
ఆలియా భట్... ఒక తెలివైన అమ్మాయి
తెలివికి జనరల్ నాలెడ్జ్ కొలబద్ద అయితే గూగుల్ కంటే జీనియస్ మరొకరు ఉండరు.ప్రాణం లేని కంప్యూటర్‌లో జ్ఞానం ఉండొచ్చు.కాని ప్రాణం ఉన్న మనిషికి అనుభవం ఉంటుంది. ఒక మనిషి జ్ఞానాన్ని అంచనా వేయాల్సింది సామర్థ్యం, అనుభవం, చేస్తున్న ప్రయాణాన్నిబట్టి. అంతే తప్ప జీకేను బట్టి కాదు. ఆలియా క్విజ్ ఆన్సర్ చేయలేదు. కాని కెమేరాకు భేషైన సమాధానం చెప్పగలదు.
జోసఫ్ కబీలా ఎవరో తెలుసా?ఆలోచించండి. తెలీదా? ఇతను కాంగో దేశ అధ్యక్షుడు. ఆ సంగతి మనకు తెలియనంత మాత్రాన మనం శుంఠలవుతామా? కాము. కనుక ఆలియా భట్ కూడా కాదు.
ఆలియా భట్‌ను ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు ‘హోలీ ఎందుకు చేసుకుంటారు’ ఎందుకు చేసుకుంటారో అందరికీ ఎందుకు తెలియాలి? ఆలియా భట్‌కు తెలియదు. అంత మాత్రాన ఆమెను దద్దమ్మ కింద జమ కట్టవచ్చా?
మగవాళ్లలో రాహుల్ గాంధీ మొద్దు పిల్లాడట. ఆడపిల్లల్లో ఆలియా భట్ మొద్దు అమ్మాయి అట. గుజరాత్ ముఖ్యపట్టణం ఏది, కాశ్మీర్‌లో ఏ నెలలో మంచు కురుస్తుంది, కన్యాకుమారి సముద్రపు లోతెంత.. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆమె జవాబు చెప్పలేదు. లేదా ఇలాంటి ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పలేకపోయింది. అంతమాత్రాన ఆమె మొద్దు అమ్మాయా? ఆమె మీద బోలెడు జోకులు పుట్టించారు. వాట్సప్‌లో ప్రచారం చేశారు.
అరె బడుద్ధాయ్... చుట్టూ వంద మంది చూస్తూ ఉండగా వంద లైట్లు వెలుగుతుండగా కెమెరా రోల్ అవుతూ ఉండగా డైరెక్టర్ యాక్షన్ అని చెప్తే ఒక్క నత్తు కొట్టకుండా డైలాగ్ చెప్తూ అద్దిరిపోయే ఎక్స్‌ప్రెషన్ ఇస్తుందే... అలా నువ్వు చెయ్యగలవా? మరి నిన్ను మొద్దు పిల్లాడు అనవచ్చునా? ఆలియా జీనియస్. అవును. జనరల్ నాలెడ్జ్‌లో కాదు. నటనలో నిజంగానే జీనియస్.
సినిమాల్లో నటించినంత మాత్రాన మన కోసం తెర మీద రకరకాల పాత్రలు పోషించినంత మాత్రాన వాళ్లు మనకు లోకువ అయిపోరాదు. వాళ్ల గురించి ఏదైనా సరే మాట్లాడేయవచ్చు అనే నైతిక హక్కు మనకు వచ్చేయరాదు. వాళ్ల జీవితాలు వాళ్లకుంటాయి. వాళ్ల కష్టాలు వాళ్లకుంటాయి. వాళ్ల ప్రయాణం, ఎదురు దెబ్బలు వాళ్లకుంటాయి. ఆలియా భట్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆ అమ్మాయి పేరు షాహీన్ భట్. ఆమె చాలా రోజులుగా డిప్రెషన్‌తో బాధ పడుతోంది. ఆమెకు నిద్ర పట్టదు. ఇన్‌సోమ్నియా. అలాంటి ఒక చెల్లెలు ఉంటే ఆ తోడబుట్టినదానికి ఎంత కష్టంగా ఉంటుంది. ఎంత ఆరాటంగా ఉంటుంది.
ఆ చెల్లెలి కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. ఏం చేయగలదు. తను డాక్టర్ కాదు. నటి. అందుకే అలాంటి పాత్ర చేసింది. ‘డియర్ జిందగీ’ సినిమాలో ఆలియా భట్ పోషించింది అలాంటి పాత్రనే. అందులో ఆలియాకు డిప్రెషన్ వస్తుంది. నిద్ర లేమి బాధిస్తుంది. సైకియాట్రిస్టుగా ఉన్న షారుక్ ఖాన్‌ను కలిసి ధైర్యం తెచ్చుకుని కౌన్సిలింగ్ ద్వారా సమస్య దూరం చేసుకుని జీవితంలో ముందుకు సాగుతుంది. తన చెల్లెలు వంటి ఇంకా అలా ఉన్న సవాలక్ష మంది ఆడవాళ్ల గురించి కూడా ఆలియా ఆ పాత్ర చేసి ఉండవచ్చు. మరి అంతటి బాధ్యత ఉన్న అమ్మాయిని మొద్దమ్మాయి అని అనవచ్చా?
ప్రాణసఖుడు అనే మాటను మనం వింటుంటాం. ఇది ఎవరో రాకుమారులకో చక్రవర్తులకో కాదు మహేష్ భట్‌కు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అతడు చాలామంది స్త్రీల ప్రాణసఖుడు. తన ఇరవయ్యో ఏటే కిరణ్ భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు నటి పూజ భట్, నటుడు రాహుల్ భట్ సంతానం. అయితే ఆ తర్వాత నటి పర్విన్ బాబీతో అతడి ప్రేమకథ మొదలైంది.
దాంతో మొదటి పెళ్లి పెటాకులు అయ్యింది. ఆ తర్వాత మహేష్‌భట్ నటి సోనీ రాజ్‌దాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా కలిగిన సంతానమే ఆలియా భట్, షాహీన్ భట్. ఈ పెళ్లి చేసుకున్నా మహేష్ తన సినీ జీవితంలో చాలా బిజీగా ఉండేవాడు. విడివిడిగా ఉన్నా అవసరమైనప్పుడు కలివిడిగా ఉండే కుటుంబం తమది అని వాళ్లు చెప్పుకుంటారు. అలాంటి వాతావరణంలో ఆలియా పెరిగింది. చదువులో అంతంత మాత్రం. పెద్దయ్యి ఏం కావాలి? దానికి సమాధానం గోవిందా, కరిష్మా కపూర్‌ల రూపంలో దొరికింది.
ఆలియా చిన్నప్పుడు టీవీలో వీడియో కేసెట్‌ల సినిమాలు బాగా చూసేది. ఆ కాలంలో గోవిందా, కరిష్మా కపూర్‌లు హిట్ పెయిర్. వాళ్ల పాటల్లో తరచూ విదేశాలు కనిపించేవి. ఆ వీధులు, సరస్సులు, కొండలు.. అవి కాదు ఆలియాను ఆకర్షించింది... పల్లవికి ఒక డ్రస్సు, చరణానికి ఒక డ్రస్సు వాళ్లు మార్చేవారు. అది చూసి ‘అరె... సినిమాల్లో యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా... చాలా డ్రస్సులు మార్చవచ్చు’ అని అనుకుంది ఆలియా. ఇంటర్ పూర్తయ్యాక లండన్ వెళ్లి ఏదైనా యాక్టింగ్ స్కూల్లో చేరి వద్దామని కూడా అనుకుంది. కాని ఈలోపలే అదృష్టం కరణ్ జోహర్ రూపంలో తలుపు తట్టింది. 2012. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో అవకాశం. నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్. జాక్‌పాట్‌లాంటి అవకాశం. కాని నిర్వర్తించడానికి చిన్న ఇబ్బంది ఉంది.
ఆలియా లావుగా ఉండేది. టీనేజ్‌లో ఉండే బేబీ ఫ్యాట్ అది. లేదా బాగా తినడం వల్ల వచ్చిన లావు కూడా కావచ్చు. ఆ లావు సగానికి తగ్గాలి అన్నాడు కరణ్ జొహర్. 17 ఏళ్ల వయసులో వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆలియా బరువు తగ్గడానికి నిశ్చయించుకుంది. తల్లి సోని రాజ్‌దాన్ సాయంతో డైటింగ్ మొదలెట్టింది. దాని వల్ల వచ్చిన ప్రమాదం తరచూ అనారోగ్యం పాలు కావడం. అంతే కాదు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లోకేషన్లలో చాలాసార్లు స్పృహ తప్పి పడిపోయేది. అంతే కాదు షూటింగ్‌లో రేయింబవళ్లు కష్టపడాల్సి వచ్చేది. ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అన్నీ చేసింది ఆలియా. అందరూ తెర మీద ఆమె మెరుపులాంటి సౌందర్యం చూశారు. దాని వెనుక పడ్డ కష్టం చూళ్లేదు. తనకు నచ్చిన రంగంలో రాణించడానికి ఇంత కష్టపడ్డ అమ్మాయి మొద్దమ్మాయి అవుతుందా?
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎవరైనా సరే చెంగు చెంగున గెంతే హీరోయిన్ వేషాలు వేసుకుని సుఖంగా ఉండేవారు. కాని ఆలియా మాత్రం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘హైవే’ పాత్రను అంగీకరించింది. పెళ్లి పీటల మీద నుంచి హైజాక్‌కు గురయ్యి, తనను హైజాక్ చేసిన మొరటు మనిషితోనే అనుబంధం పెంచుకునే పాత్ర అది. సినిమా అంతా డీ గ్లామర్‌గా పిచ్చి బట్టల్లో కనిపించాలి. రెండో సినిమాలోనే ఏ కొత్త హీరోయినూ అలా కనిపించదు. కాని ఆలియా నిర్ణయం సరైనది అని సినిమా రిలీజయ్యాక రుజువైంది. ‘హైవే’కు మంచి పేరొచ్చింది. ఆలియాకు ఇంకా మంచి పేరు. ఆలియా తెలివైనది.
ఆలియా ఇప్పటి వరకూ నటించిన సినిమాలు చూడండి. ‘టూ స్టేట్స్’, ‘హమ్టీ శర్మకి దుల్హనియా’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘ఉడ్‌తా పంజాబ్’... అన్నీ భిన్నమైనవి. ఆలియాను ఈ సినిమాలు స్టార్‌గా కూచోబెట్టాయి. ఎంత స్టార్ ఇమేజ్ రాకపోతే షారుక్ ఆమెను తన పక్కన నటించడానికి యాక్సెప్ట్ చేస్తాడు. చిన్నప్పుడు తాను నోరెళ్లబెట్టి టీవీలో చూసిన నటుడి పక్కన నాలుగైదు సినిమాలకే నటించే సత్తా తెచ్చుకుందంటే ఆ అమ్మాయి తెలివైనదే అవ్వాలి తప్ప మొద్దు కాదు. కాబోదు. ఆలియా తాజా సినిమా ‘బద్రీనాద్ కి దుల్హనియా’ ఈరోజే విడుదలవుతోంది.
ఆలియా బోలెడన్ని యాడ్స్ చేస్తోంది. బాగా డబ్బులొస్తున్నాయి. వాటిలో కొంత ‘పెటా’ వంటి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. విదేశాలలో షోస్ చేసి ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో వరద బాధితులకు సాయం చేసింది. ఎక్కడో ఉన్న కాంగో దేశపు అధ్యక్షుడు ఆమెకు తెలియకపోవచ్చు. కాని పొరుగున ఉన్న మనిషికి సాయం చేయడం తెలుసు. ఎందుకంటే ఆలియా– తెలివైన అమ్మాయి.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి