నాకిది పెద్ద టర్నింగ్ పాయింట్!
నాకిది పెద్ద టర్నింగ్ పాయింట్!
Published Tue, Mar 18 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
ఇప్పటివరకూ సొంత నిర్మాణ సంస్థ శ్రీనాగ్ కార్పొరేషన్ నిర్మించిన చిత్రాల్లోనే నటించిన సుశాంత్... తొలిసారి బయట సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్... సుశాంత్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేడు సుశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం వివరాలను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెలియజేస్తూ -‘‘నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ సుశాంత్‌కి సరిగ్గా సరిపోతుంది. సుశాంత్ కెరీర్‌కి మేలి మలుపుగా నిలిచే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను.
‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాం. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం ఏప్రిల్‌లో మొదలవుతుంది’’అన్నారు. సుశాంత్‌లోని అన్ని కోణాలను ఆవిష్కరించడమే లక్ష్యంగా తయారు చేసుకున్న కథ ఇదని దర్శకుడు చెప్పారు. ‘‘నా బర్త్‌డే కానుక ఈ సినిమా. బయట సంస్థలో చేస్తే ఓ పెద్ద సంస్థలోనే చేయాలని ఇప్పటిదాకా ఎదురు చూశాను. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ నిర్మించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌గారి సంస్థలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందీ సినిమా’’అని సుశాంత్ నమ్మకం వెలిబుచ్చారు. భోగవల్లి బాపినీడు ఈ చిత్రానికి సహ నిర్మాత.
Advertisement
Advertisement