![Sushant Singh Rajput Demise Tollywood Celebrities Condolences - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/14/sushant-singh_11.jpg.webp?itok=PVd2PZ3L)
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) అనూహ్య మరణంపై టాలీవుడ్ తారాలోకం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సుశాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ పలువురు తెలుగు హీరోలు ట్వీట్లు చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. మంచి పేరు ప్రతిష్టలు, అందం, ఆరోగ్యం ఉన్నప్పటికీ సుశాంత్ మానసిక సమస్యలతో అర్ధాంతంగా తనువు చాలించాడని యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ట్విటర్‌లో పేర్కొన్నారు. కఠిన విమర్శలు లేదా ప్రశంసలు కొన్నిసార్లు నటీనటులకు మానసికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందని అన్నారు.
(చదవండి: సుశాంత్ ఆత్మహత్య : దర్యాప్తు ముమ్మరం)
‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణ వార్తలు విని షాకయ్యాను. అతను ప్రతిభావంతుడైన యువకుడు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అతని కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సుశాంత్ లేడన్న వార్తను నమ్మలేకపోతున్నానని రాంచరణ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న ప్రతిభ త్వరగా కనుమరుగైందని విచారం వ్యక్తం చేశారు. ‘సుశాంత్ మరణవార్త విని షాకయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కాగా, ముంబైలోని తన ఇంట్లో సుశాంత్ ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
(చదవండి: హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment