సాక్షి ప్రతినిధి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ 'రజనీ పేరవై' (రజనీ సమాఖ్య) పేరుతో సంస్థను ఏర్పాటుచేసి రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనే చెప్పినట్లుగా ఈనెల 31వ తేదీన పేరవైని ప్రకటిస్తారని అంటున్నారు.
రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నరజనీకాంత్ ఈ ఏడాది మేలో ఐదు రోజులు అభిమానులను కలిశారు. రెండో విడత సమావేశాలను ఈనెల 26వ తేదీన ప్రారంభించగా గురువారం మూడోరోజు నాటి సమావేశాలు జరిగాయి. చివరి రోజైన 31వ తేదీన రజనీ పేరవైని ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే, తాను హీరోగా నటించిన బాబా చిత్రంలో రజనీకాంత్ తన నాలుగువేళ్లలో రెండింటిని చిత్రంగా మడిచిన వైనం, అడుగున తెల్లతామరపువ్వు బొమ్మను 'రజనీ పేరవై' చిహ్నంగా పరిచయం చేయవచ్చని చెబుతున్నారు. 20-30 మధ్య వయస్కులైన యువకులను పేరవైలో సభ్యులుగా చేర్చుకునేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలకు ఆదేశాలు అందాయి.
ప్రస్తుతం పేరవైని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడమేకానీ, రాజకీయ పార్టీ ప్రకటన, అజెండా, జెండా వంటి వాటికి రజనీ వెళ్లరని సమాచారం. తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దుచేసే పరిస్థితులు అసన్నమైన వెంటనే రాజకీయ పార్టీ ప్రకటన చేయాలని రజనీ వ్యూహంగా ఉంది. నియోజవర్గాలవారీగా జనాభా, ఓటర్లు, స్థానిక సమస్యలపై సమాచారం సేకరించే బాధ్యతలను పేరవై ప్రతినిధులకు అప్పగిస్తారు. అంతేగాక తాను పార్టీ పెడితే కోలివుడ్ నుండి ఎవరెవరు వస్తారని రహస్య సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాంసాహార విందు ఇస్తా
కాగా, మూడోరోజైన గురువారం నాటి సమావేశానికి హాజరైన అభిమానులతో ఫోటోలు దిగిన రజనీకాంత్... మీకందరికీ మాంసాహార భోజనం వడ్డించాలని ఉంది, అయితే ఈ రాఘవేంద్ర కల్యాణ మండపంలో మాంసాహారం నిషేధమని అన్నారు. ఏదో ఒక రోజున తన అభిమానులందరికీ మాంసాహార విందు ఇస్తానని చెప్పారు. మధురై, విరుదునగర్, సేలం, నామక్కల్ జిల్లాలకు చెందిన అభిమానులు హాజరై రాజకీయాల్లోకి రావాలంటూ కాళ్లపైపడి బతిమాలుకున్నారు. దేవుడు, తల్లిదండ్రులకు మాత్రమే ముందుగా కాళ్లకు నమస్కారం చేయాలని రజనీ వారిని వారించారు.
Comments
Please login to add a commentAdd a comment