
నేను అదే కోరుకుంటానని అంటున్నారు నటి తమన్నా. ఈ గుజరాతీ బ్యూటీకి సినిమా అనుభవం చాలా ఎక్కువనే చెప్పాలి. అప్పుడెప్పుడో 2005లో 15 ఏళ్ల వయసులో నటిగా రంగప్రవేశం చేశారు. తొలుత బాలీవుడ్‌లో నటించి ఆపై టాలీవుడ్, కోలీవుడ్ అంటూ చుట్టేసింది. అలా నటిగా దశాబ్దంన్నరకు రీచ్ అయ్యారు. అయినా ఇప్పుటికీ కథానాయకిగా బిజీగానే కొనసాగుతోంది. ప్రభుదేవాతో జత కట్టిన దేవి 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు.
హిందీలోనూ ఖామోష్ అనే చిత్రంలో నటిస్తున్న తమన్నా, తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ప్రధాన భూమికను పోషిస్తున్నారు. ఇక కోలీవుడ్‌లో విశాల్‌తో నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిత్రాలు బాగా ఆడితే నిర్మాతలకు, బయ్యర్లకు, థియేటర్ యాజమాన్యానికి లాభాలు వస్తాయనని.. అది తనకూ సంతాషాన్ని కలిగిస్తుందని చెప్పారు.
అదే విధంగా తాను నటించని చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకుంటానని.. కారణం చిత్ర పరిశ్రమ బాగుండాలంటే అన్ని చిత్రాలు విజయం సాధించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా రంగం పచ్చగా ఉంటేనే నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం సంతోషంగా ఉంటారన్నారు. అందుకే సినిమాల విజయాలు చాలా అవసరం అని.. అయితే ఇప్పుడు 100 చిత్రాలు విడుదలయితే అందులో 10 చిత్రాలే ప్రజాదరణ పొందుతున్నాయని, ఇది బాధాకరమైన విషయం అన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభిమానుల అభినందనలను పొందడం సులభం కాదన్న తమన్నా, ఇలాంటి పరిస్థితుల్లో చిత్రాల విజయాలు చాలా ముఖ్యమన్నారు. అదేవిధంగా విజయవంతమైన చిత్రాల్లో తానున్నానని సంతోషం పడడం కాకుండా ఏ చిత్రం సక్సెస్ అయినా సంతోషపడతానని తెలిపారు.
నటన తన వృత్తి అని, ఈ రంగం తనదన్నారు . ఇక్కడ ఒంటరిగా ఎవరూ జయించలేరని, ఒక చిత్ర విజయం వెనుక చాలా మంది కృషి, శ్రమ ఉంటాయన‍్నారు. అయితే టాలీవుడ్‌లో ఎఫ్ 2 చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ మిల్కీబ్యూటీకి కోలీవుడ్‌లోనూ ఒక హిట్ అర్జెంట్‌గా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ బ్యూటీ సక్సెస్ చూసి చాలా కాలమే అయ్యింది.