రారాజుగా తారక్?
రారాజుగా తారక్?
Published Fri, Sep 27 2013 1:43 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
రారాజు సుయోధన సార్వభౌముడు అనగానే... మన కళ్లల్లో తళుక్కున మెరిసే రూపం ‘ఎన్టీఆర్’. మూర్తీభవించిన రాజసంతో మదగజంపై రారాజుగా ఆ మహానటుడు వస్తోంటే... ప్రేక్షకులు పులకించిపోయారు. ‘ఆచార్యదేవా... ఏమంటివి ఏమంటివి...’ అంటూ ‘దానవీరశూర కర్ణ’లో అన్నగారు డైలాగులు చెబుతుంటే... వేదమంత్రాలు విన్నట్టు విన్నారు.
తన అసమాన అభినయ కౌశలంతో దుర్యోధనుణ్ణి కూడా హీరోని చేసిన ఘనుడు ఎన్టీఆర్. రారాజుగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో నేటికీ స్థిరంగా నిలిచే ఉంది. అందుకే ఆ గెటప్‌లో కనిపించడానికి కూడా ఏ హీరో సాహసించడు. అప్పుడెప్పుడో ‘దేశోద్ధారకుడు’ సినిమాలో బాలకృష్ణ కాసేపు రారాజుగా కనిపించారు. అప్పుడు బాలయ్యలో కూడా ఎన్టీఆర్‌నే చూసుకున్నారు ప్రేక్షకులు. మళ్లీ ఇప్పుడు అలాంటి సాహసమే తారక్ చేస్తున్నాడని సమాచారం.
‘రామయ్యా వస్తావయ్యా’లో ఓ కీలక సన్నివేశంలో తారక్ రారాజుగా ఎన్టీఆర్ గెటప్‌లో కనిపిస్తారట. ‘యమదొంగ’లో అన్నగారి డైలాగు చెప్పి భేష్ అనిపించుకున్నాడు తారక్. మరి ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ గెటప్‌లోనే కనిపించబోతున్నాడు. ఆ సన్నివేశం మినహా ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఆ ఎపిసోడ్‌ని చిత్రీకరించడానికి దర్శకుడు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారట.
Advertisement
Advertisement