
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఈ వేడుకకు వచ్చిన వారంతా ఏ విషయంపై ఎదురుచూస్తున్నారో ఊహించగలను, నేనేం చేసేది.. ఇంకా ఆ సమయం రాలేదు’ అని నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. చెన్నైలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కాలా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఆయన అనేక విషయాలను నర్మగర్భంగా ప్రస్తావించారు. రాజకీయ పార్టీ ప్రకటనపై మాత్రం ఇంకా జాప్యం జరగనున్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
‘‘గత నాలుగు దశాబ్దాలుగా నా పనైపోయిందని కొందరు హేళన చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రజలు, ఆ దేవుడు నేను ముందుకు సాగేలా చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు, ఆక్షేపణలు చేసినా నా మార్గంలో నేను పయనిస్తూనే ఉంటా. దక్షిణాదిన నదుల అనుసంధానం నా కల. ఒకవేళ ఈ కల నెరవేరకపోయినా ఫరవాలేదు. మన ఆలోచనలే బలం, మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలు తుడిచివేయండి, అపుడే జీవితం బాగుంటుంది. సినిమాల పరంగా అనేక విషయాలు మాట్లాడాను, అయితే అందరూ మరో విషయం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి’’అని రజనీ ప్రసంగం ముగించారు.