తమన్నకో లక్కీచాన్స్! | Tamanna act's with kamalhassan | Sakshi
Sakshi News home page

తమన్నకో లక్కీచాన్స్!

Published Sat, Oct 24 2015 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

తమన్నకో లక్కీచాన్స్! - Sakshi

తమన్నకో లక్కీచాన్స్!

తారల విషయానికి వస్తే విశ్వనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి వారితో నటించాలని ప్రముఖ నటీమణులు సైతం కలలు కంటుంటారు. ఆ విధంగా నటి త్రిషకు కమలహాసన్‌తో రెండుసార్లు కలిసి నటించే అవకాశాం కలిగినా రజనీకాంత్‌తో నటించే అవకాశం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. అదే విధంగా నయనతార, అనుష్క వంటి స్టార్ హీరోయిన్లు రజనీకాంత్‌తో నటించే అవకాశాల్ని అందిపుచ్చుకున్నా కమలహసన్‌తో నటించే అదృష్టం ఇప్పటి వరకూ కలగలేదు. ఇక తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మరో నటి తమన్న.

ఈ బ్యూటీకి ఇప్పటి వరకూ అలాంటి అవకాశాలు దక్కక పోయినా తాజాగా ఒక కల నెరవేరబోతోందని సమాచారం. అదే విశ్వనాయకుడు కమలహాసన్‌తో నటించే లక్కీఛాన్స్. కమలహాసన్ తన చిత్రాల వేగాన్ని పెంచారన్న విషయం తెలిసిందే. ఆ విధంగా ఆయన తూంగావనం చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేశారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కమల్ శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. తూంగావనం తమిళం,తెలుగు భాషల్లో దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది. కమలహాసన్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యిపోయారు.

మలయాళ దర్శకుడి దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు జరిగినా తాజాగా తూంగావనం చిత్ర దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలోనే మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సీనియర్ దర్శుకుడు మౌళి కథను తయారు చేసినట్లు దర్శకుడు లింగసామి తిరుపతి బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో కమలహాసన్ సరసన నటించే హీరోయిన్ల కోసం పలువురు నటీమణుల పేర్లు పరిశీలించినా చివరకు నటి తమన్నను లక్కీఛాన్స్ వరించినట్లు కోలీవుడ్ టాక్. ఈ మిల్కీబ్యూటీ ఇంతకు ముందు తిరుపతి బ్రదర్స్ సంస్థలో పైయ్యా చిత్రంలో నటించారు.

దీంతో తాజాగా కమల్ సరసన తమన్నను నటింపజేయడానికి ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక్కడ చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే మన హీరోయిన్లకు మూడు పదుల వయసు దాటిన తరువాత అదృష్టం మరోసారి పలకరిస్తుండడం విశేషం. నయనతార, అనుష్క, తాజాగా త్రిష వీళ్లంతా మూడు పదుల వయసుకు చేరుకున్న వాళ్లే. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న వాళ్ళే. తమన్న బాహుబలి చిత్రంతో మళ్లీ నటిగా పుంజుకున్నారు.ప్రస్తుతం తెలుగులో బెంగాల్ టైగర్ చిత్రాన్ని పూర్తి చేశారు. నాగార్జున, కార్తీలతో ద్విభాషా చిత్రం దోస్త్(తెలుగులో ఊపిరి)చిత్రంతో పాటు బాహుబలి-2లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement