చెన్నై : నేనెందుకు అలాంటి పని చేస్తాను అంటోంది నటి తమన్నా. ఈ అమ్మడు బాలీవుడ్‌లో స్ట్రాంగ్‌గా పాదం మోపాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అడపాదడపా అక్కడ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే మంచి హిట్ ఈ బ్యూటీని వరించడం లేదు. ఈ భామ ఎలాగైనా అక్కడ నిలదొక్కుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ముందుగా ముంబాయిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకుని ఇటీవలే అక్కడ ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ముంబాయిలోని వెర్సోవా ప్రాంతంలో చదరపు అడుగును రూ.80,778 చొప్పున 2,055 చదరపు అడగుల విస్తీర్ణంతో కూడిన ఈ ఫ్లాట్‌ను రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. అంతవరకూ బాగానే ఉంది. ముందే చెప్పినట్లుగా హీరోయిన్లు ఏం చేసినా మీడియా కాస్త అతి చేస్తుంటుంది. తమన్నా నూతన ఫ్లాట్ విషయంలోనూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. తమన్నా మార్కెట్ రేటు కంటే డబుల్ ధర వెచ్చించి ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు దుమ్మురేపే ప్రచారం చేసేసింది.
ఇలాంటి ప్రచారం నటి తమన్నా హింది టీచర్‌ను కూడా స్పందించేలా చేసిందట. ఆమె తమన్నాకు ఫోన్ చేసి ఎందుకు రెట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ కొనుగోలు చేశావు? అని ప్రశ్నించిందట. ఆ తరువాత ఒక్కొక్కరు ఇలాంటి ప్రశ్నలే వేస్తున్నారట. ఈ విషయాన్ని నటి తమన్నానే స్వయంగా వెల్లడించింది. తన ఫ్లాట్ గురించి ఎంత చర్చ జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని అంది. తాను రెంట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ ఎందుకు కొంటానని ప్రశ్నించింది. తాను ముంబాయిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయం నిజమేనని, అయితే రెట్టింపు ధరను మాత్రం చెల్లించలేదని వివరించింది. ఆ ఫ్లాట్ పూర్తయిన తరువాత తన తల్లిదండ్రులతో కలిసి అందులో నివాసం ఉండనున్నట్లు తమన్నా తెలిపింది. ఈ అమ్మడు 2055 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్‌ను సమీర్ బోజ్‌వాణి అనే వ్యక్తి నుంచి రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్టు స్పష్టత ఇచ్చి ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో విశాల్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, హిందిలో ఒక చిత్రం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment