
ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లు నలుగురు రాణులు ఒకేసారి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారట. హిందీ హిట్ ‘క్వీన్’ సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రధారిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’ రూపొందింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహారావు, మాస్టర్ సంపత్ కీలక పాత్రలు చేశారు. బాలీవుడ్ స్టార్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ వెర్షన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటించారు. మలయాళంలో మంజిమా మోహన్ నాయికగా ‘జామ్ జామ్’ టైటిల్‌తో రీమేక్ అయింది.