దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్ మళ్లీ అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు అభిమానుల్ని కలిసేందుకు నిర్ణయించారు. భద్రత కోరుతూ చెన్నై పోలీసులకు గురువారం రజనీ విజ్ఞప్తి చేశారు. బర్త్‌డే వేళ అభిమానులకు దూరంగా ఉన్న రజనీ ప్రస్తుతం భేటీకి సిద్ధం కావడంతో మళ్లీ రాజకీయ చర్చ ఊపందుకుంది.
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి లాగేందుకు ఆయన అభిమాన లోకం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో రజనీ రాజకీయాల్లోకి రావాలనే నినాదం మిన్నంటుతోంది. ఈ సమయంలో మే నెలలో అభిమానులతో రజనీకాంత్ సమావేశం కావడం, యుద్ధానికి సిద్ధం అవుదామని ఇచ్చిన పిలుపు రాజకీయంగా చర్చకు దారితీసింది.
అయితే, రాజకీయ ప్రవేశం గురించి రజనీ నాన్చుడు ధోరణి అనుసరించడం మొదలెట్టారు. అదే సమయంలో తాను వచ్చేశానంటూ లోక నాయకుడు కమల్ రాజకీయ ప్రకటన చేశారు. రాజకీయ ఎదుగుదల మీద దృష్టి పెట్టి అందుకు తగ్గ కసరత్తుల్లో విశ్వనాయకుడు నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ కథానాయకుడు సైతం రాజకీయాల్లోకి రావాలనే ఆశతో రజనీ అభిమానులు ఎదురుచూపుల్లో పడ్డారు.
ఈనెల 12న జరిగిన రజనీ 68వ బర్త్ డే వేళ రాజకీయ ప్రకటన వెలువడుతుందనే ఆశతో ఎదురుచూశారు. అయితే, ఎక్కడా రజనీ చిక్కలేదు. ఏకంగా అభిమానులకు దూరంగా బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల్ని పలకరించేందుకు వస్తున్నా...!అంటూ తలైవా ›ప్రకటించారు.
అభిమానులతో కథానాయకుడు
అభిమానుల్ని పలకరించేందుకు మళ్లీ రజనీ సిద్ధం అయ్యారు. రోజుకు వెయ్యి మందిని కలిసేందుకు నిర్ణయించారు. ఈనెల 26నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఆయన అభిమానులతో భేటీ కానున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 3 గంటలకు కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానుల్ని రజనీ కలవనున్నారు. ఈ భేటీకి భద్రత కల్పించాలని చెన్నై పోలీసులకు రజనీ లెటర్‌హెడ్ ద్వారా విజ్ఞప్తి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సమాచారం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో రాజకీయ చర్చ మళ్లీ ఊపందుకుంది. రజనీ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పదే పదే ఆయన సోదరుడు సత్యనారాయణ చెప్పుకుంటూ వస్తున్నారు. బర్త్ డే వేళ సైతం త్వరలో మంచి నిర్ణయాన్ని రజని ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అభిమానులతో రజనీ భేటీ కానుండడంతో రాజకీయ అరంగ్రేటం మీద నిర్ణయాన్ని తీసుకుంటారా? అనే చర్చ ఊపందుకుంది. రజనీని అభిమానించే కొన్ని ఇతర సంఘాల ప్రతినిధులు అయితే, ఇదే సరైన నిర్ణయం అని, అభిమానులతో చర్చించి రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment