘మిస్టర్’కు అలాగే పనిచేశా. కథను చెడగొట్టకుండా అందులో కామెడీ చేయడం చాలా కష్టం. కానీ, నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. అందుకే, నేను ఎక్కువ స్ట్రగుల్ అవుతా’’ అన్నారు.