భారత్ను తక్కువ చేసి చూడవద్దు: అమితాబ్
ముంబై: కబడ్డీ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం అర్జెంటీనాపై ఘనవిజయం సాధించిన భారత జట్టును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. అర్జెంటీనాపై భారత్ 74-20 పాయింట్ల తేడాతో నెగ్గింది. అలాగే వరుసగా మూడో విజయాన్ని అందుకున్న భారత్ దాదాపుగా సెమీఫైనల్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. మన ఆటగాళ్లు సాధించిన విజయాన్ని దేశమంతా గర్వకారణంగా భావించాలని తన పోస్ట్ లో కొనియాడారు. ఆటలపై నెగటివ్ ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని, అదే విధంగా భిన్న రకాల ఆటల మధ్య పోలిక పెట్టడం సరికాదని సూచించారు. భారతీయులం అయినందుకు ఇలాంటి విజయాలపై మనం ఎంతో గర్వంగా ఫీలవ్వాలి కానీ ఇతర గేమ్స్ తో పోలిక పెట్టడం మానుకోవాలన్నారు.
ఇదే ఆటతీరును ఫుట్ బాల్ ఆటలో చూపించి, భారత్ ఆ తరహాలో గోల్స్ నమోదు చేసి చూపించాలని వస్తున్న కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్ సాధించిన విజయాలను గుర్తించాలి తప్ప, దేశాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. ఆ తరహా వ్యాఖ్యలు ఆటకు మంచిదికాదన్నారు. కబడ్డీలో చేసే స్కోరు క్రికెట్ లో ఓ జట్టు చేసే స్కోరులో మూడో వంతు ఉంటుందని బిగ్ బి ట్వీట్ చేశారు. అమితాబ్ తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
T 2412 - India beat Argentina 74-20 in Kabaddi World Cup. HUGE CONGRATULATIONS INDIA ! Some comments saying (cont) https://t.co/1l87uHDHSb
— Amitabh Bachchan (@SrBachchan) 16 October 2016