సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గ్లామరస్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా తనూశ్రీ దత్తా తన తోటి బాలివుడ్ నటుడు నానా పటేకర్ మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితమే అంటే, 2008లోనే ఆమె ఈ విషయాన్ని ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు ఫిర్యాదు చేసినట్లు నాటి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే అప్పుడు అలా వేధింపులకు గురిచేసిందీ నానా పటేకర్ అనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ విషయాన్ని తనశ్రీయే తనంతట తాను బయట పెట్టారు. నాడు ఆమె ఫిర్యాదుపై ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నేడు తనూశ్రీకి మద్దతుగా నిలుస్తున్న బాలీవుడ్ పరిశ్రమ తీసుకుంటుందన్న నమ్మకాలు లేవు. ‘క్యాస్టింగ్ కౌచ్’గా పిలిచే మహిళా నటిమణుకు లైంగిక వేధింపుల సమస్య ఈ నాటిని కాదు. ఒక్క బాలీవుడ్‌కే పరిమితమైనదీ కాదు. హాలీవుడ్ నుంచి టాలివుడ్ వరకు విస్తరించి ఉంది. దీనికి వ్యతిరేకంగా తెలుగునాట శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొదట సినీ రేప్ దశ్యాలతో మొదలైన ఈ క్యాస్టింగ్ కౌచ్ ప్రక్రియ నిజ జీవితంలోని పడక గదుల్లోకి పాకింది.
ఆమె ఆహాభావాల కోసమే అలా చేశారా!
ప్రముఖ కళాత్మక చిత్రాల ఇటలీ దర్శకుడు బెర్నార్డో బెర్తోలూచిపైన హీరోయిన్ మారియా స్నైడర్ చేసిన బహిరంగ ఆరోపణలతో మొదటిసారి ఇలాంటి వేధింపుల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ‘ది లాస్ట్ టాంగో ఇన్ పారిస్’ చిత్రంలో రేప్ సీన్ గురించి దర్శకుడు తనకు పూర్తిగా చెప్పకుండా సినిమా తీశారని, ఆ సినిమాలో అర్ధనగ్న దశ్యాల కారణంగా తన పరువు పోయిందని మారియా ఆరోపించారు. ఓ సినీ నటిగా కాకుండా నిజమైన అమ్మాయిగా ఆమె ఆహాభావాలు ఆ సమయంలో ఎలా ఉంటాయో రాబట్టేందుకే రేప్ సన్నివేశం గురించి ఆమెకు పూర్తిగా వివరించలేదని బెర్తోలూచి అందుకు సమాధానం ఇచ్చుకున్నారు. అదీ నిజమే కావచ్చు.
కానీ సినీ పరిశ్రమ రేప్ సీన్ల కుసంస్కతి నుంచి పడక గదుల విష సంస్కతి వరకు విస్తరించేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రముఖ హాలివుడ్ సినీ నిర్మాత హార్వే విన్‌స్టెయిన్‌కు వ్యతిరేకంగా తమను లైంగికంగా వేధించారంటూ ‘మీ టూ’ ఉద్యమం పేరిట దాదాపు 70 మంది నటీమణులు బయటకు వచ్చారు. వారిలో ఏంజెలినా జోలి మొదలుకొని దాదాపు 20 మంది హీరోయిన్లు ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ ఒక్కొక్కరు బయటకు వస్తూ తమకూ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయిని చెబుతున్నారు. గతంలో హీరోయిన్ రిచా చద్ధా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. దర్శకుడు మధుర్ భండార్కర్, ఫాంటమ్ ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు వికాస్ బహల్‌కు వ్యతిరేకంగా కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చాలా వరకు కోర్టుల వరకు వెళ్లక పోవడం వల్లనే తనశ్రీ దత్తాలు ఇంకా పుట్టుకొస్తున్నారు.
అమితాబ్ తీరు ఆశ్చర్యకరం..
దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రఫర్లు, హీరోల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న సినీ తారలు ప్రస్తుతం ‘నేమింగ్ అండ్ షేమింగ్’ వరకే పరిమితం అవుతున్నారు. వారు కోర్టు తలుపులు తట్టేవరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకోవడం భ్రమే. బిగ్ బీగా పేరొంది ప్రభుత్వంలోనూ ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన అమితాబ్ బచ్చన్ దష్టికి తనశ్రీ అంశాన్ని మీడియా తీసుకెళితే తాను స్పందించేందుకు ‘నేను నానా పటేకర్‌ను కాను, తనూశ్రీని కాను’ అంటూ తప్పించుకున్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఉన్న ఆయనే ఆ మాటలనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?
2013 నాటి చట్టం ఓ ఆయుధం
పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ‘ది సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్–2013’ను తీసుకొచ్చింది. పది మంది ఉద్యోగులను మించిన ప్రతి కంపెనీలో, ప్రతి పరిశ్రమలో మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు విధిగా కనీస సభ్యులలో ఓ కమిటీ ఉండాలి. ఆ కమిటీలిచ్చే నివేదికలపై కోర్టులు వేగంగా స్పందిస్తాయి. ఈ చట్టం కింద మూడేళ్ల వరకు జైలు, 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మహిళలు చేసే తప్పుడు ఆరోపణల నుంచి మగవాడికి విముక్తి కలిగించే నిబంధనలు కూడా ఆ చట్టంలో ఉండడం విశేషం. తనూశ్రీలు కోర్టుకెళ్లినప్పుడేగదా వారి మాటల్లోని నిజానిజాలు బయటకొచ్చేవి! దేశంలో ఇప్పటి వరకు 36 శాతం కంపెనీల్లో మాత్రమే ఇలాంటి కమిటీలు ఉన్నాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చొరవ వల్ల బాలీవుడ్‌కు చెందిన ఏడు చలనచిత్ర పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు ఏర్పాటయ్యాయి. గతేడాది దర్శకుడు వికాస్ బహల్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చినప్పుడు ‘ఫొంటమ్ ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థలో కమిటీని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment